
అమెరికా ఇటీవల భారత్‌పై విధించిన సుంకాల నేపథ్యంలో దేశీయ రొయ్యల ఎగుమతిదారులు ఆందోళన చెందకూడదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. భారత రొయ్యలకు అమెరికా మార్కెట్‌కు కీలకమే అయినా అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్కెట్లను అన్వేషించాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈక్వెడార్‌ను పరిశీలించవచ్చని సూచిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం సీఫుడ్‌తో సహా వివిధ రకాల భారతీయ దిగుమతులపై 25% సుంకాన్ని అదనంగా విధించింది. దాంతో ఇది 50 శాతానికి చేరింది. భారతదేశ సీఫుడ్ ఎగుమతిదారులకు, ముఖ్యంగా రొయ్యల రంగంలోని వారికి ఈ నిర్ణయం తీవ్ర ఆందోళనకు దారితీసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు చేసిన సుమారు 2.5 బిలియన్ డాలర్ల విలువైన సీఫుడ్ ఎగమతుల్లో రొయ్యలు సుమారు 92% వాటాను కలిగి ఉన్నాయి.
అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్
2030 నాటికి సీఫుడ్ ఎగుమతుల్లో 18 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎంపీఈడీఏ)కు యూఎస్ టారిఫ్‌లు సవాలుగా మారాయి. అమెరికా కొన్నేళ్ల నుంచి భారతదేశ సీఫుడ్ కొనుగోలుదారుగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా తయారయ్యాయి. దేశంలో ఉత్పత్తవుతున్న రొయ్యలకు అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్కెట్లను అన్వేషించాలని నిపుణులు చెబుతున్నారు.
మెరుగైన భాగస్వామిగా ఈక్వెడార్?
భారత్‌తో వాణిజ్య-స్నేహపూర్వక దేశాల్లో రొయ్యల మార్కెట్‌ను విస్తరించాలని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఈక్వెడార్ భారత రొయ్యల మార్కెట్‌కు మెరుగైన భాగస్వామిగా నిలుస్తుందంటున్నారు. ఈక్వెడార్ ఇప్పటికే రొయ్యల ఉత్పత్తిలో గ్లోబల్ పవర్‌హౌజ్‌గా ఉంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సరఫరా గొలుసులు, బలమైన ఎగుమతి నెట్‌వర్క్ ఉంది. ఫీడ్ మిల్లులు, హేచరీలు, అధునాతన ప్రాసెసింగ్ యూనిట్లు, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఈక్వెడార్‌లో మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు.
భాగస్వామ్యం-వ్యూహాత్మకం
భారత్, ఈక్వెడార్ రెండూ ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధర రొయ్యల ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. మెరుగైన నిర్వహణ సామర్థ్యం, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి చెందిన భారతీయ కంపెనీలు ఈక్వెడార్ ప్రస్తుత పద్ధతులతో బాగా సమన్వయం చేయగలవని నిపుణులు నమ్ముతున్నారు. భారతదేశం ప్రధానంగా మెరుగైన విస్తృత వ్యవస్థలను ఉపయోగిస్తుండగా, ఈక్వెడార్ సెమీ ఇంటెన్సివ్ నమూనాలపై ఆధారపడుతుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు అవకాశం లభిస్తుంది. ఈక్వెడార్‌లో రొయ్యల పెంపకంలో ఉత్పాదకత, సుస్థిరతను పెంచడానికి భారతీయ సంస్థలు ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులను అందించగలవని మార్కెట్ నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రెండు నెలలుగా పాకిస్థాన్‌కు ఫార్మా ఎగుమతులు బంద్