భూమి ఉపరితలం కింద నిద్రాణంగా దాగివున్న శక్తి ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చి, ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అనేక వేల సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉన్న నాలుగు అగ్నిపర్వతాలు ఈ ఏడాది(2025)తమ ప్రతాపాన్ని చూపాయి. ఈ విస్ఫోటనాలు ప్రపంచవ్యాప్తంగా విమానయానం, వ్యవసాయం, స్థానిక కమ్యూనిటీల భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ఈ అనూహ్య ఘటనలు అగ్నిపర్వత శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ బృందాలకు నిరంతర హెచ్చరికగా నిలిచాయి.
హేలీ గుబ్బి (ఇథియోపియా)
2025 నవంబర్ 23న సంభవించిన ఇథియోపియాలోని హేలీ గుబ్బి విస్ఫోటనం అత్యంత భీకరమైనది. దాదాపు 10,000 నుండి 12,000 సంవత్సరాల నిద్రాణస్థితి తర్వాత ఈ అగ్నిపర్వతం బద్దలయ్యింది. ఈ భారీ విస్ఫోటనం కారణంగా బూడిద ధూళి ఏకంగా 14 కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణంలోకి ఎగసిపడింది. ఈ బూడిద ప్లూమ్ పశ్చిమం నుండి తూర్పుకు ప్రయాణించి, ఎర్ర సముద్రం మీదుగా దాటుకుని దక్షిణ ఆసియా వరకు వ్యాపించింది. ఫలితంగా భారతదేశంలో 28 విమానాలను దారి మళ్లించవలసి వచ్చింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదిలరప్రాంతాలలో గాలి నాణ్యతపై హెచ్చరికలు జారీ చేశారు.
కాన్లాన్ అగ్నిపర్వతం
ఫిలిప్పీన్స్‌లోని కాన్లాన్ అగ్నిపర్వతం 2025 ప్రారంభంలో తీవ్ర విస్ఫోటనాలకు గురైంది. దీని ప్రభావంతో నీగ్రోస్ ద్వీపం నుండి వేలాది మందిని తక్షణమే తరలించవలసి వచ్చింది. దీని నుంచి వెలువడిన బూడిద వర్షం స్థానిక వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మెక్సికోలోని ‘పోపోకాటెపెట్ల్’ తన కార్యకలాపాలలో భాగంగా బూడిద ఉద్గారాలను విడుదల చేసింది. ఈ బూడిద మేఘాలు విమాన రాకపోకలకు అంతరాయం కలిగించాయి. సమీపంలోని పట్టణాలను దట్టంగా కమ్మేశాయి. ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేశాయి.
మౌంట్ ఎట్నా (ఇటలీ)
యూరప్‌లో, సిసిలీ ద్వీపంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం స్వల్ప నిశ్శబ్ద దశ తర్వాత 2025లో మళ్లీ విస్ఫోటనాలతో యాక్టివ్‌గా మారింది. ఈ విస్ఫోటనాలలో ప్రత్యక్ష లావా ప్రవాహాలను వెదజల్లే అరుదైన హార్నిటో వెంట్స్ కనిపించాయి. అద్భుతమైన లావా ఫౌంటెన్లు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ సమయంలో వెలువడిన బూడిద సిసిలియన్ పట్టణాలపై పడి, స్థానిక అధికారులకు పలు సవాళ్లను సృష్టించింది.
విస్ఫోటనం వెనుక..
అగ్నిపర్వత విస్ఫోటనం అనేది భూమి అంతర్భాగంలో జరిగే అధిక పీడన ఫలితం. భూమి ఉపరితలం కింద వేడి వల్ల శిలలు కరిగి మాగ్మా (Magma) ఏర్పడుతుంది. ఈ మాగ్మా తేలికగా ఉండటం వల్ల పైకి లేస్తుంది. మాగ్మా చాంబర్లలో నిల్వ అవుతుంది. మాగ్మాలో చిక్కుకున్న వాయువులు (ముఖ్యంగా నీటి ఆవిరి) బయటకు పోవడానికి మార్గం లేకపోవడం వల్ల ఆ చాంబర్‌లో పీడనం విపరీతంగా పెరిగిపోతుంది. చివరకు, ఈ అంతర్గత పీడనం భూమి పలకలలోని బలహీనమైన పగుళ్ల ద్వారా మాగ్మా, బూడిద, వాయువులను బలవంతంగా ఉపరితలంపైకి నెట్టివేస్తుంది. దీనినే విస్ఫోటనం అంటారు.
ఇది కూడా చదవండి: రాజ్యాంగానికి రూపం ఇచ్చిన మహానుభావులు


