
బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపర్‌టర్లు నిర్వహిస్తున్న ఏటీఎంల్లో తప్పకుండా రూ.100, రూ.200 నోట్లు ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్ల డినామినేషన్‌కు సంబంధించి ఇప్పటికే చాలా ఏటీఎంల్లో ప్రత్యేక సదుపాయాలు, సామర్థ్యం ఉన్నందున ఇతర మార్పులు అవసరం లేదని చెప్పింది.
ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. వినియోగదారులు, చిరు వ్యాపారాలను ప్రభావితం చేసే ఈ డినామినేషన్ నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్లు విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ డినామినేషన్లను కనీసం ఒక క్యాసెట్ ద్వారా పంపిణీ చేయాలని ఆర్‌బీఐ ఆదేశాల్లో తెలిపింది.
ఇదీ చదవండి: రైల్వే ట్రాక్‌పై సోలార్ ఎనర్జీ తయారీ!
2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలు, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలు ఈ నోట్లను పంపిణీ చేయాలి. ఈ నోట్ల డినామినేషన్ల కోసం బ్యాంకులు కొత్తగా యంత్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఏటీఎంలకు సర్దుబాట్లు చేస్తే సరిపోతుందని చెప్పింది.