
ఏడాదిలో బతుకు బండి తలకిందులు.. పథకాలు లేవు... పైసలు రావు..
గోదావరి గ్రామాల్లో ఆనందం ఆవిరి
వృద్ధులు, రైతులు, మహిళలు, పిల్లల్లో ఆవేదన
జగన్ పాలనలో గడప దాటకుండా పథకాలు, ఊరు దాటకుండా ఉపాధి
‘కొత్త బట్టలు ఎక్కడ్నుంచి తేవాలయ్యా...? అర్థం చేసుకోవేం? ఏడాదిగా శని పట్టుకుంది. ఎట్లా చెప్పాల్రా నీకు..?’
– తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కుమారుడి ఎదుట వానపల్లి దుర్గాదేవి నిర్వేదం!
‘నేనేం చేయనవ్వా? నన్నే తీసేశారు.. ఏడాదిగా దరిద్రాన్ని చూస్తున్నా..’ – జక్కంపూడి నగర్‌లో పెన్షన్ కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద మాజీ వలంటీర్ సయ్యద్ బాషా నిస్సహాయత!!
‘పండగొస్తే గుండె దడ వస్తోంది. పైసా అప్పు కూడా పుట్టడం లేదు. చుట్టాలొస్తున్నారంటే భయమేస్తోంది. సంతోషంగా ఉన్న రోజు లేదు. ఊరంతా కలిసి పండగ చేసుకుని ఏడాది దాటింది...’ – అనపర్తి ఎస్సీ కాలనీలో లక్ష్మీ భవాని, కోటేశ్వరి ఆక్రోశం!
‘అవును మరి.. తాపీగా కూసున్నా...! సెంద్రబాబు డబ్బులు పంపాడని...! వడ్లు కొని ఇరగదీశాడని...! మా ఆవిడ ఫ్రీ బసెక్కి ఊరెళ్లింది...ఇంటినిండా గ్యాస్ బండలున్నాయి..!’ – సింగగూడెం, లింగపాలెం దగ్గర గోదావరి జిల్లాల యాసలో గండుల సుబ్బారావు, పొట్టవూరు శ్రీనివాస్ వ్యంగ సంభాషణ!!
వనం దుర్గాప్రసాద్ – ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారి పల్లెలంటే.. ఉప్పొంగే సంతోషాల పరవళ్లు! పచ్చని తోరణాల లోగిళ్లు! మర్యాదలతో అతిథులను ఉక్కిరిబిక్కిరి చేసే గోదారమ్మ తీరం ఏడాదిగా బావురుమంటోంది! పల్లె కళ తప్పింది. గత ప్రభుత్వ హయాంలో సాఫీగా సాగిన బతుకు బండి ఇప్పుడు గతుకుల బాటలో కూరుకుపోయి నరకం అనుభవిస్తోంది! వైఎస్ జగన్ పాలనలో ఏదో ఒక పథకం కింద నెలనెలా డబ్బులొచ్చేవి. అమ్మ ఒడి... విద్యా దీవెన.. వసతి దీవెన.. రైతు భరోసా... చేయూత... చేదోడు.. కాపునేస్తం... వాహన మిత్ర.. ఇలా ఒకదాని వెంట మరొకటిగా డబ్బులు అందేవి.
పండుగలు వస్తే పేదలు సంతోషంగా జరుపుకొనేవారు. నెలకు సరిపడా సరుకులు ముందే తెచ్చుకునేవారు. స్కూళ్లు తెరవటమే ఆలస్యం.. పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, పుస్తకాలు.. విద్యా కానుక సిద్ధంగా ఉండేది! చేతిలో ట్యాబ్‌లతో పిల్లలు ఆత్మ విశ్వాసంతో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేవారు. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలనలో అంతా తిరగబడింది! బతుకు బండి తలకిందులైంది!!
మావోడు ఏమయ్యాడు..?
ఊరితో బంధం తెగిందవ్వా..!
కాళ్ల మండలం వేంపాడులో గ్రామ సచివాలయానికి వచ్చిన ఓ 60 ఏళ్ల అవ్వ ‘మావోడు ఏమయ్యాడయ్యా?’ అంటూ వలంటీర్ గురించి ఆరా తీసింది. ఇంటికే వచ్చేవాడు. పెన్ష¯న్Œ తెచ్చి ఇచ్చేవాడు. బిడ్డలా అండగా ఉండేవాడు.. అంటూ పేగు బంధమే తెగినంతగా బా«ధ పడింది. ఉండి దగ్గర ఉప్పులూరు గ్రామ వలంటీర్ కనిపించడంతో ఊరిలో వారంతా చుట్టూ చేరి ఆప్యాయంగా పలుకరించారు.
‘ఏమయ్యావ్ తండ్రీ..?’ అంటూ 80 ఏళ్ల లక్ష్మి ఆదుర్దాగా ఆరా తీసింది. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రాజమహేంద్రవరంలో రోజూ కూలీకి వెళ్తున్నానని ఆ వలంటీర్ చెప్పాడు. ‘ప్రభుత్వం మారింది. మన ఊరితో బంధం తెగిందవ్వా..’ అంటూ కంట తడి పెట్టాడు. వీరవాసరం కొణితివాడలోనూ ఇదే సన్నివేశం. గణపవరం మండలం కొమ్మూరులో వలంటీర్ కోసం గ్రామస్తులు వాకబు చేస్తున్నారు.
బడ్డీ కొట్టు బంద్..
కొవ్వూరు డివిజన్ పైడిమెట్ట, పోచారం, తాళ్లపూడి, బల్లిపాడు, చింతలపూడిలోని లింగపాలెం... ఇలా ఏ ఊరు చూసినా ఉసూరుమంటున్నాయి. ఆ పథకం... ఈ పథకం వచి్చందని, టీ కోసం నేను డబ్బులిస్తానంటే నేనిస్తానని పోటీ పడ్డ వాతావరణం ఇప్పుడు కానరావడం లేదు. బడ్డీ కొట్టు నరేష్ వ్యాపారం సాగక ఊరొదిలి వెళ్లాడు. ఊరందరికీ కూరలు అమ్మే సుజాత పట్నం చేరుకుంది.
గ్రామంలో ట్యూషన్లు చెప్పే మాణిక్యం కాకినాడ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. పథకాలు వచ్చినన్నాళ్లు జనం చేతిలో డబ్బులుండేవి. పిల్లలకు ట్యూషన్లు చెప్పించేవాళ్లు! ఏడాదిగా పైసా రాకపోవడంతో గ్రామాల్లో గుబులు రేగుతోంది! చిన్న వ్యాపారాలు నడవడం లేదు. ఆటోవాలాలు డీలా పడ్డారు. ‘మేం టీడీపీనే... అయినా జగన్ పాలనే బాగుంది..’ ధర్మాజీ గూడెం వద్ద ఆటోవాలా నరేష్ తేల్చి చెప్పేశాడు!
రైతుల ఆనందం ఆవిరి..
గోదావరి జిల్లాల్లో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఈ ప్రభుత్వం దళారీల దయకు వదిలేసింది. ధాన్యం అమ్మితే డబ్బులివ్వకుండా తిప్పలు పెడుతోంది. తేమ శాతం అంటూ కోతలు పెడుతోంది. రైతు కూలీలకు పనులు లేవు. పట్టణాల్లో తాపీ పనులకు వెళ్తున్నారు. పిల్లల చదువులకు అప్పులే శరణ్యమయ్యాయి. వైఎస్ జగన్ పాలన సాగిన ఐదేళ్లూ స్వర్ణ యుగమని, ఇప్పుడు మాకు ఖర్మ పట్టుకుందని ఆవేదనగా చెబుతున్నారు. రైతుల ఆనందం ఆవిరైందని వ్యవసాయదారుడు సుబ్బారావు కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చెయ్యి తడిపితేనే అర్జీలు తీసుకునే పాడు రోజులు మళ్లీ దాపురించాయని చెప్పాడు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడకు చెందిన టైలర్ కృష్ణారావు ఏడాదిగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పథకాలు ఏవీ రాకపోవడంతో బట్టలు కుట్టించేందుకు తనవద్దకు ఎవరూ రావడం లేదని, గతంలో నెలకు రూ.15 వేలు సంపాదించిన తాను రూ.3 వేలు ఆర్జించడం కూడా గగనంగా ఉందని చెబుతున్నాడు. కుమార్తెను చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని, భీమవరం వస్త్ర దుకాణంలో సగం రోజులు కూలీకి వెళ్తున్నానని చెప్పాడు.
ఆ దేవుడి దయే..!
ఆ దేవుడే నాకు తిండి పెట్టే ఏర్పాటు చేశాడు.. పెన్షన్ మంజూరు చేశాడు (వైఎస్ జగన్‌ను తలచుకుంటూ...) వలంటీర్ ఇంటికొచ్చి పలకరించేవాడు. ఇప్పుడు పలకరించే దిక్కులేదయ్యా. ఊరే బావురు మంటోంది – జోగి రామలక్ష్మి, (జక్కంపూడి నగర్, తూ.గో)
బంధం తెగిపోయింది
ఇంటర్ వరకు చదివా. జగనన్న పుణ్యమా అని వలంటీర్‌గా చేరి ఊరందరి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం దక్కింది. మీకు ఐదు వేలు ఏమిటి.. పదివేలు ఇస్తానన్న చంద్రబాబు మమ్మల్ని రోడ్డున పడేశారు. దీనికి బాధపడటం లేదు గానీ మా పల్లెతో బంధం తెగిపోయిందని ఏడుపొస్తోంది. – సయ్యద్ బాషా (మాజీ వాలంటీర్)