ఇమ్రాన్‌ఖాన్‌ హత్య? | Where Is imran Khan In Adiala Jail or Not Sisters Demand | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ఖాన్‌ హత్య?

Nov 26 2025 5:56 PM | Updated on Nov 27 2025 7:54 AM

Where Is imran Khan In Adiala Jail or Not Sisters Demand

అడియాలా జైల్లో గుట్టుగా మట్టుబెట్టినట్టు గుప్పుమన్న వార్తలు

ధ్రువీకరించని పాక్‌ ∙మూడు వారాలుగా కలవనివ్వడం లేదు: కుటుంబీకుల ఆవేదన

ఇస్లామాబాద్‌: రాజకీయ హత్యలకు పెట్టింది పేరైన పాకిస్తాన్‌లో మరో మాజీ ప్రధాని రక్తం చిందిందా? పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) సారథి, అలనాటి మేటి క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ హత్యకు గురయ్యారా? రాజకీయ నిర్బంధానికి గురై 2023 నుంచీ జైల్లోనే మగ్గుతున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారా? గత జనవరి నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉంటున్న 72 ఏళ్ల ఇమ్రాన్‌ను అక్కడే సైలెంట్‌గా చంపేశారంటూ అఫ్గాన్‌ టైమ్స్‌ అనే సోషల్‌ మీడియా హాండిల్‌ ఎక్స్‌లో పెట్టిన పోస్టు బుధవారం పెను దుమారమే రేపింది. 

అత్యంత విశ్వసనీయ వర్గాలే తమకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు అది పేర్కొంది. దాంతో చూస్తుండగానే సోషల్‌ మీడియా అంతా ఈ వార్తలతోనే ఊగిపోయింది. పాక్‌కు చెందిన పలు సైట్లు కూడా ఇమ్రాన్‌ కుటుంబీకులు, పీపీపీ నేతలను ఉటంకిస్తూ ఇదే విషయాన్ని ప్రచారంలో పెట్టాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణగానీ, ఖండన గానీ వెలువడకపోవడం గమనార్హం. దాంతో పాక్‌వ్యాప్తంగా ఇమ్రాన్‌ అభిమానులు, పీపీపీ కార్యకర్తలు, నేతలు వీధుల్లోకి వచ్చి ఆందోళన బాట పట్టారు. అడియాలా జైలును ముట్టడించే ప్రయత్నం చేశారు.

 జైల్లో తనను చిత్రహింసలు పెడుతున్నారని ఇమ్రాన్‌ గత జూలైలో ఆరోపించారు. జైలు సూపరింటెండెంట్‌తో కలిసి తనను ఏదో చేసేందుకు ఒక కల్నల్‌ రంగంలోకి దిగినట్టు పేర్కొన్నారు. తనకు ఏమన్నా అయితే ఆర్మీ చీఫ్‌ సీఎం మునీర్‌నే అందుకు బాధ్యున్ని చేయాలని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపు నిచ్చారు. జైలు అధికారులు తనను విపరీతంగా వేధిస్తున్నా రని ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ను కలిసేందుకు తమను అనుమతించడం లేదని బుధవారం ఆయన కుటుంబీకులు ఆరోపించిన కాసేపటికే ఇలా హత్య వార్త ప్రచారంలోకి వచ్చింది. 

పాక్‌ సైన్యమే ఆయన్ను పొట్టన పెట్టుకుందంటూ ఎక్స్‌ సహా అన్ని సోషల్‌ సైట్లలోనూ పోస్టులు వెల్లువెత్తాయి. పైగా ఇమ్రాన్‌ను చూపించాలంటూ జైలు వెలుపల ధర్నాకు దిగిన ఆయన సోదరీమణులను పోలీసులు కొట్టి వెళ్ళగొట్టారన్న వార్తలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోశాయి. ప్రధానిగా ఉంటూ పాక్‌లో అత్యంత శక్తిమంతమైన సైన్యంతో పెట్టుకున్న కొద్ది రోజులకే ఇమ్రాన్‌ పదవీచ్యుతుడు కావడం తెలిసిందే. ఆ వెంటనే పలు అవినీతి ఆరోపణలపై ఆయన జైలుకెళ్లారు. తర్వాత ఒక్కొక్క కేసులో ఆయనకు శిక్ష పడుతూ వచ్చింది.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement