బిల్డప్‌ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు! | KSR Comments On Chandrababu Decisions Over Super Six Promises, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

బిల్డప్‌ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు!

Aug 6 2025 9:49 AM | Updated on Aug 6 2025 10:59 AM

KSR Comments On Chandrababu Decisions

‘చంద్రబాబు.. మీ మోసం మరోసారి రుజువైంది’ అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌. ఎన్నికల సందర్భంగా ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి తమ ‘సూపర్‌ సిక్స్‌’ హామీల్లో ప్రకటిస్తే.. పద్నాలుగు నెలలు అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు కేవలం ఐదు వేల చొప్పున పంపిణీ చేయడంపై జగన్‌ ఈ వ్యాఖ్య చేశారు.

పైగా.. ‘అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలనూ తప్పుపట్టారు. మాటిచ్చి తప్పడం చంద్రబాబుకు ఇదేమీ కొత్త కాదు. గతాన్ని చూస్తే ఇలాంటి సంఘటనలు బోలెడు కనిపిస్తాయి. కానీ, బాబు తప్పిదాలను కప్పిపుచ్చేందుకు ఎప్పటికప్పుడు కలరింగ్‌ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన మాట నిలబెట్టుకున్నాడూ అనే అభిప్రాయం కలిగించేలా చేసేందుకు ఆయన వ్యాఖ్యలను హైలైట్‌ చేస్తున్నారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదెవరూ? ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు, బొంకులతో మాట తప్పింది ఎవరన్నది రైతులకు తెలియదా?.

జగన్ ప్రభుత్వం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.13,500 క్రమం తప్పకుండా చెల్లించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పినదాని కంటే ఒక ఏడాది ఎక్కువగానే ఇచ్చింది కూడా. అయినా ఆ రోజుల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శలు కురిపించేవారు. కేంద్రమిస్తున్న నిధులను కూడా తన పథకంలోకి కలిపి ఎలా ఇస్తారని ప్రశ్నించే వారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే సాయంతో దీనికి సంబంధం లేదన్నట్లే చెప్పారు. 2014లో రూ.89వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లతో సరిపెట్టిన విషయంపై రైతుల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఈసారి మాట తప్పరేమో అనుకుని ఉండవచ్చు. కానీ ఆయన తీరేమీ మారలేదు. తొలి ఏడాది పెట్టుబడి సాయం మొత్తం ఇవ్వలేదు. రెండో ఏడు కూడా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. ఈ విషయాన్ని తరచూ ప్రస్తావిస్తున్న ప్రతిపక్ష నేతకు అడ్వాంటేజ్‌ వస్తుందేమో అన్న బెంగతో అరకొర అమలుకు సిద్ధమయ్యారు. ఇదే పూర్తి సాయం అన్న బిల్డప్‌కు తెరలేపారు.

‘తల్లికి వందనం’ తీరులోనే ‘అన్నదాత సుఖీభవ’ లోనూ ఏడు లక్షల మందిని తగ్గించారని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాక ఇరవై వేల బదులు రూ.14 వేలే ఇస్తామని ప్రకటించారు. ఆరు వేల చొప్పున కోత పెట్టారన్నమాట. దీన్ని మాట నిలబెట్టుకోవడం అంటారా? కాకపోతే చంద్రబాబు ఏ అసత్యాన్ని అయినా అలవోకగా చెప్పగల నేర్పరి. కూటమి ఎన్నికల ప్రణాళికనూ, ప్రభుత్వం అమలు చేసిన వాటిని పోల్చి చూస్తే ఈ విషయం తేలికగా తెలిసిపోతుంది. తల్లికి వందనం స్కీమ్ తర్వాత అన్నీ అమలు చేసేశామని, ఇంకెవరైనా అమలు కాలేదంటే నాలుక.. అంటూ వెంటనే సర్దుకుని మందం అనుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అమలలో కోత పెట్టినా, ఒక ఏడాది ఎగ్గొట్టినా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని చంద్రబాబు చెప్పగలిగారు. నిజాయితీగా వ్యవహరించి ఉంటే.. ఇంత ఇవ్వాలని అనుకున్నాం.. కానీ అలా చేయలేకపోతున్నాం.. మన్నించాలని అడుగుతారు. అలా మాట్లాడకపోతే మానే.. అంతా చేసేసినట్లు మభ్య పెట్టాలని అనుకోవడమే చంద్రబాబు స్పీచ్ హైలైట్. దీనిని దృష్టిలో ఉంచుకునే జగన్ తన ప్రకటనలో చంద్రబాబు మోసం మరోసారి నిజమైందని అన్నారు.

ఒక్కో రైతుకు ఇప్పటికి రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం ఐదు వేలే అని వ్యాఖ్యానించారు. వచ్చే రోజుల్లో మిగిలిన తొమ్మిది వేలు ఇచ్చినా రూ.26 వేల వరకు రైతులకు బాకీ పడినట్లే అవుతుంది కదా!. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో కొన్ని వింతలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన సభలో నులక మంచాలు వాడారట. వాటిపై చంద్రబాబు కూర్చున్నారట. ప్రజలూ అలాగే చేశారట. ఇది సింప్లిసిటీ అనుకోవాలన్నది వారి లక్ష్యం కావచ్చు. కాని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నులక మంచాల దశకు తీసుకువెళ్లిందన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారని కూడా భావించవచ్చు. నిత్యం హెలికాప్టర్‌లో చిన్న, చితక కార్యక్రమాలకు కూడా కోట్లు ఖర్చు చేస్తూ అటెండ్ అవుతుండే చంద్రబాబు నులక మంచంపై కూర్చుంటే రైతులకు ఒరిగేది ఏం ఉంటుంది. వారికి ఇవ్వవలసిన గత ఏడాది బకాయి రూ.20 వేలు ఇచ్చి ఉంటే రైతులు కూడా శభాష్ అని ఉందురు కదా!.

మరో సన్నివేశం ఏమిటంటే చంద్రబాబు హెలికాఫ్టర్ దిగి ఆటోలో ప్రయాణించడం. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఆటో డ్రైవర్‌తో ఐటీ గురించి కూడా మాట్లాడించడం, కెమెరాల కోసం చేతులు ఊపుతూ వెళ్లడం అంతా తమాషాగా ఉంది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారంటే అది మనం చూపిన చొరవ అని అనడంలో కొందరైనా నమ్మకపోతారా అన్న భావన ఉండవచ్చు. కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడితే నవ్వుల పాలు అవుతామన్న సంగతిని విస్మరిస్తున్నారు. చంద్రబాబు ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా బడ్డి కొట్టు వద్దకో, సెలూన్ షాప్ వద్దకో వెళ్లి సామాన్యులను  పలకరిస్తున్నారు. అది తప్పు కాదు. కానీ, ముందస్తు ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం వల్ల అదంతా షోగా మారుతోందే తప్ప, వాస్తవ పరిస్థితి తెలుసుకునే ఆలోచన ఉన్నట్లు అనిపించదు.

టీడీపీ మీడియా ఆహో, ఓహో అని భజన చేయవచ్చు. నిప్పులు చెరుగుతున్న ఎండలో చంద్రబాబు కూర్చున్నారని, భారీ వేదికలు లేవని, షామియానాలు లేవని గొప్ప విషయంగా ప్రచారం చేశారు. నిజమే.. ఇకపై అన్ని కార్యక్రమాలు ఇలాగే ప్రభుత్వానికి ఖర్చు లేకుండా చేస్తారని కూడా ఈ మీడియా గ్యారంటీ ఇచ్చి ఉండాల్సింది. పెంచిన వెయ్యి ఫించన్‌ ఇవ్వడం కోసం లక్షల రూపాయల వ్యయం చేస్తూ చంద్రబాబు చేస్తున్న ప్రచారార్భాటాన్ని కూడా టీడీపీ మీడియా ఆపగలిగితే మెచ్చుకోవచ్చు. ఇక యథా ప్రకారం వైఎస్సార్‌సీపీపై బురద చల్లుడు కూడా చంద్రబాబు సాగించారు. మహిళలపై వైఎస్సార్‌సీపీ వారు దౌర్జన్యాలు చేశారని, పార్టీ కార్యకర్త కాన్వాయ్ కింద పడితే పొదల్లో పడేశారనో, ఇంకా ఏవేవో వ్యాఖ్యలు చేసి చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుంటున్నారు.

టీడీపీ వారికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరించడం పద్దతి అనిపించదు. వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై కొందరు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచక వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నవారిపై కనీసం కేసులు పెట్టకుండా ఉంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అనాలా? లేక కొందరి కోసమే పని చేసే ప్రభుత్వం అనుకోవాలా?.  


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement