
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒట్టి అమాయకులన్న మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. కొందరు నేతల చేతిలో పదే పదే మోసపోతూంటారు మరి. ఒకసారైతే ఏమో అనుకోవచ్చు కానీ.. పదే పదే మోసపోతూంటే అది ప్రజల తప్పే కదా? ప్రస్తుత ముఖ్యమంత్రి.. గతంలోనూ ఈ పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడినే ఉదాహరణగా తీసుకోండి. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఈయన చెప్పేదొకటి. చేసేది ఇంకోటి. మూడుసార్లు సీఎంగా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చిన రికార్డు మాత్రం లేదీయనకు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కాంక్షించి వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన పది వైద్య కళాశాలలను అప్పనంగా ప్రైవేటు వారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారానే నడపాలని నిర్ణయించారు. మెరుపువేగంతో పలు కళాశాలల నిర్మాణమూ సాగింది. ఐదింటిని ప్రారంభించగా మిగిలిన వాటిని కూడా మొదలుపెట్టే క్రమంలో ఎన్నికలకొచ్చాయి. అధికారం జగన్ చేజారింది. చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు ఈ వైద్యకళాశాలలపై పగబట్టినట్టు వ్యవహరించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన 50 సీట్లు వద్దనేశారు. ప్రజల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఫలితంగా వందల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు పరం కానుంది. అయితే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని, తమది సంపద సృష్టించే పార్టీ అని ఎన్నికల సమయంలో ఊరంతా ఊదరగొట్టిన ఇదే చంద్రబాబు ఇప్పుడు సంపదను అప్పనంగా ఇంకొకరికి ధారాదత్తం చేస్తున్నారు.
ఒక్కో మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం యాభై ఎకరాల భూమి కేటాయించింది. శాశ్వత నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్! ఎకరాకు వంద రూపాయల లీజంట. కాకపోతే ఆయన సంపద సృష్టిస్తానన్నారే గానీ.. పేదల కోసమని చెప్పారా ఏంటి? చెప్పలేదు లెండి! ఇంకో విచిత్రమూ ఉందిక్కడ. చంద్రబాబు ఈ మధ్య పదే పదే వల్లెవేస్తున్న పీ-4కు ఈ వైద్య కళాశాలల అమ్మకానికి లింకు పెట్టడం! ప్రభుత్వం నుంచి చౌక ధరలకు ఆస్తులు ఆస్తులు పొందిన వారు లేదంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లు పీ-4 కింద పేదలను దత్తత తీసుకుని వారిని ఉద్ధరిస్తారని బాబు చెబుతున్నారు. పైగా సంపన్నులు-పేదల మద్య లింక్ పెట్టడానికి పి-4 విధానం తెస్తానని అన్నారు. అదేమిటో తొలుత చాలామందికి అర్ధం కాలేదు.
ప్రభుత్వంలోకి వచ్చాక తన స్కీములు కొన్నిటిని ముఖ్యంగా ఆడబిడ్డ నిధి బదులు పి-4 తో సరిపెట్టుకోవాలని ఆయన ప్రత్యక్షంగా,పరోక్షంగా చెప్పారు. అంటే ఆయన ప్రైవేటువారికి సంపద సృష్టిస్తారు.ఆ తర్వాత వారు దయతలచి పేదలకు ఏదో కొంత విదిలిస్తారన్నమాట. 2024లో అనూహ్యంగా ఎన్నికై ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని విషయాలలో చంద్రబాబు యు-టర్న్ తీసుకున్నారో చెప్పనవసరం లేదు. బాబు ప్రైవేట్ పక్షపాతి అనేందుకు వైద్య కళాశాలల ఉదంతం తాజాది మాత్రమే. గతంలోనూ ఎన్నో కనిపిస్తాయి. అత్యంత విలువైన విశాఖ భూములను అణా, కాణికి తెగనమ్ముతూండటం గురించి చెప్పుకోవాలిక్కడ. గత ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ కోసం టాటా కన్సెల్టెన్సీ సంస్థ భూమి లీజుకు అడిగింది. వ్యవహారం ముందు నడుస్తూండగానే అధికార మార్పిడి జరిగింది. టీడీపీ ప్రభుత్వం లీజుమాటను పక్కకు పెట్టేసి చాలా ఉదారంగా సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకు ధారాదత్తం చేస్తామని ప్రకటించింది.
అయితే న్యాయస్థానాలు, ప్రజాసంఘాల విమర్శల నేపథ్యంలో దీన్ని లీజుగా మార్చారేమో తెలియదు. పనిలో పనిగా తమకు కావాల్సిన మరో కంపెనీకి 60 ఎకరాలు ఇదే పద్ధతిలో ఇవ్వాలనుకున్నారు కానీ.. వివాదం కావడంతో ఎకరా అర కోటికి ఇస్తున్నట్లు చెబుతున్నారు. పరోక్షంగా రూ.వంద కోట్ల లాభం చేసి పెట్టారన్నమాట. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారు. వాటిలోని ఉద్యోగులందరికి వీఆర్‌ఎస్ ఇచ్చి పంపేశారు. ఆ సంస్థలను పొందిన కొన్ని కంపెనీలు అక్కడి భూమితోనే సంపద సృష్టించుకోగలిగాయి. విశాఖ స్టీల్‌ను ఎట్టి పరిస్థితిలోను ప్రైవేట్ పరం కానివ్వమని ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు 34 విభాగాల ప్రైవేటీకరణను ఖండించకపోగా తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు సందర్భంలోనూ బోలెడంత ఆదా అవుతుంందని, ఛార్జీలు తగ్గించవచ్చని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అనేవారు.
కానీ వాస్తవానికి చేసింది సున్నా. మోపెడైన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగితే బషీర్ బాగ్ కాల్పులు జరిపించిన చంద్రబాబు నలుగురు యువకుల మరణానికి కారణమయ్యారు. ఉచిత విద్యుత్తునిస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన ఘనుడు చంద్రబాబు. ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారు. తదనంతర కాలంలో తన సంస్కరణల వల్లే ఉచిత విద్యుత్తు ఇవ్వడం సాధ్యమైందని ప్రచారం చేసుకోగలిగారు నిస్సిగ్గుగా! అంతెందుకు! గత జగన్ టర్మ్‌లో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లెక్కించడానికి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే టీడీపీ పూర్తిగా వ్యతిరేకించింది. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని లోకేశ్ పిలుపు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే అవే స్మార్ట్ మీటర్లను ఇళ్లకు కూడా బిగిస్తున్నారు.
ప్రభుత్వ ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీల పరం చేస్తున్నారు. దీనివల్ల బీమా కంపెనీలకు ప్రభుత్వం సుమారు రూ.వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు ఆ సంస్థలకు సంపద అంటే ప్రజల ధనం చేరుతుందన్నమాట. జగన్ ప్రభుత్వం ద్వారా మద్యం షాపులను ఊరుబయట నడిపిస్తే, చంద్రబాబు సీఎం కాగానే వాటన్నిటిని తీసేసి ప్రైవేటు వారికి, ముఖ్యంగా తన పార్టీ వారికి ఆదాయ వనరుగా మార్చారు. అది సంపద సృష్టి అన్నమాట.పలు రోడ్లను ప్రైవేటు పరం చేస్తారట. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి కూడా ఎల్లో మీడియా అండతో సమర్థించుకోవడం ఆరంభమైంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, ప్రభుత్వ రంగంలో అయితే బాగా నడవవని కూడా ప్రచారం చేయిస్తారు.
ప్రభుత్వ ప్రచారం కోసం రూ.2300 కోట్లతో ఫైబర్ నెట్ సంస్థను అభివృద్ది చేసి, నిర్వహణను ప్రైవేటు వారికి అప్పగిస్తారని ఎల్లో మీడియానే రాసింది. సూపర్ సిక్స్ వంటివాటి అమలుపై పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అని కూడా చంద్రబాబు కొన్నిసార్లు అన్నారు. అయినా ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో కొన్ని హామీలనైనా కొంతమేరకైనా అమలు చేయక తప్పడం లేదు. వైద్య కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఘాటు ప్రకటన చేశారు. ‘‘కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందేరం చేస్తారా’’ అని ప్రశ్నించారు. 2019కి ముందు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తెచ్చారా అని ఆయన చంద్రబాబును అడిగారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ వైద్య కళాశాలలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.
టీడీపీ మద్దతుదారుల్లోనూ చాలామందికి వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నచ్చడం లేదు. ఈ మధ్య లోకేశ్ విజన్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా అదే తరహా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ ప్రసంగం చూస్తే ఆయన ప్రస్తుత మంత్రి నారాయణ ద్వారా బ్రిడ్జి కోర్స్ చదివారట. మొత్తం ప్రైవేటు విద్యా సంస్థలలోనే ఆయన చదువు కొనసాగింది. ప్రైవేటు యూనివర్శిటేలే బెటర్ అని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న ఆయన ప్రస్తుత విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇవేవి పట్టవు కాబట్టి వీరికి ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు పేదల సంక్షేమానికి పుట్టిన పార్టీగా చెప్పేవారు.
చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక అది కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంపద సృష్టించే పార్టీగా గుర్తింపు పొందుతోంది. సినిమాల ద్వారా ధనికుడు అయిన ఎన్టీఆర్. పేదల సంక్షేమం గురించి స్కీములు తెచ్చారు. అలాగే సంపన్న కుటుంబంలో పుట్టిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ లు పేదల పక్షపాతులుగా పేరు తెచ్చుకున్నారు. పేదరికం నుంచే వచ్చిన చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఉన్నారన్న విమర్శకు గురి అవుతున్నారు.. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యంత సంపన్న సి.ఎమ్.గా రికార్డు సాధించారు. ఆయన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల డార్లింగ్ గా గుర్తింపు పొందారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వైద్య కళాశాలలను పిపిపి పేరుతో ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిది తప్పు?ఆంధ్ర ప్రజలదా? లేక చంద్రబాబుదా?
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత