అనంతపురం సర్వజనాస్పత్రిలో పద్మావతి ఏజెన్సీ ఆగడాలు
కోవిడ్‌లో ప్రాణాలకు తెగించి పనిచేసిన వారిని తొలగించేందుకు సన్నాహాలు
ఉద్యోగ భయంతో పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం
విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన కార్మికులు
అనంతపురం (మెడికల్): అనంతపురం సర్వజనాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఇంటికి సాగనంపి కొత్త వారిని విధుల్లోకి తీసుకునేందుకు యత్నించిన ఏజెన్సీ నిర్వాకాన్ని నిరసిస్తూ శనివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సర్వజనాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులను వయసు నిబంధన పేరిట ‘పద్మావతి ఏజెన్సీ’ విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే ఏజెన్సీ నిర్వాహకుల దురుసు ప్రవర్తనతో మనస్తాపం చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మావతి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో శనివారం పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాలు వీరి ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నాయి.
ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు కొత్తగా పదుల సంఖ్యలో డైలీ వేజెస్ కింద సిబ్బందిని గుట్టుగా తీసుకువచ్చి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చూశారు. దీనిపై కార్మికులు కన్నెర్ర చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత సమక్షంలోనే ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజారెడ్డితో వాగ్వాదానికి దిగారు. వివిధ వార్డుల్లో పనిచేస్తున్న ప్రైవేట్ సిబ్బందిని కార్మికులు అడ్డుకుని, తోసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
ఆందోళనలు చేపట్టి, దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు కార్మిక సంఘాల నాయకులను హెచ్చరించారు. ఆస్పత్రికి వచ్చిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను పారిశుద్ధ్య కార్మికులు చుట్టుముట్టారు. తమను అన్యాయంగా తొలగిస్తున్నారని వాపోయారు. సమస్యను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.
కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోం
కోవిడ్ పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనులు చేసిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి మండిపడ్డారు. వయసు పేరిట కార్మికులను తొలగించాలని చూస్తే ఊరుకోబోమన్నారు. సీఐటీయూ నేత నాగేంద్ర మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మిత్రుడు భాస్కర్ నాయుడుకు చెందిన పద్మావతి ఏజెన్సీ దౌర్జన్యం, దాష్టీకానికి కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, రాజారెడ్డి, అనిల్‌కుమార్‌గౌడ్, కాకర్ల శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ హుస్సేన్, వామపక్ష నాయకులు రామిరెడ్డి, సురేష్, యేసురత్నం, ఏటీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


