తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(గురువారం, అక్టోబర్ 30వ తేదీ) పార్టీ నేతలతో జూమ్ మీటింగ్‌లో పాల్గొనున్నారు. మోంథా తుపానుకు సంబంధించి పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్ పాల్గొనున్నారు.
మోంథా తుపాను ప్రభావంతో ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చించనున్నారు వైఎస్ జగన్. రేపు ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు వైఎస్ జగన్.
తుపాను తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను జిల్లా అధ్యక్షులు ఈ కాన్ఫరెన్స్‌లో వివరించనున్నారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలను తెలియజేయనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు .జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
కాగా, మోంథా తుపాను నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తుపాను నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
జగన్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు గడచిన మూడు నాలుగు రోజులుగా చురుగ్గా పనిచేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో చొరవచూపారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ పలు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు బాసటగా నిలిచారు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తుపాను మిగిల్చిన నష్టాన్ని స్వయంగా చూసి, బాధితులకు భరోసా ఇచ్చారు.


