- స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు టెండర్ల పిలుపు
- లేదు లేదంటూనే... ప్రైవేటీకరణ దిశగా శరవేగంగా ప్రభుత్వం అడుగులు
- ఎన్నికలకు ముందు.. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతాం అంటూ చంద్రబాబు హామీలు
- ఆంధ్రుల హక్కును లాభాల బాట పట్టిస్తామని బూటకపు వాగ్దానాలు
- అధికారంలోకి వచ్చాక గత 18 నెలలుగా ప్రైవేటీకరణ దిశగా ఒక్కో అడుగు
- 5,500 మంది కాంట్రాక్టు కారి్మకులు నిర్దాక్షిణ్యంగా తొలగింపు
- 1,590 మంది రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్‌ఎస్ ద్వారా ఇంటికి పంపిన వైనం
- ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా చెల్లింపు.. ఉత్పత్తికి తగిన వేతనం అంటూ మెలిక
- ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? అని ఇటీవల సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
- ప్రభుత్వ రంగంలో ఉంది కదా.. అని బెదిరించలేరంటూ హూంకరింపులు
- విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు అడగకుండా ప్రైవేటులోని మిట్టల్ ప్లాంట్‌కు గనులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరిన టీడీపీ సర్కార్ ఎంపీలు
- తాజా పరిణామంపై మండిపడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు
- ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ దీర్ఘకాలిక పోరాటం
- ప్రధాన ఉత్పత్తి విభాగం ఎస్‌ఎంఎస్–1లో సీసీడీ సెక్షన్ అప్పగింతకు నిర్ణయం
- మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో ఈ సీసీడీ విభాగం వెన్నెముక వంటిది
- అలాంటిదానిని ప్రైవేట్‌కు ఇస్తే ప్లాంట్ మొత్తం వారి చేతుల్లో పెట్టినట్లే!
- మెయింటెనెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్‌కూ వర్తింపు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు శరవేగంగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతోంది..! ఆంధ్రుల హక్కు వడివడిగా చేజారిపోతోంది..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతాం... లాభాల బాట పట్టిస్తాం అంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారం దక్కాక ప్లేటు ఫిరాయించేస్తున్నారు..! గత ఏడాదిన్నరగా ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టే దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు..! ఈ క్రమంలో తొలుత కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు.
రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్‌ఎస్ ద్వారా ఇంటికి పంపారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు... ఉన్న ఉద్యోగులకు జీతాల చెల్లింపును ఆలస్యం చేస్తున్నారు. అదీ సరిపోక ఉత్తత్పికి తగిన వేతనం అంటూ మెలికపెట్టారు.
ఇక ఇటీవల మరింత ముందుకెళ్లి ‘‘ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? ప్రభుత్వ రంగంలో ఉంది కదా? అని బెదిరించలేరు’’ అంటూ సీఎం చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏకంగా స్టీల్ ప్లాంట్ ప్రధాన ఉత్పత్తి విభాగం అయిన ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు వీలుగా టెండర్ నోటీసులు జారీ చేశారు.
ఇంతకాలం దాగుడుమూతలు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంతకాలం దాగుడుమూతలు ఆడింది ప్రభుత్వం. ఇప్పుడు మాత్రం వేగంగా ప్రైవేట్‌పరం చేసేందుకు చర్యలు వేగిరం చేస్తోంది. ఇప్పటివరకు కేవలం మొత్తం నిర్వహణ (టోటల్ మెయింటినెన్స్) పనులను మాత్రమే ప్రైవేటుకు అప్పగించారు. ఇప్పటివరకు మెయింటినెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్‌కూ వర్తింపు కాగా, ప్రైవేటుపరం చేసేందుకు వీలుగా మొదట 46 విభాగాలను ఎంపిక చేశారు.
తర్వాత పలు విభాగాల నిర్వహణకు ఆగస్టులో తొలి విడతగా ఒకేరోజు 32 ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులు ఆహ్వానించారు. ఇలా ఆర్‌ఎంహెచ్‌పీ, సెంటర్ ప్లాంట్ మెయింటెనెన్స్‌కు ఈవోఐలు జారీ చేశారు. తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్–1, థర్మల్ పవర్ ప్లాంట్–2, ఎస్‌ఎంఎస్ సీసీఎం–4, మాధారం మైన్స్, ఫౌండ్రీ, సెంట్రల్ మెషిన్ షాప్ (సీఎంఎస్) వంటి అనేక ఇతర విభాగాలను కూడా ప్రైవేట్‌కు కట్టబెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ప్లాంట్‌కు వెన్నెముక ఇది...
స్టీల్ ప్లాంట్‌లోని ప్రధాన ఉత్పత్తి విభాగం ఎస్‌ఎంఎస్–1లో కోల్ కెమికల్ డిపార్ట్‌మెంట్ (సీసీడీ) ప్రైవేటీకరణకు టెండర్లు ఆహ్వానిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరు కంటిన్యూస్ క్యాస్టింగ్ మెషీన్ (సీసీఎం)లతో పాటు గ్యాస్ కటింగ్ మెషీన్లను ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవడంతో ప్లాంట్ ఉద్యోగుల్లో కలకలం మొదలైంది.
స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్‌లో తయారయ్యే హాట్ మెటల్‌ను స్టీల్ మెల్ట్ షాప్(ఎస్‌ఎంఎస్)లో వివిధ ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి లిక్విడ్ స్టీల్‌గా తయారు చేస్తారు. ఈ ద్రవపు ఉక్కును ఫినిష్‌డ్ స్టీల్‌గా తయారు చేసే ప్రక్రియలో తొలుత సీసీఎంల ద్వారా బ్లూమ్స్‌గా మారుస్తారు. ఈ బ్లూమ్స్‌ను డిమాండ్‌ను బట్టి రోలింగ్ మిల్స్ విభాగంలో రీబార్స్, యాంగిల్స్, చానెల్స్ తదితర ఫినిష్‌డ్ స్టీల్‌గా చేస్తారు.
కన్వర్టర్‌లో తయారైన లిక్విడ్ స్టీల్‌ను సీసీఎంలో పంపడం ద్వారా బ్లూమ్స్ తయారవుతాయి. గతంలో 3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పుడు ఎస్‌ఎంఎస్–1లో సీసీఎంల ద్వారా ఏడాదికి 2.82 మిలియన్ టన్నుల బ్లూమ్‌లు ఉత్పత్తి చేసేవారు. ఆధునికీకరణ తర్వాత సామర్థ్యం 3.5 మిలియన్ టన్నులకు పెరిగింది. తద్వారా 3.29 మిలియన్ టన్నుల బ్లూమ్స్ తయారయ్యే సామర్థ్యం ఏర్పడింది.
స్టీల్ ప్లాంట్ నిర్వహణలో సీసీడీ ఇంతటి కీలక విభాగం. ఇలాంటిదానిని ప్రైవేట్‌కు ఇస్తే... ప్లాంట్ మొత్తం వారి చేతుల్లో పెట్టినట్లేననే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. 680 మంది ఉద్యోగులను తొలగించే ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు. ఇప్పటికే వేలమంది కార్మికులను ఖర్చు నియంత్రణ (కాస్ట్ కటింగ్) పేరుతో బయటకి పంపారని గుర్తుచేస్తున్నారు.
తాజా టెండర్లలో కూడా పూర్తిగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోని భారీ ప్రైవేటు సంస్థలే పాల్గొనే విధంగా నిబంధనలను రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.131.33 కోట్ల విలువైన ఆపరేషన్స్ పనులకు టెండర్ తుది గడువును జనవరి 3వ తేదీగా నిర్ణయించారు. 4వ తేదీన బిడ్‌ను తెరిచి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు.
విశాఖ ఉక్కుకు కాకుండా మిట్టల్ కోసం పాట
దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఇటీవల మరింత స్పష్టమైంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆంధ్రుల హక్కుగా గొప్పగా చెప్పుకొనే ఈ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని కోరలేదు.
సరికదా... నక్కపల్లి వద్ద ఏడాదికి 24 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక ఈ ప్రైవేట్ ప్లాంట్‌కు బొగ్గు గనులు ఇవ్వాలని కూడా టీడీపీ కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ముద్ర వేసి.. వదిలించుకునే కుట్ర...
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు చేసింది. మొదట ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ముద్ర వేసింది. అంతేకాక నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధించడం మొదలుపెట్టారు.
అనంతరం ప్లాంటులో ఉన్న కాంట్రాక్టు కార్మికులను 5,500 మందిని తొలగించారు. ఇక రెగ్యులర్ ఉద్యోగులను కూడా వీఆర్‌ఎస్ ద్వారా 1,590 మందిని ఇంటికి సాగనంపారు. ఉద్యోగులు ఇంట్లో పడుకుని జీతాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు నవంబరు 15న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించారు.
తద్వారా ఉద్యోగుల నైతిక స్థ్యైర్యాన్ని దెబ్బతీశారు. ప్రజల్లో వారి పట్ల వ్యతిరేక ధోరణి వచ్చేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే అసలు సక్రమంగా జీతాలివ్వకుండా... ఉత్పత్తికి తగిన వేతనం అంటూ మెలికపెట్టారు. మూడో విడతలో మరో వెయ్యిమంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఉద్యోగులు ఇంట్లో తిని పడుకుంటే జీతాలివ్వాలా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించాక వెంటనే యాజమాన్యం ఉత్పత్తికి తగిన వేతనమంటూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తాజాగా ప్లాంట్ ఆపరేషన్స్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు టెండర్లను ఆహ్వానించి మిగిలిన ఉద్యోగులను కూడా సాగనంపేందుకు నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది.
కాపాడడమంటే ఇదేనా చంద్రబాబూ..?
స్టీల్ ప్లాంట్‌ను కాపాడతాం అంటూ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు గెలిచాక పట్టించుకోవడం మానేశారు. ప్రైవేటీకరణకు బాటలు వేస్తున్నారని ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. ఒత్తిడి పెరగడంతో చివరకు ‘ప్యాకేజీ’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అయితే, ప్యాకేజీలో భాగంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడపడం, శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులను గణనీయంగా తగ్గించడం వంటి చర్యలు ప్రారంభించారని విమర్శిస్తున్నారు. అంతేకాక ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను తగ్గించి, గత ఏడాది సెప్టెంబర్ నుంచి పూర్తి జీతాలు చెల్లించడం లేదని వాపోతున్నారు.
ఇప్పుడు ఆపరేషన్స్ విభాగం టెండర్లు పూర్తయితే... మరింతమంది శాశ్వత ఉద్యోగులను తొలగించే ప్రమాదం ఉందని ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ పోరాటం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ మొదటినుంచి ఒకే పంథా అనుసరిస్తోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాలను వెనక్కి తీసుకునేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ దీర్ఘకాలం పాటు ఒత్తిడిని కొనసాగించడంతో ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రైవేటీకరణపై అడుగులు ముందుకుపడలేదు.
దొడ్డిదారిలో కుట్ర
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే కుట్రలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ఎస్‌ఎంఎస్–1లో సీసీడీ సెక్షన్ ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచారు. తద్వారా ఈ విభాగంలో పనిచేసే 450 మంది రెగ్యులర్, 230 మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యోగాలు తొలగిస్తారనే ఆందోళన నెలకొంది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు విధించిన నిబంధనలన్నీ చంద్రబాబు ప్రభుత్వం కనుసన్నల్లోని భారీ ప్రైవేటు సంస్థలకు కావాల్సిన విధంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ప్లాంట్‌ను దొడ్డిదారిలో ప్రైవేటుపరం చేసే కుట్రగా అర్థమవుతోంది. – జగ్గునాయుడు, గౌరవాధ్యక్షుడు, విశాఖ స్టీల్ ప్లాంట్, సీఐటీయూ
ముక్తకంఠంతో ఖండిస్తున్నాం
ఏవో చిన్నచిన్న విభాగాలను కాకుండా ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ సెక్షన్‌నే ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది మొత్తం ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకేనని స్పష్టమవుతోంది. ఒకవైపు ప్రైవేటుకు ఇవ్వమని చెబుతూనే, మరోవైపు కీలక విభాగాలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు టెండర్లను పిలవడం ఏమిటి? ఇదంతా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి సహకారంతోనే జరుగుతోంది. దీనిని ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. – దాలినాయుడు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ స్టీల్ ప్లాంట్ అధ్యక్షులు
టెండర్లను రద్దు చేయాలి
స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్‌ఎంఎస్)... స్టీల్‌ప్లాంట్‌కు గుండెకాయ వంటిది. దానిని ప్రైవేటీకరించడం అంటే ప్లాంట్‌ను ప్రైవేటీకరణే అవుతుంది. మెయింటినెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణను ఆపరేషన్స్‌కూ వర్తింపజేయడం దుర్మార్గం. యాజమాన్యం వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలి. – ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ స్టీల్‌ప్లాంట్ విభాగం


