కోడికి పందెం పాఠాలు | Cock Business worth over Rs 10 crore for Sankranti season | Sakshi
Sakshi News home page

కోడికి పందెం పాఠాలు

Oct 12 2025 6:09 AM | Updated on Oct 12 2025 6:10 AM

Cock Business worth over Rs 10 crore for Sankranti season

సంక్రాంతి కోడి పందేలకు మూడు నెలల ముందు నుంచే పుంజులకు శిక్షణ

ఉదయాన్నే వేడి నీరు, వాకింగ్, స్విమ్మింగ్, వార్మప్‌ 

మేతగా మటన్, గుడ్డు, బాదం, ఎండు ఖర్జూరం, వెల్లుల్లితో ప్రత్యేక మెనూ  

ఒక్కో పుంజుకు రూ.30 వేల వరకు శిక్షణ వ్యయం  

పశ్చిమగోదావరిలో 200కు పైగా పెంపకం కేంద్రాలు  

సంక్రాంతి సీజన్‌కు రూ.10 కోట్లకు పైనే వ్యాపారం 

పుంజులకు పందెం పాఠాలేంటీ అనుకుంటున్నారా? సంక్రాంతి కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాలోని 
భీమవరం ఎంత ఫేమస్సో తెలిసిందే. రూ.కోట్లలో చేతులు మారడం ఒకెత్తయితే.. తమ కోడి.. పందెం కొట్టడం ప్రతిష్టాత్మకంగా భావించడం మరో ఎత్తు. పుంజులను పందేలకు సిద్ధం చేసేందుకు మూడు నెలల ముందు నుంచి పెద్ద కసరత్తే జరుగుతుంది. రానున్న సంక్రాంతి కోసం దసరా నుంచే పందెంరాయుళ్లు తమ పుంజులకు శిక్షణ ప్రారంభించారు.  

సంక్రాంతి పండుగ రోజుల్లో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో రూ.కోట్లు వెచ్చించి ప్రత్యేకంగా బరులు ఏర్పాటుచేసి కోడిపందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో తరలివస్తుంటారు. అందుకు తగ్గట్టే పుంజుల పెంపకంలో పందేలరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అధిక శాతం మంది తమ ఇళ్లు, మకాంల వద్ద పుంజులను పెంచితే.. పండుగలకు దేశ విదేశాల నుంచి వచ్చేవారు తెలిసిన ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తుంటారు.  -సాక్షి, భీమవరం

మెనూ ప్రత్యేకమే..
పుంజులో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యరి్థపై విరుచుకుపడేందుకు మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. పుంజు బరువును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డు ముక్కలు చేసి పెడతారు. 

తిరిగి సాయంత్రం ఎప్పటిమాదిరి రాగులు, గంటులు, అరికలు మొదలైన వాటిని అందిస్తారు. పుంజు అనారోగ్యం, వైరస్‌ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకువచ్చి పరీక్షలు చేయించి మందులు వేయించడం, మరెన్నో సంప్రదాయ ఆయుర్వేద పద్ధతులు అవలంబించడం చేస్తుంటారు.   

అంతా గోప్యమే 
కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయస్సు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తుంటారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలోనూ గోప్యత పాటిస్తారు.  

శిక్షణ మొదలవుతుందిలా.. 
ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లలో పటుత్వం, ఆయాసం రాకుండా, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు నెలరోజుల పాటు రోజు విడిచి రోజు చెరువులు, నీటి తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. ‘వి’ (ఇంగ్లిష్‌ లెటర్‌) ఆకారంలో నెట్‌లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్‌) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ పరుగులు పెట్టిస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. 

మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తుంటారు. పండుగలు దగ్గరపడే కొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులు తగ్గడానికి ప్రత్యేక ట్రైనర్లతో వేప, జామాయిల్, కుంకుడు తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాలతో గంటల కొద్దీ మరిగించిన ద్రావణాన్ని కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చి పుంజును అందులో ఉంచి పైనుంచి ద్రావణం పోస్తారు. వారంలో ఒకటి రెండు సార్లు ఇలా చేస్తారు. 

చివరిగా పొయ్యిపై మూకుడు వేడిచేస్తూ అందులో చీప్‌ లిక్కర్‌ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దానిని కోడి శరీరం అంతా అద్దుతూ శాఖల చేయిస్తారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతినిచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు. ఈ ప్రక్రియలన్నిటినీ నిర్ణీత పద్ధతుల్లో చేయిస్తుంటారు.  

కోట్లలో వ్యాపారం.. 
మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు జీతాలుంటాయి. వీరు ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్ల పోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లకు సిట్టింగ్‌కు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుందంటున్నారు. వీటి జాతి, రంగు, ఎత్తును బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. 

మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలు చేస్తుంటారు. పండుగల కోసం నాలుగు వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. 

పుంజులకు ఉన్న డిమాండ్‌తో జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. కొందరు స్థలాలను లీజుకు తీసుకుని వీటి పెంపకం సాగిస్తుంటారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కోచోట వంద నుంచి 250 వరకు వివిధ రకాల జాతుల పుంజులు, కోళ్లను పెంచుతుంటారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement