బాబుకు సోషల్‌ మీడియా భయం! | Kommineni Srinivasa Rao Comment On TDP and Social Media | Sakshi
Sakshi News home page

బాబుకు సోషల్‌ మీడియా భయం!

Oct 29 2025 11:21 AM | Updated on Oct 29 2025 11:27 AM

Kommineni Srinivasa Rao Comment On TDP and Social Media

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా పెద్ద సవాలే విసురుతోంది. ఆడిటర్లు, ఎడిటర్లు అవసరం లేని ఈ మీడియా ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడుతోందని కూడా ఆయన హూంకరించారు. పాపం... ఈ క్రమంలో ఆయన తన గతాన్ని మరచినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ప్రతిపక్షంలో ఉండగా సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని జగన్‌, ఆయన కుటుంబాన్ని ఎంతగా రచ్చకీడ్చే ప్రయత్నం చేసింది అందరికీ తెలుసు. మంత్రులగా ఉన్న రోజా, అంబటి రాంబాబులపై కూడా టీడీపీ సోషల్‌ మీడియా విభాగం విచ్చలవిడి వ్యాఖ్యలు... కథనాలు వండి వార్చిన విషయం మరీ అంత పాత సంగతైతే కాదు. 

విపక్షంలో ఉన్నప్పుడు కాని, ప్రస్తుతం అధికారం వచ్చాక కాని, తెలుగుదేశం పక్షాన ఎంత అరాచకంగా సోషల్ మీడియాను నడిపింది ఆయనకన్నా ఎవరికి బాగా తెలుసు? దానికి లోకేష్ బృందమే నాయకత్వం వహించిందని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతుంటారు. ప్రధాన మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి పచ్చి అబద్దాలు రాసి జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేశాయి. ఆ సందర్భంలో ఎప్పుడైనా ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ వచ్చి కేసులు పెట్టే యత్నం చేస్తే ఇంకేముంది ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, మీడియా స్వేచ్చను అరికడతారా అంటూ నానా యాగీ చేసేవారు. ఏపీ రూ.14 లక్షల కోట్ల అప్పులతో నాశనమైపోయిందని నాసిరకం మద్యంలో 30 వేల మంది చనిపోయారని, జగన్ ప్రజల భూములన్నీ లాగేసుకుంటారని.. ఇలా అనేక అంశాలలో చంద్రబాబు ఆరోపణలు చేయడం తదుపరి ఎల్లో మీడియా,  తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన విష ప్రచారం చేయించేవారు.  అప్పుడు సోషల్ మీడియా అవసరం ఆయనకు కనిపించింది. 

అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ ధోరణి మారలేదు సరికదా మరింత పెరిగిపోయింది. ఒకపక్క లోకేశ్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, వైఎస్సార్‌సీపీ అనుకూల సోషల్‌ మీడియా వారిపై విచ్చలవిడిగా అక్రమ కేసులు బనాయిండం చూస్తూనే ఉన్నాం. ఎటూ అధికారం ఉంది కనుక తన అనుకూల సోషల్ మీడియా వైఎస్సార్‌సీపీ వారిపై  ఎంత నీచంగా పోస్టులు పెట్టినా వారి జోలికి పోలీసులు వెళ్లరు. అదే వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులెవరైనా వ్యతిరేక పోస్టులు పెడితే పోలీసులు వెంటనే కేసులు పెట్టేస్తున్నారు. దాదాపు 1200 మంది వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారంటేనే చంద్రబాబు ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో ఊహించుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు గారు.. సోషల్‌ మీడియాను గాడిన పెట్టాలన్న చిత్తశుద్ధి మీకుంటే.. దాన్ని మీ పార్టీతోనే మొదలుపెట్టడం మేలవుతుంది. నలుగురికి ఆదర్శంగానూ ఉంటుంది. 

వైఎస్ జగన్, కుటుంబం, అంబటి రాంబాబు, రోజా వంటి వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబాలపై నీచమైన పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎంత మందిపై కేసులు పెట్టారు మీరు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టడం ఏపీ పోలీసులపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది కదా? మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అత్యంత దారుణమైన  వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తికి టీడీపీ టిక్కెట్ ఎలా ఇచ్చారో చెప్పగలరా? అదే వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారట. కూటమి నేతల తీరుతెన్నులకు ఇవి నమూనాలు మాత్రమే. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిపై చర్య  తీసుకోవచ్చు కాని వారి భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించాలని, వేధించాలని ప్రయత్నాలు చేయడం శోచనీయం. ఎన్నికల హామీలను సజావుగా అమలు చేసి, ప్రజానుకూల విధానాలను ఆచరిస్తే ఎవరు ఏమీ పోస్టులు పెట్టుకున్నా ప్రభుత్వానికి ఏమీ కాదు. అయితే కూటమి ప్రభుత్వం అబద్ధాల పునాదులపై నిర్మించింది కనుకే ఇప్పుడీ సోషల్ మీడియా భయం చుట్టుకున్నట్లుంది. 

కొన్నిరోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అని అన్నారు. ఏమిటి దీనర్థం? ఆ స్వేచ్చ ప్రజలకు మేలు చేయడానికా? లేక ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలలోకి తీసుకువెళుతున్న సోషల్ మీడియాని అణచి వేసేందుకా? ఇప్పటికే ఏపీలో పోలీసులు ఎక్కడా లేని విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, మరో వైపు అధికార కూటమి ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు దాష్టికాలకు పాల్పడినా పట్టించుకోక పోవడం పెద్ద సమస్యగా ఉంది. ముఖ్యమంత్రి సైతం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా తమది పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రకటించారు. 

చంద్రబాబు  ముఖ్యమంత్రి అయిన  తర్వాత ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో అందరికి తెలుసు. ముఖ్యంగా తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు  కలిసిందంటూ ఆధారం లేని ఆరోపణ చేసి వైఎస్సార్‌సీపీకి అంటగట్టే యత్నం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతని వేషం కట్టి, అయోధ్యకు కల్తీ లడ్డూలు సరఫరా అయ్యాయని  రెచ్చిపోయి మాట్లాడారు. వాటికి సంబంధించి ఏ ఒక్క ఆధారం చూపలేకపోయారు. ఇది ఫేక్ ప్రచారం అవుతుందా? లేక వాస్తవాల ప్రచారం అవుతుందా అన్నదానిపై ఈ ఏడాదికాలంలో ఎన్నడైనా వివరణ ఇచ్చారా? విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు చంద్రబాబు, లోకేశ్‌లు ఎలాంటి వార్నింగ్ లైనా ఇవ్వవచ్చు. 

అధికారంలోకి రాగానే ప్రత్యర్ధి పార్టీవారు మాట్లాడితే అది రాజకీయ కుట్ర, శాంతియుత వాతావరణం చెడగొట్టడం అవుతుంది. ప్రతి ఉపన్యాసంలోను కొన్ని పాయింట్లు రాసుకుంటారు. వాటిని ఒక జాబితా ప్రకారం వల్లె వేస్తుంటారు.  ఒక ఉదాహరణ చూడండి..'గుంటూరులో కారు కింద వ్యక్తి పడిపోతే పొదల్లో పారేసి వెళ్లిపోయారు.పోలీసులు అంబులెన్స్ లో తీసుకువెళ్లి రక్షించే యత్నం చేస్తే వారే చంపేశారని చెప్పించే పరిస్థితికి దిగజారారు.." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసు శాఖకు సంబంధించిన కార్యక్రమంలోనే ఆయన ఇలా మాట్లాడితే అక్కడ ఉన్న పోలీసు అధికారులకు వాస్తవం తెలియదా! అయినా సరే! ప్రజలను తప్పుదారి పట్టించాలన్న  ఉద్దేశంతో పవిత్రమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఇలా మాట్లాడితే ఏమి విలువ ఉంటుంది.

ఇంతకుముందు టర్మ్‌లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. చంద్రబాబు కుటుంబం పుష్కర స్నానం ఘట్టం చిత్రీకరించేందుకు సాధారణ భక్తులను నిలిపివేసినందున అది జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజి మాయమైందన్న ఆరోపణలు ఉన్నాయి. విపక్షంలో ఉండగా కందుకూరు సభలో, గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి మరో 11 మంది మృతి చెందారు.అదంతా పోలీసుల వైఫల్యం అని వారిపై నెట్టేశారు. తన వైపు ఎంత తప్పు ఉన్నా కప్పిపుచ్చుకోవడంలో ఎంత నేర్పరితనం ఉందో, ఆయా సందర్భాలలో తన రాజకీయ ప్రత్యర్ధులపై తప్పుడు ఆరోపణలు చేయడంలో అంతకన్నా అధికంగా నేర్పరితనం చంద్రబాబుకు  ఉందని ఎక్కువ మంది భావిస్తుంటారు. 

రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే అని ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు, పలుచోట్ల  నకిలీ మద్యం డంప్ లు దొరకలేదా? వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లకు  అనుమతి ఇచ్చాక, అక్కడ ఏ మద్యం సరఫరా అవుతోందో ఎవరైనా చెప్పగలుగుతున్నారా?ఎక్సైజ్ అధికారులే పలు చోట్ల ఇలాంటి మద్యాన్ని పట్టుకున్నారు కదా? అయినా నకిలీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని, అనారోగ్యం పాలు కాలేదని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలుగుతున్నారు? ఎంతమంది తాగుబోతులకు ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది?  ఆయన చేసే  వాదన సరైనదే అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నాసిరకం మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని ఏ ఆధారాలతో ఎలా చెప్పగలిగారు.  35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని ఎన్నికల ప్రణాళికలో ఎలా రాయగలిగారు.అది తప్పు కాదా?ఇప్పుడు ఆధార సహితంగా నకిలీ మద్యం దొరికినా ఎవరి ఆరోగ్యం చెడలేదని , ఎవరూ మరణించలేదని జనం నమ్మాలని,దీని గురించి  ఎవరూ ప్రశ్నించకూడదన్నది ఆయన  ఉద్దేశం.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement