సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మరో ఏడాది పాటు తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి కొనసాగనున్నారు. ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి ట్రైనింగ్ ప్రొగ్రామ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. నవంబర్ 10 నుంచి జనవరి 2026 దాకా రోహిత్.. శిక్షణకు వెళ్లాల్సి ఉంది.
ఐపీఎస్ రోహిత్ కుమార్ చౌదరిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పీఎస్ రోహిత్ ను వెంటనే బదిలీ చేయాలని చంద్రబాబు సర్కార్‌పై జేసీ ఒత్తిడి చేశారు. ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరిని మరో ఏడాది తాడిపత్రి ఏఎస్పీ గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ‘రేయ్.. నా కొడల్లారా.. ఏమనుకుంటున్నారు. మీ ఇళ్ల వద్దకు వస్తా. ఏమనుకుంటున్నారో. ఒక్కో నా కొడుకు ఇష్టారాజ్యంగా రాస్తారా. నాకు గన్‌మెన్లు తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో పెడతారా.. ఒక్కో యూట్యూబ్ నా కొడుక్కి చెబుతున్నా జాగ్రత్త’’ అంటూ గత గురువారం (అక్టోబర్ 23) మరోసారి జేసీ ప్రభాకర్‌రెడ్డి బూతులతో రెచ్చిపోయారు. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున ఏఎస్పీ రోహిత్ చౌదరిని దుర్భాషలాడటంతోపాటు ఏఎస్పీగా పనికిరాడంటూ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానిం చడం, దీనికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఎస్పీ జగదీష్ అదే రీతిలో స్పందించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటకుపైగా వేచి ఉన్నా.. ఎస్పీ జగదీష్ ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వెనుతిరిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై జేసీ బూతులు లంకించుకున్నారు. అంతుచూస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
నేను చదువుకున్న వాన్ని.. మా తాతల కాలం నుంచి రాజకీయం చేస్తున్నాం అంటూ మాట్లాడే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్న మాటలు చూసి జిల్లా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అధికారపార్టీలో ఉన్నా.. చివరుకు జిల్లా ఎస్పీ కూడా కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటే జేసీకి ఉన్న విలువ ఏపాటిదో అన్నది అర్థం కావడం లేదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.


