లేదంటే వారికి నగలను విక్రయించం
వారణాసి నగల దుకాణదారుల నిర్ణయం
వారణాసి: మాస్క్, ముసుగు, బుర్ఖా, హెల్మెట్ వంటివి ధరించి వచ్చే కొనుగోలుదారులకు నగలను విక్రయించరాదని యూపీలోని వారణాసి జిల్లా నగల దుకాణదారుల సంఘం నిర్ణయించింది. ఇటీవల పలు జిల్లాల్లో బుర్ఖా, ముసుగులతో వచ్చిన చోరులు దుకాణాల్లో నగలను దోచుకోవడం, మోసాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ మేరకు నిషేధం విధించినట్లు యూపీ జువెల్లర్స్ అసోసియేషన్(యూపీజేఏ) వారణాసి జిల్లా అధ్యక్షుడు కమల్ సింగ్ చెప్పారు.
‘ముఖాన్ని కప్పుకుని దుకాణానికి వచ్చే వినియోగదారులకు నగలను విక్రయించం. ముఖాన్ని కప్పుకుని వచ్చే వారు ఏదైనా నేరానికి పాల్పడితే, గుర్తించి పట్టుకోవడం కష్టమవుతోంది. అందుకే, మేం మాస్క్, బుర్ఖా, హెల్మెట్, ముసుగు ధరించి వచ్చే వారికి నగలను అమ్మబోమంటూ దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశాం. ఇదంతా మా భద్రత కోసం మాత్రమే. ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు’అని అన్నారు.
ఇకపై కొనుగోలుదారు ఎవరైనా దుకాణంలోకి ప్రవేశించేందుకు ముందుగా ముఖంపై ఉన్న ఆచ్ఛాదనాన్ని తప్పనిసరిగా తొలగించాకనే లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల ఆ కొనుగోలుదారు గుర్తింపు సులభమవుతుందని చెప్పారు. ఇలాంటి నిషేధం యూపీలోని ఝాన్సీ తదితర జిల్లాల్లో ఇప్పటికే అమలవుతోందని యూపీజేఏ అధ్యక్షుడు సత్య నారాయణ్ సేథ్ చెప్పారు.


