సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్... ఆదివారం మూడో మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాహిబ్‌జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సయీమ్ అయూబ్ (8 బంతుల్లో 13; 2 సిక్స్‌లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడగా... ఆఖర్లో ఫఖర్ జమాన్ (10 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధనాధన్ షాట్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
జింబాబ్వే బౌలర్లలో సింకందర్ రజా 2 వికెట్లు పడగొట్టగా... బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ నగరవ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 19 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్ బుర్ల్ (49 బంతుల్లో 67 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్ సికందర్ రజా (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు.
పాకిస్తాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఉస్మాన్ తారిఖ్ ‘హ్యాట్రిక్’ సహా 4 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్ రెండో బంతికి టోనీ (1)ని అవుట్ చేసిన అతడు... ఆ తర్వాత వరుస బంతుల్లో తషింగ ముసెకివా (0), వెల్లింగ్టన్ మసకద్జ (0)ను పెవిలియన్ బాట పట్టించాడు. మొహమ్మద్ నవాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 6 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. టోర్నమెంట్ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది.
చదవండి: IND vs SA: పాపం సంజూ.. వరల్డ్ మోస్ట్ అన్‌లక్కీ క్రికెటర్! అగార్కర్‌పై ఫైర్


