
వారణాసిలో పైలట్ ప్రాజెక్ట్
దేశంలోనే తొలిసారిగా రైల్వే ట్రాక్‌పై సోలార్ ప్యానెళ్లతో ప్రయోగాలు ప్రారంభించింది భారతీయ రైల్వే. వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్‌డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెళ్లను అమర్చారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ రైల్వే మంత్రిత్వ శాఖ దీన్ని ‘హరిత, సుస్థిర రైలు రవాణా’ చర్యగా అభివర్ణించింది.
సంప్రదాయానికి భిన్నంగా..
సాధారణంగా సోలార్ ఎనర్జీకి భారీగా భూసేకరణ అవసరం అవుతుంది. సోలార్ ప్యానెళ్లను అమర్చేందుకు భూమి ఎంతో అవసరం. భూసేకరణ దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్‌లకు పెద్ద అడ్డంకి. దీన్ని పరిష్కరించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. సంప్రదాయానికి భిన్నంగా రైల్వేపట్టాలకు మధ్యలో ఉన్న భూమిని ప్యానెళ్ల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. దేశంలో చాలా కిలోమీటర్లు విస్తరించిన ఈ రైల్వే పట్టాల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్‌డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఇది విజయవంతం అయితే క్రమంగా ఈ వ్యవస్థను ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలుస్తుంది.
నిర్వహణ సులువు
ఈ ప్రాజెక్ట్‌లో నిర్వహణను సులభతరం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏదైనా సమస్య వస్తే వాటిని త్వరగా తొలగించి తిరిగి ఇన్‌స్టాల్ చేసే విధంగా ప్యానెల్స్‌ను అమర్చారు. దీని ద్వారా తనిఖీలు, మరమ్మతులు లేదా అత్యవసరాల కోసం రైల్వే కార్మికులు ఎక్కువ ఆలస్యం చేయకుండా వీలవుతుంది. పట్టాలపై రైలు ప్రయాణించినప్పుడు, దుమ్ము పేరుకుపోవడం, వర్షం.. వంటి పరిస్థితులను తట్టుకునేలా ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
భవిష్యత్తులో రైల్వే స్వావలంబన
ఇందులో 28 హైస్ట్రెంత్ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి మొత్తంగా 15 కిలోవాట్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలవు. భారతీయ రైల్వే వ్యవస్థ 1.2 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇలాంటి వ్యవస్థ రానున్న రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా రైల్వే విద్యుత్ వాడకంలో స్వావలంబన సాధిస్తుందని నమ్ముతున్నారు.
ఇదీ చదవండి: యూఎస్‌లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది?