చారిత్రక సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి సారథ్యంలో ప్రత్యేక కార్యక్రమం
పాల్గొననున్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పాత పార్లమెంట్‌లోని చారిత్రక సెంట్రల్ హాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సారథ్యం వహించనున్నారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని 2015 నుంచి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినం, సంవిధాన్ దివస్‌ను జరుపుకుంటున్నారు. రాజ్యాంగంలోని కొంత భాగం ఆ వెంటనే అమల్లోకి రాగా, మిగతావి దేశ రిపబ్లిక్‌గా అవతరించాక 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.
బుధవారం సంవిధాన్ సదన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ తెలిపింది. రాష్ట్రపతి రాజ్యాంగ పీఠికను చదువు తారని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రసంగిస్తారంది. ఈ సందర్భంగా తెలుగు, తమిళం, మలయాళం తదితర 9 భాషల్లో ఉన్న రాజ్యాంగ ప్రతులను డిజిటల్‌గా ఆవిష్కరించనున్నట్లు ఆ శాఖ తెలిపింది.
పౌరులు ఆన్‌లైన్‌లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదవచ్చు. హమారా సంవిధాన్–హమారా స్వాభిమాన్ పేరుతో క్విజ్, వ్యాస రచన పోటీలు కూడా ఉంటాయని వివరించింది. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు, వివిధ శాఖలు, అనుబంధ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా సదస్సులు, సమావేశాలు, చర్చా గోష్టులు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నాయి.


