
‘రెడీ టూ కుక్’ పేరిట స్థానిక విక్రయాలపై రొయ్య రైతుల దృష్టి
భీమవరం, వీరవాసరం, నరసాపురంలో ప్రత్యేక కౌంటర్లు
ఇతర జిల్లాలకూ విస్తరించే యోచన
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో డోర్ డెలివరీ చేస్తున్న డెల్టా రైతు
‘డొమెస్టిక్ సేల్స్’కు గతంలోనే కార్యాచరణ చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
జిల్లా వ్యాప్తంగా 250 ఫిష్ ఆంధ్రా ఔట్‌లెట్స్ ఏర్పాటు
సాక్షి, భీమవరం: సిండికేట్ దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని కాపాడుకునే దిశగా రొయ్యల రైతులు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా లోకల్ మార్కెట్‌ను పెంచుకునే పనిలో పడ్డారు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ‘రెడీ టు కుక్’ పేరిట రైతులే రొయ్యల అమ్మకాలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని భీమవరం, వీరవాసరం, నరసాపురంలో అమ్మకాలు మొదలుకాగా ఇతర జిల్లాలకూ విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు.
‘పశ్చిమ’లోనే 3 లక్షల టన్నుల ఉత్పత్తి
రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా (రొయ్యలు, చేపల) చెరువులు ఉండగా.. అత్యధికంగా ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులో 60 శాతం విస్తీర్ణంలో ఏటా సుమారు 3 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్స్ ఏకమై రొయ్య ధరలను ఇష్టానుసారం తగ్గించడం, మేత ధరలను పెంచడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు.
వారి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు జై భారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాగు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పలువురు రైతులు సాగు సమ్మెకు శ్రీకారం చుట్టి చెరువులను ఎండగట్టేశారు.
స్థానిక వినియోగం పెంచేందుకు..
రొయ్యలు ఎక్కువగా తినే దేశాల్లో ఏడాదికి తలసరి 10 నుంచి 12 కిలోల సగటు వినియోగంతో చైనా ముందుంటే.. 8–10 కిలోలతో అమెరికా రెండో స్థానంలో, 8 కిలోల సగటు వినియోగంతో యూరోపియన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తున్న మన రాష్ట్రంలో మాత్రం రొయ్యల సగటు వినియోగం కేవలం 1.5 కిలోలు మాత్రమే. స్థానిక వినియోగం పెరిగేలా డొమెస్టిక్ సేల్స్ చేపట్టడం ద్వారా సిండికేట్ దోపిడీకి కళ్లెం వేయాలన్న యోచనలో రొయ్య రైతులు ఉన్నారు.
అందరికీ అందుబాటులో ఉండేలా వివిధ కౌంట్లలోని రొయ్యలను ప్రాసెసింగ్ చేసి 150 గ్రాముల నుంచి 300, 500 గ్రాములు, కిలో వరకు వివిధ పరిమాణాల్లో ప్యాకింగ్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. భీమవరానికి చెందిన ఆక్వా రైతు గాదిరాజు వెంకట సుబ్బరాజు రైతు బజార్‌లో రొయ్యల రిటైల్ అమ్మకాలను ప్రారంభించారు.
పశ్చిమ గోదావరి జిల్లా రొయ్య రైతుల ఆధ్వర్యంలో ప్రాన్స్ పర్చేజింగ్ డొమెస్టిక్ యూనిట్ పేరిట వీరవాసరంలో ఔట్‌లెట్ ఏర్పాటుచేశారు. రొయ్యల్లో ఉండే పోషకాలు, ఆరోగ్యానికి అవి చేసే మేలుపై కరపత్రాలు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఇతర జిల్లాలకూ ఔట్‌లెట్లను విస్తరించే ఆలోచన చేస్తున్నట్టు ఆక్వా రైతులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో డోర్ డెలివరీ
నరసాపురానికి చెందిన ఆక్వా రైతు కర్రి రామకృష్ణ “టేస్టీ ప్రాన్స్’ పేరిట 4 నెలలుగా ప్రాసెసింగ్ చేసిన రొయ్య పప్పును ఆర్డరుపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ సగటున రోజుకు 200 కిలోల రొయ్య పప్పు విక్రయిస్తున్నారు. పాలకొల్లులో కొందరు రైతులు ఏకమై సుమారు రూ.30 లక్షలతో డొమెస్టిక్ సేల్స్ కోసం ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిని త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. లాభాపేక్షతో కాకుండా రొయ్యల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ చేస్తున్నట్టు ఆక్వా రైతులు చెబుతున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలోనే..
ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ రొయ్యలను స్థానిక వినియోగదారులకు డోర్ డెలివరీకి గతంలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్యాచరణ చేసింది. దీనికి ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ అప్పట్లో ముందుకు వచ్చింది. ఎక్స్‌పోర్టు తరహాలో ప్రాసెస్ చేసిన రొయ్య పప్పు కిలోకు కౌంట్‌ను బట్టి రూ.600 నుంచి రూ.850 వరకు ధర నిర్ణయించారు.
తొలుత ప్రయోగాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో అమలుచేసి తర్వాత రాష్ట్రవ్యాప్తం చేయాలని భావించారు. అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయగా.. ఎన్నికల హడావుడి మొదలవడంతో కార్యరూపం దాల్చలేదు. సీ ఫుడ్ డొమెస్టిక్ వినియోగం పెంచేందుకు అప్పట్లోనే ఫిష్ ఆంధ్రా పేరిట సబ్సిడీపై రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువైన 250కు పైగా ఔట్‌లెట్లు ఏర్పాటు చేశారు. ఫోర్, టూ వీలర్స్‌ను అందించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్డర్స్
నాలుగు ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నాను. కొద్ది నెలల క్రితం సొంతంగా రొయ్యలు ప్రాసెసింగ్ చేసి డోర్ డెలివరీ చేయడం ప్రారంభించాం. తక్కువ ధరకే క్వాలిటీ రొయ్యపప్పు ఇవ్వడంతో లోకల్ సేల్స్‌తో పాటు ఏపీ, తెలంగాణ నుంచి ఆర్డర్లు బాగా వస్తున్నాయి. – కర్రి రామకృష్ణ, ఆక్వా రైతు, నరసాపురం
లాభాలు ఆర్జించాలని కాదు
లాభాపేక్షతో కాకుండా అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన రొయ్యలు అందించడమే మా ఉద్దేశం. స్థానిక వినియోగం పెరిగితే సిండికేట్ ఆగడాలకు కళ్లెం పడుతుంది. పాలకొల్లులో కొందరు రైతులు కలిసి యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. పనులు దాదాపు పూర్తికావచ్చాయి. – బోణం చినబాబు, ఆక్వా రైతు, పాలకొల్లు