భారత రాజ్యాంగం అంటే కేవలం డా. బి.ఆర్. అంబేద్కర్ పేరు మాత్రమే కాదు. ఆయనను "రాజ్యాంగ శిల్పి"గా గుర్తించినా, రాజ్యాంగ రూపకల్పన వెనుక పలువురు మేధావుల కృషి ఉంది. స్వాతంత్య్రానంతరం దేశానికి దిశానిర్దేశం ఇచ్చిన ఈ మహత్తర పత్రం.. అనేక మంది నాయకులు, న్యాయవేత్తలు, పండితులు, స్వాతంత్ర్య సమరయోధుల కలయికతో రూపుదిద్దుకుంది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్: అంబేద్కర్ రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీ (Drafting Committee)కి ఛైర్మన్‌గా వ్యవహరించారు. దాదాపు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల పాటు సాగిన రాజ్యాంగ రచన ప్రక్రియకు ఆయన మార్గదర్శకత్వం వహించారు.
డా. రాజేంద్ర ప్రసాద్
డా. రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన కేవలం సమావేశాలకు అధ్యక్షత వహించడమే కాకుండా, భిన్నాభిప్రాయాలున్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికి, సభ చర్చలను క్రమబద్ధంగా, సమర్థవంతంగా నడిపించడానికి అపారమైన సమన్వయ నైపుణ్యాలను ప్రదర్శించారు. సభ గౌరవం, నిష్పాక్షికతను కాపాడారు.
తొలి రాష్ట్రపతి: రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత, ఆయన 1950 నుండి 1962 వరకు భారతదేశ మొదటి రాష్ట్రపతిగా పనిచేశారు.
జవహర్‌లాల్ నెహ్రూ
లక్ష్యాల తీర్మానం (Objectives Resolution): నెహ్రూ 1946 డిసెంబర్ 13న ప్రవేశపెట్టిన ఈ 'లక్ష్యాల తీర్మానం' భారత రాజ్యాంగానికి తాత్త్విక పునాదిగా పరిగణిస్తారు. ఇది రాజ్యాంగ రూపకల్పనకు మార్గనిర్దేశం చేసే ఒక దార్శనిక ప్రకటన.
ముఖ్య విలువలు: ఈ తీర్మానం భారతదేశాన్ని సార్వభౌమ, స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. ఇది భారత ప్రజలకు న్యాయం, సమానత్వం, స్వాతంత్ర్యం వంటి హామీలను ఇచ్చింది మైనారిటీలు, వెనుకబడిన ప్రాంతాలు, అణగారిన వర్గాలకు తగిన రక్షణను అందిస్తామని పేర్కొంది. ఈ తీర్మానమే ఆధునిక రాజ్యాంగంలో ప్రతిబింబించింది.
సర్దార్ వల్లభభాయి పటేల్
ప్రిన్స్లీ స్టేట్స్ ఏకీకరణ: స్వాతంత్ర్యం తరువాత, దాదాపు 565 స్వదేశీ సంస్థానాలను (Princely States) భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ పాత్ర కీలకమైనది. ఆయన దృఢ సంకల్పం, దౌత్యం, వ్యూహాత్మక చర్యల ద్వారా ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేసి, ఆధునిక భారతదేశ రాజకీయ ఏకీకరణకు కారణమయ్యారు.
రాజ్యాంగ కమిటీలు: రాజ్యాంగ సభలో ఆయన ప్రాథమిక హక్కులపై ఏర్పాటైన ఉప-కమిటీ, సలహా కమిటీకి అధ్యక్షత వహించారు. పౌరుల హక్కులు, మైనారిటీల రక్షణకు సంబంధించిన నిబంధనలను రూపొందించడంలో ఆయన కృషి ప్రధానమైనదిగా నిలిచింది.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలు: బలమైన కేంద్రాన్ని సర్దార్ వల్లభభాయి పటేల్ సమర్థించారు. ఇది దేశ సమగ్రతకు, ఐక్యతకు చాలా అవసరమని విశ్వసించారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్
విద్య, సంస్కృతి: మౌలానా ఆజాద్ స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేశారు. రాజ్యాంగ రూపకల్పన సమయంలో, ఆయన విద్య , సాంస్కృతిక హక్కులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు.
మైనారిటీల హక్కులు: మైనారిటీల హక్కులు, విద్యా హక్కులపై జరిగిన చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగంలో అనుబంధం 29 (మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించడం), అనుబంధం 30 (విద్యా సంస్థలను స్థాపించే, నిర్వహించే మైనారిటీల హక్కు) రూపకల్పనలో ఆయన వాదనలు, సూచనలు ముఖ్యమైనవిగా నిలిచాయి.
కే.ఎం. మున్షీ
రాజ్యాంగ ముసాయిదా కమిటీ (Drafting Committee) లో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశారు. యూనియన్ రాజ్యాంగ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.
మౌలిక హక్కులు: మౌలిక హక్కులు, పౌర స్వేచ్ఛ, రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు (Directive Principles of State Policy - DPSP) తదితర ముఖ్యమైన విభాగాల రూపకల్పనలో ఆయన తన న్యాయపరమైన, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించారు. భారత రాజ్యాంగపు పీఠిక (Preamble)లో 'సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర' అనే పదజాలం రూపకల్పనలో ఆయన ప్రభావం ఉంది.
అలాడి కృష్ణస్వామి అయ్యర్
అలాడి కృష్ణస్వామి అయ్యర్ ఆనాటి రోజుల్లో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన న్యాయవాదులలో ఒకరు. ఈయన కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో కీలక సభ్యుడు.
న్యాయ సలహా: ఆయన రాజ్యాంగంలోని నిబంధనలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, చట్టపరమైన నిర్మాణం, వివిధ నిబంధనల చట్టబద్ధత (Legal Validity) పై అమూల్యమైన సలహాలను అందించారు. ఆయన రాజ్యాంగంపు ఫెడరల్ నిర్మాణాన్ని (Federal Structure) బలోపేతం చేయడంలో కృషి చేశారు.
జి.వి. మావలంకర్
రాజ్యాంగ సభలో ముఖ్య సభ్యుడిగా ఉంటూ, పలు చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు.
తొలి లోక్‌సభ స్పీకర్: రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత, 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన అనంతరం ఆయన తొలి లోక్‌సభ (భారత పార్లమెంట్ దిగువ సభ) స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
బి.ఎన్. రావు (బెనగల్ నరసింగ రావు)
బి.ఎన్. రావు రాజ్యాంగ సభకు న్యాయ సలహాదారుగా (Constitutional Advisor) పనిచేశారు. ఆయన ఎన్నికైన సభ్యుడు కాదు. కానీ ఆయన అందించిన సలహాలు రాజ్యాంగ రూపకల్పనకు అత్యంత ముఖ్యమైనవిగా నిలిచాయి.
ప్రపంచ రాజ్యాంగాల అధ్యయనం: బి.ఎన్. రావు రాజ్యాంగ ముసాయిదాను తయారుచేయడానికి ముందు, ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను (ముఖ్యంగా ఐర్లాండ్, యూఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా) అధ్యయనం చేసి, వాటిలోని ఉత్తమ లక్షణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి మార్గదర్శకత్వం అందించారు.
తొలి ముసాయిదా రూపకల్పన: డ్రాఫ్టింగ్ కమిటీ డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన తుది ముసాయిదాను తయారుచేయడానికి ముందు, బి.ఎన్. రావు రాజ్యాంగంలోని ప్రాథమిక ముసాయిదా (First Draft) ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
భారత రాజ్యాంగం ఒకే వ్యక్తి కృషి కాదు. అది సమిష్టి మేధస్సు, సమిష్టి త్యాగం. అంబేద్కర్ శిల్పి అయితే, రాజేంద్ర ప్రసాద్ దానికి రూపకల్పన చేసిన అధ్యక్షుడు, నెహ్రూ దానికి తాత్త్విక పునాది వేసినవాడు, పటేల్ దానికి రాజకీయ సమాఖ్యను ఇచ్చారు. మున్షీ, ఆజాద్, అలాడి, మావలంకర్ వంటి అనేక మంది నాయకులు రాజ్యాంగ రూపకల్పనలో తమదైన ముద్ర వేశారు.
ఇది కూడా చదవండి: నేడు రాజ్యాంగ దినోత్సవం


