
ఫాలో ద లీడర్ అంటూ ఉంటారు చూడండి అదిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. పదవిలో ఎంత కాలం ఉన్నామన్నది కాదు.. ఉన్నది కొద్దికాలమైనా ఆ పదవిలోకి వచ్చే ఇతరులకు ఎంత ఆదర్శంగా నిలిచామన్నది ముఖ్యమంటారు. ఈ విషయాన్ని ఆంధప్రదేశ్ రాజకీయాలిప్పుడు రుజువు చేస్తున్నాయి. ప్రత్యేకించి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన హయాంలో తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, మార్పులు, స్కీములు, ప్రాజెక్టులను ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు.
విభజిత ఏపీలో 2019-2024 టర్మ్‌లో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సృష్టించిన వ్యవస్థలు, తెచ్చిన పథకాలను ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేయక తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తరువాత కూడా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాను కూడా జగన్ తెచ్చిన వ్యవస్థలను కొనసాగిస్తానని, స్కీములను అమలు చేస్తామని, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేవారు. ఇది ఒక రకంగా నాయకుడిని అనుసరించడమే!
కూటమి సర్కారు కూడా కొన్నింటిని మినహాయించి మిగిలిన వాటి విషయంలో జగన్ విధానాలనే అనుసరిస్తోంది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కడప నగరంలో వెలిసిన ఒక ఫ్లెక్సీ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందడం వల్ల! అది అత్యంత ఆసక్తికరంగా ఉంది. జగన్‌కు ప్రజలలో వస్తున్న ఆదరణను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతడిని ఎలా అనుసరిస్తున్నాడో వివరించారీ ఫ్లెక్సీలో! ఫ్లెక్సీలోని కొన్నింటి గురించి చూద్దాం..
‘‘సంక్షేమం అంటే అంత ఇష్టం ఉండని ఆయనకు సంక్షేమం అంటే నేర్పించావు" అని ఒక కామెంట్ ఉంది దాంట్లో. నిజంగానే సంక్షేమ రంగంపై చంద్రబాబుది భిన్నాభిప్రాయం. ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. ఎన్నికల సమయంలో మాత్రం జగన్ ఇచ్చేదానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువే ఇస్తానని హామీ ఇచ్చినా, జగన్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి మేనిఫెస్టోల్లో ఊదరగొట్టినా... గెలిచిన తరువాత మాత్రం సంపద సృష్టించే సంక్షేమం అమలు చేయాలని, సంక్షేమంతోనే అన్నీ జరిగిపోవని మాట్లాడిన విషయం ప్రజల దృష్టిలోనే ఉంది.
పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచడం మినహా ఏడాది పాటు మిగిలిన అన్ని పథకాలనూ కూటమి సర్కారు ఎగవేసింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న ఎన్నికల హామీ గెలుపు తరువాత ఒక్క సిలిండర్‌కే పరిమితమైంది. ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను గుర్తించి ఏడాది తరువాత తల్లికి వందనం స్కీమును కొంత అమలు చేయక తప్పలేదు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి వాటిని అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తమ్మీద జగన్ కారణంగా చంద్రబాబు సంక్షేమ రంగం వైపు చూడక తప్పలేదని చెప్పాలి.
'ఎప్పుడూ లేనిది గెలిచిన వెంటనే కోడితో పోటీగా నిద్రలేచి పొద్దు, పొద్దునే బ్యాగు తగిలించుకుని అవ్వ,తాతలకు ఫించన్ డబ్బులు ఇచ్చేటట్లు చేశావు" అన్నది కడపలో వెలిసిన ఫ్లెక్సీలోని మరో వ్యాఖ్య. ఇది కూడా వాస్తవమే. 14 ఏళ్లు సీఎంగా ఉండగా ఏ రోజూ చంద్రబాబు ప్రతి నెల ఉదయాన్నే వెళ్లి ఫించన్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. వృద్ధులే నానా తిప్పలూ పడాల్సి వచ్చేది. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. జగన్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లను ఇళ్ల వద్దకే చేర్చేశారు. అధికారంలోకి వస్తే తానూ వలంటీర్లను కొనసాగిస్తానని ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పిన చంద్రబాబు ఆ తరువాత దానికి మంగళం పాడారు. కాని జగన్ పెట్టిన పద్దతి మాత్రం పాటించక తప్పలేదు. ఆయన స్వయంగా కొందరు వృద్ధుల వద్దకు వెళ్లి ఫించన్ అందచేస్తున్నారు. ఇందుకు అనవసరంగా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారనుకోండి. అది వేరే విషయం.
నాడు-నేడు కార్యక్రమం ద్వారా బాగు చేసిన బడులకు వెళ్లి, ప్రభుత్వ స్కూళ్ల గురించి చంద్రబాబు మాట్లాడేలా చేశారన్నది మరో కామెంట్. నిజమే. విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఎంతో ఘనంగా చెప్పిన ఘనత చంద్రబాబుది మరి. అలాంటి వ్యక్తి ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులను స్వయంగా గమనించారు. ఆ క్రమంలో అక్కడ ఒక చోట రాసి ఉన్న నాడు-నేడు పదాలను చెరపడానికి స్కూల్ సిబ్బంది నానా పాట్లు పడాల్సి రావడం విశేషం. ఇష్టం ఉన్నా, లేకపోయినా, తండ్రి, కొడుకులు కుటుంబంలోని పిల్లలందరికి తల్లికి వందనం డబ్బులు ఇవ్వక తప్పలేదని అది కూడా జగన్ ఎఫెక్టే అన్నది ఆ ఫ్లెక్సీలోని మరో అంశం.
కూటమి సర్కార్ జగన్ హయాంలో చేపట్టి ఓడరేవులు, వైద్య కళాశాలలు మొదలైన వాటిని ప్రామాణికంగా చూపి పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నది కడపలో వెలసిన ఫ్లెక్సీలోని మరో కామెంట్. పెట్టుబడిదారుల సదస్సులలో ఏపీలో కొత్తగా వస్తున్న పోర్టుల గురించి చంద్రబాబు ప్రచారం చేశారు. అవన్ని జగన్ శ్రీకారం చుట్టినవే. గతంలో జగన్ ‘‘గడప గడపకు...’’ పేరుతో పార్టీ నేతలందరిని ప్రజల ఇంటింటికి పంపిస్తే ప్రస్తుతం చంద్రబాబు కూడా అదే తరహాలో కూటమి ఎమ్మెల్యేలు, కేడర్‌ను ‘‘తొలి అడుగు’’ పేరుతో ప్రజల వద్దకు పంపుతున్నారు.
'నీ పర్యటనలు ఆపడానికి అష్టకష్టాలు పడి ఏమి చేయాలో అర్థం కాక ఆ బాధ అంతా మంత్రులపై తిట్ల దండకం అయ్యేలా చేశావ్’’ అన్నది ఇంకో కామెంట్. జగన్ టూర్లు, ఆయనకు ప్రజలలో వస్తున్న మద్దతు మొదలైనవాటిని గమనించిన చంద్రబాబు గత మంత్రివర్గ సమావేశంలో మంత్రులు పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు గట్టిగా జవాబు ఇవ్వలేకపోతున్నారని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. జగన్ పర్యటనల ఫలితంగా కూటమి సర్కార్ ఆయా సమస్యలపై స్పందించక తప్పడం లేదు. మిర్చి ,పొగాకు, మామిడి రైతుల వద్దకు జగన్ వెళ్లి పరామర్శ చేయడంతో ప్రభుత్వం హడావుడి పడి కొంత నిధులు ఇవ్వడం, కేంద్రానికి లేఖలు రాయడం వంటివి చేసింది.
'నీకు 11 సీట్లే వచ్చినా పాలన అంతా నీ కనుసన్నలలోనే జరుగుతా ఉన్నట్లు ఉంది జగనూ" అన్న వ్యాఖ్య ఈ ఫ్లెక్సీలో కొసమెరుపు. ఈ ఫ్లెక్సీపై ఎవరి పేరైనా ఉంటే ఈపాటికి రెడ్ బుక్ ప్రయోగం జరిగేదేమో! గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాని వైఎస్సార్ ముఖ్యమంత్రై రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు తాను ఇంకా ఎక్కువ సమయం ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు.
గత టరమ్‌లో కాని, ఇప్పుడు కాని అది కొనసాగుతూనే ఉంది. వైఎస్ తీసుకు వచ్చిన ఆరోగ్యశ్రీని తొలుత టీడీపీ వ్యతిరేకించింది. కాని తదుపరి అది కూడా అమలు చేయక తప్పలేదు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీముల విషయం కూడా అంతే. వైఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను కాని, హైదరాబాద్ చుట్టూరా జరిగిన అభివృద్ది కాని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసే ప్రసంగాలు కూడా వైఎస్ పాలనను గుర్తు చేస్తాయి. అలాగే గత టరమ్‌లో వైఎస్ జగన్ తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, భూముల రీసర్వే తదితర కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది.
ఎన్టీఆర్ కాలంలో పరిపాలనను మండల స్థాయికి తీసుకు వెళితే, జగన్ ప్రజల వద్దకు పాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్లి ఎంతో సదుపాయం కలిగించారు. కాకపోతే జగన్ తెచ్చిన స్కీములను కాదనలేక కొన్నిటిని నీరు కార్చడానికి చంద్రబాబు యత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయినా సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఎన్ని వ్యవస్థలను ప్రజలకు ఉపయోగపడేలా తేగలిగారన్నది చర్చనీయాంశం. ఆయన గతంలో ఇంకుడు గుంతలు, జన్మభూమి వంటివాటిని ప్రవేశపెట్టారు. కాని వాటిని ఆయనే కొనసాగించలేకపోయారు.
ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల వ్యయం చేయాలని చంద్రబాబు తలపెట్టారు. దాని ప్రభావం ఇతర ప్రాంతాలలో ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లతో పోల్చితే చంద్రబాబుకు విశేషమైన అవకాశాలు వచ్చినా వాటిని సామాన్య ప్రజల కోసం కాకుండా ధనవంతుల ప్రయోజనాల కోసం చేశారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇప్పుడు తనకంటే చిన్నవాడైన జగన్ ప్రభుత్వంలో అమలు అయినవాటిని చంద్రబాబు అనుసరించవలసి రావడం చారిత్రక సత్యం అని ఒప్పుకోవాలి.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.