భారత ప్రజలమైన మేము... | Sakshi Editorial On Assembling Indias Constitution | Sakshi
Sakshi News home page

భారత ప్రజలమైన మేము...

Jan 6 2026 5:22 AM | Updated on Jan 6 2026 5:22 AM

Sakshi Editorial On Assembling Indias Constitution

పుస్తక ప్రపంచం

1946 డిసెంబర్‌ 9న సరిగ్గా 11 గంటలకు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌లో రాజ్యాంగ సభ మొదటి సారిగా సమావేశమైంది. ఈ సభలోని సుమారు 300 మంది సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైనవారు కాదు. బ్రిటిష్‌ ఇండియా ప్రావిన్సుల్లోని శాసనసభలు ఎంపిక చేసినవారు. మూడేళ్లలో 5,546 పేజీల చర్చలు జరిపి, ఈ రాజ్యాంగ సభ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు ఈ మొత్తానికైన ఖర్చు రూ.47 లక్షలు. అయితే ఈ రాజ్యాంగ సభకు వెలుపల రాజ్యాంగం కోసం పడిన భిన్న ఆరాటాలను వివరించే పుస్తకం: ‘అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టి ట్యూషన్‌’. ఈ 400 పేజీల పుస్తకం ఒకప్పుడు దేశాన్ని పట్టిన రాజ్యాంగ జ్వరాన్ని కళ్లకు కడుతుంది.

రాజ్యాంగ ప్రక్రియలో కేవలం మేధావులు మాత్రమే పాల్గొనలేదనీ, ఇంకా ‘ఇండియా’గా రూపు దిద్దుకోని భారత నేల నలుమూలలలో ఉన్న సకల జనాలు చురుగ్గా పాలుపంచుకున్నారనీ చెబుతారు రచయితలు. స్వతంత్ర భారతంలో తామెలాంటి పాలన కోరుకుంటున్నారో బలూచిస్తాన్‌ నుంచి బెజ వాడ వరకు వేలాది మంది పౌరులుగా, సంఘాలుగా, పార్టీలుగా, అధికార ప్రతినిధులుగా, ట్రేడ్‌ యూనియ న్లుగా తమ సంతకాలతో, వేలిముద్రలతో పంపిన అభ్యర్థనలను, అభిప్రాయాలను తవ్వితీసి, ఈ ఉత్సాహపూరిత ప్రజా కోణాన్ని అంతే ఆసక్తికరంగా వెల్లడించారు రచయితలు. ఉదాహరణకు గౌహతి నుంచి నలిన్‌కాంత బర్కాకటి పంపిన చిన్న కాగితం రాజ్యాంగ సభ సచివాలయానికి 1947 జనవరి 8న అందింది. 

‘రాజ్యాంగ విషయాల్లో తన అజ్ఞానాన్ని మన్నించమంటూనే’, ఏ శాసనసభ్యుడినైనా ఎప్పు డైనా ‘రీకాల్‌’ చేసే హక్కు ఓటర్లకు ఉండాలని అతడు రాశాడు. అంటరానితనాన్ని నిర్మూలించకుండా సమైక్య భారతదేశం సాధ్యం కాదని వజీరిస్తాన్‌లోని బన్నూ నుంచి ప్రజా ప్రతినిధి కోటూ రామ్‌ కోరాడు. మహిళలకు సమాన హక్కులు; మరణశిక్ష రద్దు; జైనులు, బేనె ఇజ్రాయెలీ యూదులతో సహా మైనా రిటీల హక్కులు; నగర బాలురతో సమానంగా గ్రామీణ పిల్లల హక్కుల లాంటివే కాదు, ‘చెవిటి మూగ’ వారికి ప్రత్యేక గ్యారంటీలు, విశ్వకర్మలకు ఫీజుల్లో రాయితీలు కోరుతూ కూడా లేఖలు అందాయి. విచిత్రంగా తమ లేఖల ద్వారా రాజ్యాంగ సభకు జనమే చట్టబద్ధత కల్పించారంటారు రచయితలు.

‘ఆచరణాత్మక’ కారణాల వల్ల, తొలుత
రాజ్యాంగ చర్చలను రహస్యంగానే ఉంచదలిచిన పెద్దలు ఈ ప్రజాబాహుళ్యపు ఒత్తిడితో రాజ్యాంగం ఏ రూపం తీసుకుంటుందో బహిరంగపరచదలిచారు. 1948 ఫిబ్రవరి 26న ప్రచురించిన డ్రాఫ్ట్‌ కాన్‌స్టిట్యూ షన్‌(ఆంగ్లం) బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. వెల: ఒక్క రూపాయి. ఇది చెల్లించలేనివాళ్లు అణాతో 24 పేజీల సారాంశం చదువుకోవచ్చు. వారంలోనే దీన్ని దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించడానికి అనుమ తులు కోరుతూ లేఖలు రాసాగాయి. కె.జి.చౌబాల్‌ అనే మరాఠీ జర్నలిస్టు ‘మాతృదేశ సేవ’ కోసం తన సేవలను వాడుకోవాలని రాశాడు. 

ఈ పుస్తకం వెల్లడించే మరో కోణం, ‘ఇండియన్‌ యూనియన్‌’కు సమాంతరంగా, అప్పటికి స్వతంత్రంగానే ఉండదలిచిన సంస్థానాల్లో కూడా రాజ్యాంగ రచన ఎలా జరిగిందో వివరించడం. సంస్థానాలకు రాజ్యాంగ సభ 93 ప్రాతినిధ్య స్థానాలను ఇచ్చిన ప్పటికీ, తమను తాము ప్రజాస్వామీకరించుకోవడంలో భాగంగా అవి ఈ ప్రక్రియ చేపట్టాయి. రాంపూర్‌ పాలకుడు తన ప్రజలకు భావస్వేచ్ఛతో సహా తొమ్మిది ప్రాథమిక హక్కులను ప్రసాదించాడు. రత్‌లామ్‌ రాజ్యాంగం ఉచిత ప్రాథమిక విద్యను రాజ్య బాధ్యతగా పేర్కొంది. ‘మేము ఇప్పటివరకు తమ సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న 75 సంస్థా నాలను గుర్తించాం’ అంటారు రచయితలు.

ఇంకా న్యాయమూర్తులు ఎలా భాగమయ్యారు; ట్రూమన్‌తో సహా అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనడా నాయకులు, న్యాయనిపుణుల ఫీడ్‌బ్యాక్‌ తీసు కోవడం ద్వారా రాజ్యాంగపు ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ రూపొందించిన సర్‌ బి.ఎన్‌.రావు ఇండియా రాజ్యాంగాన్ని ‘ప్రపంచ వేదిక’కు ఎలా పరిచయం చేశారు; ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులు తమ హక్కుల కోసం ఎలా నిల బడ్డారు లాంటి అంశాలను విపులంగా చర్చించిన ఈ పుస్తకం రాజ్యాంగపు బహుముఖ పార్శా్వలను తెలుసు కోగోరేవారికి ఆసక్తి కలిగిస్తుంది. కోట్ల మంది ఆశలను ఒక దగ్గర గుదిగుచ్చడం ఎంత దుర్భరమో, అబ్బు రమో కూడా అర్థమవుతుంది. తర్వాతి రాజ్యాంగ సవరణలు ఈ ప్రజా చైతన్యపు కొనసాగింపే!
ఎడిటోరియల్‌ టీమ్‌

అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌: ఎ న్యూ డెమాక్రటిక్‌ హిస్టరీ

రచయితలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement