
భారత్ నుంచి పాకిస్థాన్‌కు చేసే ఫార్మా ఎగుమతులు రెండు నెలలుగా కస్టమ్స్ వద్ద నిలిచిపోవడంతో భారత ఔషధ ఎగుమతిదారులు అనిశ్చితితో సతమతమవుతున్నారు. ఫార్ములేషన్లు, వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ)తో సహా పాకిస్థాన్‌కు ఏటా 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఫార్మా ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. పాకిస్థాన్‌తో భారతదేశం 2025 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతుల్లో 18% వృద్ధిని నమోదు చేసింది. అయితే 2025 మే తర్వాత కస్టమ్స్ అనుమతులు నిలిపివేయడంతో దేశీయ ఎగుమతిదారులు ఆందోళన చెబుతున్నారు.
కశ్మీర్‌లో పర్యాటకులపై దాయాది దేశం ఉగ్రదాడి, ఆ తర్వాత సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు ప్రతిస్పందనగా భారత్ అధికారికంగా పాకిస్థాన్‌తో అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. సస్పెన్షన్ తర్వాత కూడా ఫార్మా ఎగుమతులు కొంతకాలం కొనసాగినప్పటికీ, అధికారిక వివరణ లేకుండా ఫార్మా ఎగుమతులు కొద్దికాలంలోనే నిలిచిపోయాయి. పాకిస్థాన్‌తో ట్రేడ్ సస్పెన్షన్ తర్వాత కొన్ని వారాల పాటు ఎగుమతులను కొనసాగించామని, సాధారణంగా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని భావిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కానీ కస్టమ్స్ క్లియరెన్స్ అకస్మాత్తుగా ఆగిపోయిందని, ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదని చెప్పారు.
‘ఔషధ ఎగుమతులపై నిషేధాన్ని సాధారణంగా మానవతా ప్రాతిపదికన ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక ఆంక్షల నుంచి మినహాయిస్తారు. అయితే ఇప్పటివరకు బహిరంగంగా ఎటువంటి అధికారిక నిషేధం లేదా నోటిఫికేషన్ జారీ చేయలేదు. దాంతో ఎగుమతుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ సహా కీలక ఫార్మా హబ్‌ల్లో ఎగుమతిదారులు ఆర్థిక, కాంట్రాక్టు చిక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’ అని సీనియర్ అధికారి చెప్పారు.
ఈ సమస్యకు పరిష్కారంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) గత నెలలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ)కి అధికారిక వినతిపత్రాన్ని సమర్పించింది. పాకిస్థాన్‌కు ఔషధ ఎగుమతులను నిషేధించడం లేదా పరిమితం చేయడంపై ఏదైనా అధికారిక నోటిఫికేషన్ ఉందా?.. ఉంటే కంపెనీలకు స్పష్టమైన కటాఫ్ తేదీ వివరాలు ఏవైనా ఉన్నాయా అని వివరణ కోరింది. దీనిపై డీజీఎప్‌టీ నుంచి స్పష్టత రావాల్సి ఉందని ఫార్మెక్సిల్ ప్రతినిధి తెలిపారు.
ఇదీ చదవండి: బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు