ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన తప్పే పదే పదే చేస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన మంచేమిటో చెప్పుకునే బదులు గత సీఎం జగన్‌పై విమర్శలు ఎక్కువపెట్టేందుకు వృథా ప్రయాస పడుతున్నారు. జగన్‌పై అనుచిత వ్యాఖ్యల ద్వారా తమకే నష్టం జరుగుతోందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలలను మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆయన పడుతున్న పాట్లు అన్ని ఇన్నీ కావు. వైన్‌షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతివ్వడం రాష్ట్రవ్యాప్తంగా వేలాది బెల్ట్‌షాపులకు తెరెత్తడం ఈ కూటమి ప్రభుత్వం ఘనతే.
ఏరకంగా చూసినా ఇవేవీ ప్రజలకు మేలు చేసేవి కానేకావు. కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఎన్నికల్లో జగన్ ఓటమిని చూపుతున్నారు. రాజకీయ ఓటమిని నరకాసుర వధతో పోలుస్తున్నారు. పోనీ ఇదే కొలమానం అనుకుందాం. అప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే టీడీపీ మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయింది. అంత రాక్షసంగా పాలించారు కాబట్టే ఓడియామని చంద్రబాబు ఒప్పుకుంటారా?
చంద్రబాబు కుమారుడు, సకలశాఖల మంత్రిగా పేరు తెచ్చుకుంటున్న లోకేశ్ జీవితాంతం తానే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించాలన్న ఆశ ఉండటాన్ని తప్పు పట్టలేము కానీ.. అందుకు రాక్షసపాలనను, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని మార్గంగా మార్చుకుంటే మాత్రం భంగపడక తప్పదు. ఎడాదిన్నర కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాకు చెందిన పలువురిపై అక్రమంగా కేసులు బనాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది. తాజాగా కందుకూరు సమీపంలోని దారకంపాడు వద్ద లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని వాహనంతో ఢీకొట్టి హత్య చేశారన్న కథనం కూటమి ఏలుబడిలో శాంతి భద్రతల పరిస్థితికి దర్పణం. కారణాలేవైనా ఈ కేసులో ఆరోపణలపై పోలీసులు సకాలంలో నిస్పాక్షికంగా విచారించి ఉంటే ఇంత పెద్ద సమస్య అయ్యేదే కాదు.
రెండు కులాల మధ్య చిచ్చు రేగేది కాదు. కాపు సంఘాల నేతలు ప్రభుత్వంపై బహిరంగ విమర్శలకు దిగాల్సిన పరిస్థితిని కూడా నివారించి ఉండవచ్చు. ఈ వ్యవహారంలో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. ఎందుకు గోప్యంగా ఉంచారూ అన్నది!కొన్ని నెలల క్రితం ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైతే చంద్రబాబుతోసహా పలువురు మంత్రులు, టీడీసీ నేతలు హుటాహుటిన అక్కడకు తరలివెళ్లారు.
మద్యం, భూ మాఫియాలలో భాగస్వామిగా ఉన్నారన్న ఆరోపణలున్నా, పార్టీలోని వర్గ విభేదాలే హత్యకు కారణమన్న అంచనా ఉన్నా వీరందరూ హడావుడి చేశారు. మరి లక్ష్మీనాయుడి కేసు విషయానికి వచ్చేసరికి అంతా మారిపోయింది.హత్య జరిగితే రోడ్డు ప్రమాదంగా చిత్రించే యత్నం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, జనసేనాభిమాని హత్యకు గురయ్యారని తెలిసినా ఎందుకు పరామర్శించలేదు?! అధికారాన్ని అనుభవించాలన్న పవన్ కళ్యాణ్ బలహీనతను టీడీపీ బాగానే వాడుకుంటుందన్న ఆరోపణలు ఇందుకే వచ్చేది.
హోం మంత్రి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు అక్కడకు అసలు విషయం పక్కనబెట్టి వైసీపీపై విమర్శలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి తప్పేమి లేకపోతే హత్యకు గురైన లక్ష్మీ నాయుడు కుటుంబానికి ఎందుకని ఆర్థికసాయం, భూమి కేటాయింపు ప్రకటించారు? ఈ రకంగా సాయం చేయడాన్ని టీడీపీ మద్దతుదారైన మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా తప్పు పట్టారే! కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు టీడీపీ, జనసేనలు అచ్చంగా కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టేవి. ఎక్కడైనా దేవాలయంలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడకు వాలిపోయి మత రాజకీయాలు చేశారు.
విశాఖపట్నంలో తాగి గొడవ చేస్తున్న ఒక డాక్టర్‌ను పోలీసు కానిస్టేబుల్ అరస్ట్ చేస్తే దళిత డాక్టర్ అంటూ కుల రాజకీయం చేసింది టీడీపీ కాదా? అతను అనారోగ్యంతో మరణించినా వైసీపీ కారణమంటూ అన్యాయంగా ప్రచారం చేశారే. పల్నాడులో చంద్రయ్య అనే వ్యక్తి వ్యక్తిగత తగాదాలో మరణిస్తే వెంటనే బీసీ నాయకుడిని చంపుతారా అంటూ చంద్రబాబు అక్కడికి వెళ్లి పాడే మోశారు. అది కుల రాజకీయమా? శవ రాజకీయమా? అంతేకాక చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కూటమి ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెరలేపింది. అందువల్లే ఇప్పుడు లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదన్న డిమాండ్ వచ్చింది.
ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మరణిస్తే ప్రభుత్వం ఎందుకు 11 కోట్లు ఖర్చు చేసి సంస్మరణ సభ పెట్టింది? ఇలాంటి పలు అంశాలను ఏబీ వెంకటేశ్వర రావు ఎందుకు ప్రశ్నించలేదని కాపు సంఘం నేత దాసరి రాము నిలదీశారు. కాపు సంఘాలు జోక్యం చేసుకుని తీవ్రంగా స్పందించి ఉండకపోతే ప్రభుత్వం ఈ మాత్రం అయినా కదిలేదా అన్నది వారి ప్రశ్న. కాపు సంఘాలు ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లిన తర్వాతే వైసీపీకి చెందిన కాపు నేతలు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. తొలుత గొడవ జరిగింది టీడీపీ, జనసేనల వారి మధ్యే అన్నది నిజమా? కాదా? కొందరు జనసేన కార్యకర్తలు టీడీపీ వారి నుంచి ఎదురవుతున్న సమస్యలు, దౌర్జన్యాల గురించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
కులపరమైన విభేదాలు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ ఒక ప్రకటన ఇచ్చినప్పటికి, కాపు సంఘాలు నేరుగా కులాల పేర్లు చెప్పి ఆరోపణలు చేసినా ,ఎలాంటి చర్య తీసుకోలేదు. అంటే ఎక్కడ జనసేన కార్యకర్తలు మరింతగా రెచ్చిపోతారో అన్న భయం, కాపులు ఇంకా దూరమవుతున్నారన్న ఆందోళన ప్రభుత్వానికి రావడమే కారణం కాదా? అదే వైసీపీ వారు ముందుగా వెళ్లి ఉంటే పోలీసులు ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో! ఇదే సందర్భంలో శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే ఒకరు మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించడానికి చేసిన ప్రయత్నాలపై కూడా ప్రభుత్వం ఏ చర్య తీసుకోకపోవడాన్ని జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు.
అలాంటప్పుడు ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? మంచికి మద్దతు ఇవ్వాలని కోరినంత మాత్రాన జరుగుతున్న ఘటనలు ప్రజల దృష్టికి రాకుండా పోతాయా? కూటమి సర్కార్ ఎంత మంచిగా పనిచేస్తున్నది వారి ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. తాము లంచాలు వసూలు చేయకపోతే పనులు చేయలేమని చెప్పే ఎమ్మెల్యే ఒకరు, పదవులను అమ్ముకుంటున్నారని చెప్పే మరో ఎమ్మెల్యే.. కొందరు మంత్రులు దందాలు చేస్తున్నారని, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు వసూల్ రాజాలుగా మారారని ఎల్లో మీడియానే రాసిన కధనాలు, ఇసుక,మద్యంలలో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని వచ్చిన వార్తలు చూశాక ఇది మంచి ప్రభుత్వం అని ఎవరైనా చెప్పగలరా? చంద్రబాబు ఎంత చెప్పినా జనం అంగీకరిస్తారా? మరో సంగతి చెప్పాలి.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే లూలూ గ్రూప్ విశాఖ, విజయవాడ, మల్లవల్లిలలో కారు చౌక లీజుతో ప్రభుత్వ భూములను దక్కించుకుంది. అయితే ఇదే లూలూ గ్రూప్ గుజరాత్‌లో మాత్రం రూ.519 కోట్లు పెట్టి భూమి ఖరీదు చేసి మాల్ పెట్టుకుంటోంది. ఇలాంటి చర్యలకు జనం మద్దతు ఎందుకు? చంద్రబాబు, టీడీపీలు ముందుగా తన ఇంటిని సర్దుకున్న తరువాత వైసీపీపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది కాని, తమ తప్పులన్నిటిని, వైసీపీకి అంటకట్టే ప్రయత్నం చేస్తే సరిపోతుందనుకుంటే ఎల్లవేళలా సాధ్యపడదు. వైకుంఠపాళిలో గవ్వలతో పావులు కదుపుతున్నట్లుగా, ఏపీ ప్రజల జీవితాలను లాటరీ బతుకులుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చకుండా ఉంటే అదే పదివేలు.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


