మంత్రి నారా లోకేశ్‌తో టీడీపీ గుంటూరు రూరల్ మండల అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాస్
కాల్‌మనీ ఆగడాలకు బలైన కాపు మహిళ
టీడీపీ నేతల టార్చర్ తట్టుకోలేకపోతున్నా
రూ.రెండు లక్షలు తీసుకుని రూ.1.30 లక్షలు తిరిగి చెల్లించేశా.. అయినా రోజూ ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు
చెల్లిస్తానన్నా వినడం లేదు.. తీవ్రంగా వేధిస్తున్నారు
సెల్ఫీ వీడియో తీసుకుంటూ కాపు మహిళ బలవన్మరణం
ప్రధాన నిందితుడు టీడీపీ మండల కన్వీనర్
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో ఘటన
గుంటూరు: ‘‘నా చావుకు కారణం టీడీపీ నేతలు కల్లూరి శ్రీనివాసరావు, కర్లపూడి. శ్రీనివాసరావు, రమేష్, పద్మ, పద్మ చెల్లి సీత, ఆమె పెద్దకొడుకు శివకృష్ణ, పొట్ట జాను అనే వ్యక్తి కోడలు జానీ బేగం. వాళ్ల టార్చర్ తట్టుకోలేకపోతున్నా. కర్లపూడి శ్రీనివాసరావు తురకపాలెం గ్రామంలో రెండు లక్షలు అప్పుగా ఇప్పించగా అందులో రూ.1.30 లక్షలు తిరిగి చెల్లించేశా. అయినా రోజూ వేధిస్తున్నారు. ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు.
తెలిసో తెలీకో వాళ్ల దగ్గర అప్పుచేశా. నేను తింటానికి కాదు. అమ్మా శివమణి (కూతురు).. నాన్నని ఏమీ అనొద్దు, నవీన్ (అల్లుడు) నువ్వు జాగ్రత్త నాన్న.. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో.. అంటూ ఈపూరి శేషమ్మ అనే వివాహిత పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి యత్నించింది. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా వెంగళాయపాలెం మిర్చియార్డులో గత మంగళవారం జరిగింది.
ఆమెను హుటాహుటిన కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారం రోజుల నుంచి మృత్యువుతో పోరాడి మంగళవారం మరణించింది. ఆమె పురుగుల మందు తాగుతూ తీసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
ఇచ్చేది రూపాయి వసూలు చేసేది రూ.వేలల్లో
వెంగళాయపాలెంలో టీడీపీ నేతల కాల్‌మనీ దాష్టీకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తీసుకున్న అప్పుకు వడ్డీలకు వడ్డీలు, చక్రకవడ్డీలు లెక్కగట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఠంచనుగా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇంటికొచ్చి వేధిస్తున్నారు. అందరిముందూ పరువు తీస్తున్నారు. ఈ ఆగడాలు భరించలేకే గ్రామానికి చెందిన ఈపూరి శేషమ్మ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శేషమ్మ, ముసలయ్య (మద్దిలేటి)ల దంపతులకు కుమార్తె ఉంది. ఆమెకు పెళ్లయింది.
వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ మిర్చియార్డు కాలనీలో ఉంటున్నారు. శేషమ్మ పలువురు వద్ద అప్పులు తీసుకుంది. తీసుకున్న అప్పులకు ప్రతి నెలా వడ్డీలు చెల్లిస్తోంది. మిగిలిన డబ్బు కోసం అప్పు ఇచ్చినవారు ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. ఈ క్రమంలో శేషమ్మ తన కుమార్తెకు తద్ది తీర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించుకుంది.
అదే రోజు గ్రామంలోని పలువురు ఇంటికి వచ్చి తమ వద్ద తీసుకున్న అసలు, వడ్డీ తిరిగి ఇవ్వాలని లేకుంటే కుటుంబాన్ని రోడ్డున పడేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అసభ్య పదజాలంతో అవమానించారు. లైంగికంగా కూడా వేధించినట్టు సమాచారం. దీంతో ఆమె తట్టుకోలేక సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకుంది.
కల్లూరి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అనుచరుడు
శేషమ్మ సెల్ఫీ వీడియోలో చెప్పిన కల్లూరి శ్రీనివాసరావు టీడీపీ గుంటూరు రూరల్ మండల అధ్యక్షుడు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అనుచరుడు. దీంతో ఆయన ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


