
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల గొంతు నులిమేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల అణచివేతకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. వీరి సిఫారసులు ఎలా ఉంటాయన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వం తీరుతెన్నులను విమర్శిస్తున్న, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను నకిలీలుగా ముద్రవేసే ప్రయత్నం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏది ఫేక్ ఏది కాదన్నది అందరికంటే బాగా తెలిసింది ప్రజలకే. కానీ ప్రభుత్వం, టీడీపీలు రెండూ తాము చెప్పిన విషయాలే సత్యమని నమ్మించేందుకు, ప్రభుత్వంలో జరుగుతున్న రకరకాల అవినీతి కార్యకలాపాలు బయటకు రాకూడదన్నట్టు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన బాబు, పవన్‌లు వైసీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదని ఇప్పటికీ విమర్శిస్తూండటం విచిత్రం.
ప్రతిపక్షంలో ఉండగా అన్ని వర్గాలను ప్రభుత్వంపై ఉసిగొల్పేలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచిన ఈ ద్వయం ఇప్పుడు మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే వారి సంగతి చూస్తామని, కొత్త చట్టాలు తెచ్చి అణచివేస్తామని అధికారికంగానే చెప్పుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో యూరియాకు పెద్ద కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాలనే సామాజిక మాధ్యమాలు బాగా హైలైట్ చేశాయి. దీంతో చంద్రబాబు తెగ ఆవేశపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాలే లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరకు ఈ విమర్శ హద్దులు దాటి.. మనుషులా, పశువులా అనే వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రైతుల సమస్యను బహిర్గతం చేస్తున్న సాక్షి మీడియాపై కూడా తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. టీడీపీ అనుబంధ మీడియా సాయంతో సాక్షిలో వచ్చే వార్తలు ఫేక్ అన్న ప్రచారం చేయాలన్నది ఆయన ఉద్దేశం.
ప్రతిపక్ష నేత జగన్ కూడా ఏ విమర్శ చేసినా అందులో సహేతుకత ఉండేలా జాగ్రత్తపడతారు. కాగ్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలిచ్చిన సమాచారం ఆధారంగానే టీడీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు, పవన్‌లు అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాల ఆధారంగా రాజకీయాలు చేయడం వీరికి అలవాటే.
జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వీరు చేసిన అసత్యపు అరోపణలు అన్ని ఇన్నీ కావు. హిందూ మతానికి అపచారం జరిగిపోతోందని పదే పదే చెప్పేవారు. ప్రతి చిన్న విషయాన్నీ జగన్‌కు ఆపాదిస్తూండే వారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రసాదం లడ్డూలో కల్తీ ఆరోపణలు కూడా జగన్‌పైకే నెట్టేసే ప్రయత్నం చేసిన విషయం ఇటీవలి పరిణామమే. ఇదే సమయంలో జగన్ మాత్రం హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసే ఆరోపణలు కూడదని బాబు, పవన్‌కు హితవు చెప్పారు. తిరుమలకు అప్రతిష్ట తీసుకురావద్దని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముప్పైవేల మంది మహిళలు మాయమైనట్టు, అందుకు వలంటీర్లు కారణమైనట్టు తనకు కేంద్ర నిఘా వర్గాల వారు చెప్పారని పవన్ చేసిన ఇంకో ఆరోపణ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయన పూర్తిగా మరచిపోయారు.
కొద్ది రోజుల క్రితం వైఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జగన్, ఆయన తల్లి విజయమ్మ తదితరులు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆమె కుమారుడిని ఆపాయ్యంగా దగ్గరకు తీసుకున్న సన్నివేశాన్ని అంతా చూశారు. అయినా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఒక వీడియో కూడా ఎడిట్ చేసి టీడీపీ వారు ప్రచారం సాగించారని వైసీపీ ఆరోపించింది.
కేంద్రం సూచనల ప్రకారం జగన్ ముఖ్యమంత్రిగా రీసర్వే చేపడితే జగన్ భూములన్నిటిని లాగేసుకుంటారని చంద్రబాబు, పవన్, లోకేశ్‌లు నానా యాగీ చేశారు. తీరా చూస్తే ఏమంది? అధికారంలోకి వచ్చిన తరువాత వారు కూడా అదే రీసర్వే పథకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం అప్పుల గురించి కూడా ఇంతే. అప్పులతో ఆంధ్రప్రదేశ్ కాస్తా శ్రీలంక మాదిరిగా అల్లకల్లోలమైపోతుందని ఒకసారి.. అప్పులు రూ.14 లక్షల కోట్లు దాటిపోయాయని ఇంకోసారి రకరకాలుగా వ్యాఖ్యానించిన అప్పటి ప్రతిపక్ష నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట సవరించుకున్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ స్వయంగా రాష్ట్రం అప్పులు రూ.6.5 లక్షల కోట్లని వెల్లడించారు. కానీ చంద్రబాబు ఆ తర్వాత కూడా జగన్ టైమ్‌లో రూ.పది లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారు. పోనీ అందులో తన 2014 టరమ్ లో చేసిన అప్పు,విభజన నాటి అప్పు కూడా ఉందని చెబుతారా? అంటే అదేమి ఉండదు. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకువచ్చారు. ఈ వార్తను సాక్షి ఇచ్చింది. దానిని ఖండించే పరిస్థితి కూటమి సర్కార్‌కు లేదు.
విశాఖలో జరిగిన సోదాల్లో ఒక కంపెనీలో మాదకద్రవ్యాలు వచ్చాయని, అదంతా వైసీపీ వారికి సంబంధించిందన్నట్టు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎంతగా ప్రచారం చేశాయి? తీరా చూస్తే అవి డ్రగ్స్ కాదని, అక్వా కంపెనీలలో వాడే ఈస్ట్ అని తేలింది. జగన్ టైమ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదంటూ టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సైతం తమ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు తెచ్చినట్లుగా చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లు గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలు, చెప్పిన అసత్యాలు, చేసిన ఆచారణ సాధ్యంకాని వాగ్దానాలు మొదలైన వాటన్నిటిని ప్రస్తావిస్తూ నాడు-నేడు కింద సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఇవి వీరిని బాగా చికాకు పెడుతున్నాయి. తమ ఫేక్ ప్రచారమే తమకు చుట్టుకుంటోందన్నది వారి బాధ కావచ్చు. ఎవరు ఫేక్ ప్రచారం చేసినా తప్పే. అంతేకాదు. సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నేతలను, రాజకీయాలతో సంబంధం లేని జగన్ సతీమణి భారతి వంటివారిపై కూడా ఒక వర్గం సోషల్ మీడియా నీచమైన పోస్టులు పెడుతున్నా, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే టీడీపీ వారిపై ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తారు. ఎవరు అలాంటి పోస్టులు పెట్టినా ఒకే రకంగా పోలీసు వ్యవస్థ స్పందిస్తే మంచిది కదా!.
చంద్రబాబు,లోకేశ్‌లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టులో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు నడుపుతుంటారని, తప్పుడు ప్రచారాలు చేయిస్తుంటారని వైసీపీ తరచుగా ఆరోపిస్తుంటుంది. అయినా ఇతర సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూటమి నేతలు భరించలేకపోతున్నారన్న భావన ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను, సాక్షి మీడియాను తరచు బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. కుట్రపూరితంగా జర్నలిస్టులను జైళ్లకు పంపుతున్నారు. అయినా వారి వైఫల్యాలు, స్కామ్‌లు బయటకు వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో ఏకంగా కొత్తగా చట్టాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు.
విపక్షంలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్య తీసుకోవాలని యత్నిస్తే చాలు.. నోటీసులు ఇస్తే చాలు..ఇంకేముంది భావ స్వేచ్ఛను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలో ఉంటే మాత్రం ఎవరికి భావ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉండకూండా చూడాలని యత్నిస్తున్నారు.ఇలా ప్రతి అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే చంద్రబాబు అసలు రాజకీయం.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.