
రాష్ట్రం పరువు పోవాలని ఏ ముఖ్యమంత్రైనా కోరుకుంటాడా? రైతుల ప్రతిష్ట దెబ్బతినాలని ఆకాంక్షిస్తాడా? మిగిలిన రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఈ రెండు కాంక్షిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు చిత్ర, విచిత్రమైన ప్రకటనలతో ప్రజలను తరచూ గందరగోళంలోకి నెట్టేసే చంద్రబాబు నాయుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతులు పండించే ధాన్యం తినేందుకు, ఎగుమతి చేసేందుకూ పనికి రాదని తేల్చేశారు. ఇందుకు ఆధారాలున్నాయా? లేదా? అన్నది వేరు సంగతి కానీ.. ఇలా చెబితే రైతులకు అన్యాయం జరగదా? అన్న ఆలోచన కూడా చేయలేకపోయారు ఘనత వహించిన సీఎంగారు.
ఎగుమతులకు పనికి రాదని సీఎం స్వయంగా అంటే.. కొనుగోళ్లకు ఏ దేశం ముందుకొస్తుంది?. ఇలా మాట్లాడటం ద్వారా సీఎం ఇక్కడి ధాన్యాన్ని విస్తృతంగా వాడే రాష్ట్ర ప్రజలందరిలో అనుమానాన్ని సృష్టించినట్లు అవ్వదా!. దీంతో ఈ ఆరోపణ కూడా తిరుమల ప్రసాదంలో కల్తీ చందంగా అనుచితమైపోయిందని తేలుతోంది. కోనసీమలో వరి సాగు సమస్యలపై కొన్నేళ్ల క్రితం క్రాప్ హాలిడే ప్రకటిస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి వరి వేయడం మంచిది కాదని చెబుతున్నారు. పైగా అధిక యూరియాతో పండించిన పంటలు తినడం వల్ల కేన్సర్ వస్తుందని అంటున్నారు. ఎంత బాధ్యతారహిత ప్రకటన ఇది!!.
ఎరువుల విచ్చలవిడి వాడకం సరికాదనడం వేరు కేన్సర్ వస్తుందనడం వేరు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా పేరుంది. దశాబ్దాలుగా వరి సాగు జరుగుతోంది. ఒకపక్క రికార్డు స్థాయి వది దిగుబడులపై పొరుగున ఉన్న తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబరంగా చెప్పుకుంటూంటే... మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేశామని సంబరంగా చెబుతూంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పూర్తి నిరుత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోంది.
తెలంగాణలోనూ యూరియా కొరత(Urea Crisis In Telangana) వచ్చింది కానీ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కేంద్ర స్థాయిలో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. అవసరానికి తగినంత రాకపోయి ఉండవచ్చు. అది వేరు సంగతి. అంతమాత్రాన తెలంగాణలో ఎవరూ వరి వేయద్దని అనలేదు. కేన్సర్ బూచిని చూపలేదు.
ఏపీలో యూరియా కొరత(AP Urea Crisis) సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన వరదరాజులరెడ్డి స్వయంగా శాసనసభలో యూరియా కొరతపై మాట్లాడారు. ఒకదశలో అసలు యూరియా కొరత లేదని చంద్రబాబు సోషల్ మీడియాపైన, వైసీపీపైనా మండిపడ్డారు. ఆ తర్వాత కలెక్టర్ల సమావేశంలో పంపిణీలో విఫలం అయ్యామని, వచ్చేసారి రైతుల ఇళ్లవద్దకే సరఫరా చేస్తామని, తాజాగా పొలాల వద్దే అందచేస్తామని అంటున్నారు. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పటికీ, అవసరమైన మేర యూరియాను తెప్పించుకోలేకో, వచ్చిన యూరియాను క్రమబద్దంగా పంపిణీ చేయలేకో, బ్లాక్ మార్కెట్‌ను, టీడీపీ నేతల దందాను అరికట్టలేకో తెలియదు కాని, మొత్తం నెపాన్ని రైతులపై నెట్టే యత్నం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం పిఠాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియా లారీలను పోలీసులు పట్టుకున్నారు. అదను దాటిపోతున్నా యూరియా అవసరమైన మేర అందడం లేదని రైతులు వాపోతున్న దృశ్యాలు పలు చోట్ల కనిపిస్తున్నాయి. ఈ దశలో ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన ముఖ్యమంత్రి అసలు మన వరి పంటపైనే తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయం. మనం పండిస్తున్న వరి మద్యం తయారీకి తప్ప దేనికి పనికి రాదని అన్నారు. ఇప్పుడు జనం అంతా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న బియ్యాన్ని వాడుతున్నారా? రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఏపీలో పండిందా? కాదా? నిజంగానే అది తినడానికి యోగ్యమైనది కాకపోతే ఎందుకు పంపిణీ చేస్తున్నారు?
ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే దృష్టి మరల్చే వ్యూహాలు అమలు చేస్తూంటుంది. దానికి కూడా హద్దు ఉంటుంది. మొత్తం రాష్ట్రం పరువు ,ఇమేజీ పోయే విధంగా ఉండరాదు. యూరియా కొరత ఏర్పడినప్పుడే కేన్సర్ సమస్య గుర్తుకు వచ్చిందా? ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పాలి? ఆ ఎరువు వాడకం తగ్గించాలని సీజన్ కు కనీసం ఆరు నెలల ముందు చెప్పాలి కదా? అంతా వరి వేసేసిన తర్వాత అది వద్దని, అది తినడానికి పనికి రాదని అంటే రైతులు ఏమి చేయాలి.
కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నుందుకు తమకు తగిన శాస్తి జరిగినట్లు రైతులు భావించరా? కొన్ని జిల్లాలలో మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో వరిని రెండు పంటలుగా వేస్తారు. మిగిలిన చోట్ల రెండో పంటగా అపరాలు వేస్తారు. వరి వద్దని ఉద్యాన పంటలు వేయాలని చెబితే అది ఇప్పటికిప్పుడు అవుతుందా? పైగా ఇప్పుడు ఉద్యాన పంటల వారు ఎన్ని బాధలు పడుతున్నారో చూడడం లేదా? మామిడి, బొప్పాయి తదితర రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎన్ని పాట్లు పడుతున్నారు! పోనీ మెట్ట పంటలు వేద్దామనుకుంటే మిర్చి, పొగాకు వంటి పంటలకు ధర లేక ఎంత ఆందోళన జరిగింది.
మాజీ సీఎం జగన్ ఆయా పంటల రైతుల వద్దకు వెళ్లేవరకు ప్రభుత్వంలో చలనం కనిపించిందా?. ఉల్లి, టమోటా రైతులు పడుతున్న పాట్ల మాటేమిటి?. అమరావతికి లక్షల కోట్లు అప్పులు చేసి ఖర్చు చేసే ప్రభుత్వం రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు మూడు, నాలుగువేల కోట్లు వెచ్చించ లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దానికి బదులు ఇవ్వడం లేదు. ఆయా పంటలు ఎంత సాగు అవుతాయన్న దానిపై వ్యవసాయ శాఖకు అంచనాలు, లెక్కలు ఉంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని ,నిజంగానే ఆ పంటల వల్ల రైతులకు లాభం రాదనుకుంటే ప్రత్యామ్నాయాలతో సహా ప్రభుత్వం సాగు సీజన్‌కు కొన్ని నెలల ముందు సూచనలు చేయాలి కదా!. అవేమీ చేయకుండా, ఇప్పటికిప్పుడు వరికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రైతులకు అన్యాయం చేయడం అవుతుంది.
వరి పంట కొనుగోలుకు కూడా సమస్య వస్తుందని ఇప్పుడే చంద్రబాబు చెబుతున్నారంటే, రైతులకు ధాన్యం అమ్మకాలలో మున్ముందు ఎన్ని కష్టాలు వస్తాయో ఊహించుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు వాటిని ఎంతవరకు నెరవేర్చారు. 2014 టరమ్‌లో రైతుల రుణాలన్నిటిని మాఫీ చేస్తామని ఊదరగొట్టి, తీరా ప్రభుత్వం వచ్చాక ఆరో వంతు రుణాలు కూడా మాఫీ చేయలేదు.ఈసారి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద రైతుకు ఇస్తామని చెప్పి ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది రూ.ఐదువేలు మాత్రం ఇచ్చారు. అయినా రైతులకు ఏదో చాలా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు.
రైతులకు ఇవ్వవలసిన ఇన్ పుట్ సబ్సిడీ. బీమా సదుపాయం తదితర అంశాలలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏమి చేసిందో తెలియదు. జగన్ తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే ఎంతో గొప్ప వ్యవసాయదారులు ఉన్న రాష్ట్రంగా పేరొందిన ఏపీ రైతుల ప్రతిష్ట దెబ్బతినేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడే మాట్లాడడం దారుణం అని చెప్పక తప్పదు. ఇది ఒక రకంగా ఏపీ బ్రాండ్ ఇమేజీని తనకుతానే దెబ్బతీయడం అని, వ్యవసాయాన్ని విధ్వంసం చేయడమేనని నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలతో ఏకీభవించకతప్పదు.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
ఇదీ చదవండి: బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు!