వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలతో చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి సర్కారు వణికిపోతున్నట్లుగా ఉంది. ప్రతి పర్యటన సందర్భంగా పలు రకాల ఆంక్షలు పెట్టి.. ఎలాగైనా సరే ఆ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పాపం.. వారి ప్రయత్నాలేవీ ఫలించడం లేదు సరికదా.. జగన్ సభలు, పర్యటనలు జనసంద్రాలవుతున్నాయి. తాజాగా జగన్ చేసిన కృష్ణ జిల్లా పర్యటనలో కేవలం 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏడు గంటల సమయం పట్టిందంటే.. జనాభిమానం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సహజంగానే ఇవన్నీ ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర సంస్థలకు కడుపు మంట మిగులుస్తుంది. వారి కథనాలు చూస్తే అవి ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే మీడియాను నడుపుతున్నట్లు తేటతెల్లమవుతుంది.

అయితే జగన్ టూర్‌కు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందన్న విషయాన్ని వారు చెప్పకనే చెప్పేస్తున్నారు. ‘‘అడుగడుగునా అరాచకమే’’ అన్న ఈనాడు కథనం చూడండి... జగన్ పోలీసులు పెట్టిన షరతులను ఉల్లంఘించారన్నది ఏడుపు. ఆంధ్రజ్యోతి కూడా జగన్ టూర్‌తో జనం పాట్లు పడ్డారని గొంతు చించుకుంది. అంతేకానీ ఈ ఎల్లోమీడియా పత్రికలు జనం రాలేదని మాత్రం రాయలేకపోయాయి. రాజకీయ నాయకుల పర్యటనల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వాటిని నియంత్రణకే పోలీసులు ఉంటారు. కానీ వారు ఆ పని చేయకుండా ఎక్కడెక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వస్తున్న జగన్ అభిమానులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2019-24 మధ్య ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణలు కూడా చాలా చోట్ల పర్యటించారు. కానీ ఎన్నడూ ఈ రోజు జగన్ పర్యటనలకు పెట్టినన్ని ఆంక్షలు పెట్టలేదు.

శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఇంటినుంచి బయటకు వెళ్లవద్దని, ఫలానా టూర్ చేయవద్దని పోలీసులు చంద్రబాబును చెబితే ఆయన ఊరుకోలేదు సరికదా... అంతెత్తున విమర్శించారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వారిపై దుర్భాషలాడారు. హెచ్చరికలు జారీ చేశారు. పుంగనూరు, అంగళ్లు వద్ద పార్టీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీపై ఉసికొల్పిన సందర్భాన్ని ఎల్లో మీడియా మర్చిపోయి ఉండవచ్చు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు దూకుడు కారణంగా ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీసు వాహనం దగ్ధమైంది. అప్పట్లో అవన్ని ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్లు, అదంతా ప్రభుత్వ తప్పు, పోలీసుల వైఫల్యం అని చెప్పుకుంది టీడీపీ, చంద్రబాబు బృందం. కందుకూరు వద్ద నడిరోడ్డు మీద సభ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినప్పుడు ఎల్లో మీడియాకు జనం పాట్లు కనిపించలేదు. వారికి ఇవి నరకంగా అనిపించలేదు. గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు సభ పెట్టి చీరల పంపిణీ చేసినప్పుడు జరిగిన తొక్కిసలాట వీరికి గుర్తుకు రాదు. విజయవాడలో ఒకసారి పవన్ కళ్యాణ్ రోడ్ షో చేసినప్పుడు గంటలకొద్ది ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మాబోటి వాళ్లం కూడా ఒక సందర్భంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం.

జగన్ సీఎంగా ఉండగా... బహిరంగ సభల్లో తొక్కిసలాటలు, మరణాలు లేకుండా చూడడానికి, నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం జీవో ఇస్తే టీడీపీ, ఎల్లో మీడియాకాని రచ్చ రచ్చ చేశాయి. సంపాదకీయాలు సైతం రాసి గగ్గోలు పెట్టాయి. కోర్టుకు వెళ్లి రద్దు చేయించాయి! జగన్ టూర్లో ఎక్కడైనా తొక్కిసలాటలు జరిగాయా? పొరపాటున వాహనం తగిలి ఒక వ్యక్తి మరణించిన ఘటన తప్ప ఇంకేమైనా ప్రమాదాలు జరిగాయా? కృష్ణా జిల్లా టూర్లో జగన్ కాన్వాయితోపాటు ఇతర ప్రయాణికుల వాహనాలు, బస్సులు అన్నీ మామూలుగానే నడిచాయి. జనం గూమికూడిన చోట ట్రాఫిక్ కొద్దిసేపు ఆటంకం కలిగి ఉండవచ్చు.
జనం పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్‌కు స్వాగతం చెబుతుంటే ఆయన వారిని కాదని ఎలా వెళ్లిపోగలుగుతారు? ఇవన్ని ప్రజాస్వామ్యంలో భాగం కాదా? జగన్ టూర్ వల్ల జనానికి ఇబ్బందులు వస్తుంటే, అధికార హోదాతో తిరుగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల టూర్ల వల్ల ఇంకెంత ఇబ్బంది కలుగుతుంది? పర్యటన ప్రాంతానికి రావడానికి అరగంటో, గంట ముందునుంచే ట్రాఫిక్ నిలిపివేయడమో, నియంత్రణలు పెట్టడమో చేస్తుంటారు కదా! అప్పుడు జనం పాట్లు పడినా, నరకం చూసినా తప్పు లేదా? జనం జగన్‌కు నీరాజనం పలుకుతున్న వైనం కూటమి నేతలకు ఆందోళన కలిగిస్తుండవచ్చు.

వైఎస్సార్సీపీ ఓటమి పాలైన ఏడాదికే జగన్ సమావేశాలకు ప్రజలు తండోపతండాలుగా వస్తూండేందుకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్ని సంగతి వారికి తెలియదా? నిజానికి పోలీసులు జగన్ టూర్‌పై పోలీసులు పెట్టిన షరతులు అసంబద్ధమైనవి. హైవేపై గుమి కూడకూడదట. రాకపోకలకు, ప్రజాజీవనానికి అంతరాయం కలగరాదట. జగన్ తో పాటు ఏభై మంది మాత్రమే ఉండాలని, పది వాహనాలే వెళ్లాలని, దిచక్ర వాహనాలకు అనుమతి లేదని మరో షరతు పెట్టారట. ఇలాంటి షరతులు పెట్టిన పోలీసులను విమర్శించాల్సి మీడియా వాటిని సమర్థిస్తూ కథనాలు రాయడం, ఉల్లంఘించారని వైసీపీపై ఎదురుదాడి చేయడం చూస్తే ఈనాడు మీడియా జర్నలిజం ఎంత నీచంగా మారిందో తెలుస్తుంది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడు వెళుతున్నప్పుడు జనం పోగవ్వకుండా ఎలా ఉంటారు? 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చైతన్యరథం వేసుకుని రాష్ట్రమంతటా టూర్ చేశారు.
రహదారులన్నీ కిక్కిరిసిపోయేవి. అయినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దిక్కుమాలిన ఆంక్షలు పెట్టలేదు. అది వదిలేద్దం. చంద్రబాబు కుమారుడు లోకేశ్ యువగళం కార్యక్రమంపై కూడా ఇలాంటి నియంత్రణలు లేవు. సినిమా నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పర్యటనలు జరిపిన సందర్భంలోనూ పోలీసులు ఇలాంటి షరతులు పెట్టలేదు. రాజకీయ నేతలు రోడ్లపై టూర్లు చేయకూడదని, తద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగించరాదన్నదే ఎల్లో మీడియా విధానమైతే అదే మాట చంద్రబాబు పర్యటనల సందర్భంలోనూ చెప్పి ఉండాల్సింది. అప్పుడు చెప్పని సుద్దులు ఇప్పుడు చెప్పడం కచ్చితంగా ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. జగన్ తాజా టూర్‌లో జనం ప్రభుత్వంపైకి సంధించిన ప్రశ్నలకన్నా, ఇతర చిల్లర అంశాలే ఫోకస్ అవ్వాలన్నదే ఎల్లో మీడియా లక్ష్యం కావచ్చు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జగన్ రైతుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, రైతు భరోసాగా రూ.13500 చెల్లింపు మొదలైన హామీలను అమలు చేశారు.
దాంతో రైతులను ఏమార్చడానికి ‘‘అన్నదాత సుఖీభవ’’ కింద తాము ఏడాదికి రూ.ఇరవై వేలు ఇస్తామని, ఇతరత్రా అన్నిప్రయోజనాలు కల్పిస్తామని టిడిపి, జనసేన తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశారు. ఇప్పుడేమో వాటిని అమలు చేయడం లేదు. ఒక ఏడాది ఎగవేసి, తదుపరి రూ.ఐదు వేలే ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. మోంథా తుపాను వల్ల రైతుల వరి పంట నేలవాలి పోవడంతో చాలా నష్టపోయారు. వారికి నష్టపరిహారం ప్రకటించలేదు. పైగా పరిహారం తీసుకుంటే ధాన్యం కొనుగోలుకు బాధ్యత లేదని రైతులను బెదిరిస్తున్నారు. రైతులు వీటన్నిటిని జగన్ వద్ద ప్రస్తావించారు. అవన్ని జనంలోకి వెళతాయి కనుక ఈ రకంగా పోలీసులతో అడ్డదిడ్డమైన కండిషన్లు పెట్టించి టూర్ విఫలం చేయాలని చూశారనుకోవాలి. అయినా రైతులే వైసీపీ శ్రేణులే కాదు..సాధారణ జనం కూడా తరలిరావడం కూటమి నేతలకు, ఎల్లో మీడియాకు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


