వైట్‌హౌజ్ వద్ద కాల్పుల ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. నేరుగా అఫ్గనిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలకు దిగింది. అఫ్గన్‌ను ప్రమాదకరమైన నేలగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఇమిగ్రేషన్ దరఖాస్తుల సస్పెండ్‌కు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)ను పురమాయించారు కూడా. ఈ క్రమంలో.. తాలిబాన్ ప్రభుత్వం తాజా పరిణామాలపై స్పందించింది.
వైట్‌హౌజ్ సమీపంలో జరిగిన దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందా?. కాల్పులకు పాల్పడిన దుండగుడు రెహ్మనుల్లా లఖన్‌వాల్‌ను ఆ దేశమే బ్రెయిన్‌వాష్ చేసి పంపిందా?.. అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తోంది అఫ్గనిస్తాన్. కాబూల్ ప్రపంచ దేశాలతో.. ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూరస్తోందని చెబుతోంది. ఈ దాడి తమ దేశాన్ని బద్నాం చేసే కుట్ర అయ్యి ఉండొచ్చని.. అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిగితే అసలు విషయం బయటపడుతుందని అంటోంది.
తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్ షాహీన్ భారత్‌కు చెందిన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఈ దాడి వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ప్రమేయం ఉందనిపిస్తోంది. మా దేశగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నంలో భాగమే ఈ దాడి అయ్యి ఉండొచ్చు కూడా. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే నిజం బయటపడుతుంది..
.. ఇది బయటి దేశాల గూఢచారి సంస్థలు(పాక్ ఐఎస్‌ఐను ఉద్దేశిస్తూ..) పని అయ్యి ఉండొచ్చు. అఫ్గాన్లను ఇతర దేశాల భద్రతా ముప్పుగా చూపించే ప్రయత్నమూ కావొచ్చు. ఇందులో ఏ కోణాన్ని మేం వదలిపెట్టబోం. ఎందుకంటే.. అయితే మా విధానం స్పష్టంగా ఉంది. మా పౌరులు ఎప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడరు. ఆఫ్గన్ నేలను, ఇక్కడి ప్రజల్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించేందుకు మేం అంగీకరించబోం’’ అని అన్నారాయన. అఫ్గాన్ వలస ప్రక్రియను అమెరికా కఠినతరం చేయడంపై స్పందిస్తూ.. అమెరికా ప్రభుత్వం అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. ఆ తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.
గురువారం వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనానికి అతి సమీపంలో జరిగిన ఈ కాల్పులతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. కాల్పుల సమయంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి అఫ్గాన్ జాతీయుడని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ధ్రువీకరించారు. అతడి పేరు రెహ్మనుల్లా లఖన్‌వాల్ (Rahmanullah Lakanwal)గా పేర్కొన్నారు. 2021లో అఫ్గాన్‌లకు అందించిన స్పెషల్ వీసాపై అగ్రరాజ్యానికి వచ్చినట్లు తెలిపారు. నేషనల్ గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని ఎఫ్‌ఐబీ చీఫ్ కాష్ పటేల్ ప్రకటించారు. కాల్పుల్లో నిందితుడికి కూడా గాయాలవడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించామన్నారు. అతడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
వైట్‌హౌజ్ దాడి ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక దారుణమైన దాడి. విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య. ఇది మొత్తం దేశంపై జరిగిన దాడి. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దీన్ని మేం ఖండిస్తున్నాం. కాల్పుల అనంతరం అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ భూమి పైనే ప్రమాదకర ప్రాంతమైన అఫ్గానిస్థాన్ (Afghanistan)కు చెందినవాడని పేర్కొన్నారు. అతడు జో బైడెన్ (Joe Biden) పరిపాలన సమయంలో యూఎస్‌లోకి ప్రవేశించాడు. బైడెన్ పాలనలో అలా వచ్చినవాళ్లందరినీ విచారించాల్సిన అవసరం ఉంది. అలాంటి శరణార్థులు అమెరికన్ల మనుగడకే ప్రమాదకరం’’ అని అన్నారు. ఈ ఘటన తర్వాత వాషింగ్టన్‌లో మరో 500 మంది నేషనల్ గార్డ్ సిబ్బంది మోహరింపునకు ఆదేశించారు. అంతేకాదు.. ట్రంప్ ఆదేశాలతో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అఫ్గాన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.


