సాక్షి, తాడేపల్లి: తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మోంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు.
‘‘పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుపాను దెబ్బపడింది. దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడ్డం కష్టమయ్యే పరిస్థితి. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఉన్న సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం దాటిల్లింది. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

‘‘మన ప్రభుత్వంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేది. ప్రతి పంటకూ ఇ-క్రాప్ చేసే వాళ్లం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో గట్టిగా పనిచేసేది. ఉచిత పంటలబీమాతో రైతులకు భరోసా ఉండేది. 80 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేది. 70 లక్షల ఎకరాల పంట బీమా పరిధిలో ఉండేది. ఇవాళ ప్రీమియం కట్టిన రైతులు 19 లక్షలమందికి మాత్రమే బీమా అందుబాటులో ఉంది. మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం అండగా ఉండాలి.

..ఈ 16 నెలల్లో అల్పపీడనలు, వాయుగుండాలు, తుపాన్లు కారణంగా 16 వచ్చాయి. ఎంతమందికి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందింది, నష్టపోయిన రైతులను ఎంతమందిని ఆదుకున్నారు చూస్తే.. గుండుసున్నాయే కనిపిస్తుంది. ఏ రైతునూ ఆదుకున్న పరిస్థితి లేదు. ఇ-క్రాప్ అందించిన పరిస్థితి కూడా లేదు. వాళ్లు వేసిన అరకొర లెక్కల ప్రకారమే 5.5 లక్షలమంది రైతులకు రూ.600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. మిర్చికి క్వింటాలుకు రూ.11,781కి కొనుగోలు చేస్తామన్నారు ఒక్క రూపాయికూడా రైతుకు ఇవ్వలేదు. పొగాకును కొనుగోలు చేస్తామ న్నారు దిక్కూ మొక్కూ లేదు. మామిడిని కిలో రూ.12లకు కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క రైతుకూ మంచి చేయలేదు. తర్వాత హెక్టారుకు రూ.5౦వేలు ఇస్తామన్నారు. అదికూడా ఇచ్చిన పాపాన పోలేదు.


..ఇ-క్రాప్ నీరుగార్చారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ మానవ తప్పిదాలు. మన హయాంలో మనమే ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టి 54.55 లక్షల మంది రైతులకు రూ.7800 కోట్లు ఇన్సూరెన్స్ ఇప్పించగలిగాం. కాని ఇవాళ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది’’ అంటూ వైఎఎస్ జగన్ మండిపడ్డారు.


