పోర్టును గాలికొదిలేశారు..! | - | Sakshi
Sakshi News home page

పోర్టును గాలికొదిలేశారు..!

Dec 14 2025 6:55 AM | Updated on Dec 14 2025 6:55 AM

పోర్టును గాలికొదిలేశారు..!

పోర్టును గాలికొదిలేశారు..!

● ముంబైకే పరిమితమైన ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ ● డిప్యూటీ చైర్మన్‌, సెక్రటరీకి బదిలీ ● పెత్తనమంతా గతంలో సీబీఐ దాడుల్లో చిక్కిన మహిళా అధికారిదే..

సాక్షి, విశాఖపట్నం: మేజర్‌ పోర్టులతో పోటీపడుతూ.. సరకు రవాణాలో దూకుడుగా వెళ్తున్న విశాఖపట్నం పోర్టు అథారిటీకి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసేసింది. ఒకేసారి ఉన్నతాధికారులను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్తవారిని నియమించకుండా.. పోర్టు కార్యకలాపాలను గాలికొదిలేసింది. ఇదే అదనుగా ఓ మహిళా అధికారి పోర్టులో పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ కూడా పట్టించుకోకపోవడంతో ఆయా విభాగాధికారులు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ముందుకు కదలని ఫైళ్లు : విశాఖ పోర్టు అనాథగా మారిపోయింది. అధికారులంతా బదిలీ అవ్వడంతో కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలు అస్తవ్యస్తమైపోయాయి. పోర్టు చైర్మన్‌ డా.అంగముత్తుని ముంబై పోర్టు చైర్మన్‌గా బదిలీ చేయడంతో పాటు వీపీఏ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. అయినా.. చైర్మన్‌ మాత్రం ముంబైకే పరిమితమయ్యారు. నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే పోర్టుకు వస్తూ.. తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి వదిలేస్తున్నారు. దీంతో పాలన గాడితప్పింది. ఇక డిప్యూటీ చైర్మన్‌గా దుర్గేష్‌ కుమార్‌ దూబే పదవీ కాలం ఇంకో రెండు నెలలు ఉన్నా.. ఇటీవలే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. పోర్టు చరిత్రకు భిన్నంగా డిప్యూటీ చైర్మన్‌ పదవీకాలం ఉన్నప్పటికీ బదిలీ చేసేశారు. రిలీవ్‌ అయ్యేందుకు ఈ నెల 19వ తేదీ వరకూ సమయం ఉన్నా బదిలీ విషయంలో జరిగిన అన్యాయంతో పోర్టు వ్యవహారాల్ని పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా ఏళ్ల తరబడి సెక్రటరీగా వ్యవహరించిన వేణుగోపాల్‌ని పారాదీప్‌ పోర్టుకు డిప్యూటీ చైర్మన్‌గా బదిలీ చేశారు. పరిపాలన వ్యవహారాల ఫైళ్లు ముందుకు కదిపే ఉన్నతాధికారులు లేకపోవడంతో పోర్టులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది.

అంతా ఆమె కనుసన్నల్లోనే..!

ట్రాఫిక్‌ విభాగంలో ఉన్నతాధికారి అనారోగ్యం కారణంగా అంతంత మాత్రంగానే విధుల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. దీంతో ఈ విభాగంలో కార్యకలాపాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం షిప్స్‌ బెర్తింగ్‌, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వ్యవహారాలు కిందిస్థాయి సిబ్బంది ద్వారా మేనేజ్‌ చేస్తున్నారు. ఇలా పోర్టులో ప్రతి విభాగాన్ని నడిపించే నాయకత్వం లేకపోవడంతో వ్యవహారాలు సరిగా జరడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులెవ్వరూ లేకపోవడంతో ఓ మహిళా అధికారి.. అంతా తానై పోర్టులో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమైపె గతంలో సీబీఐ దాడులు జరిగాయి. తర్వాత విధుల్లో చేరిన సదరు మహిళా అధికారి ఇప్పుడు పోర్టులో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారంటూ విమర్శలొస్తున్నాయి. పోర్టులో అన్ని విభాగాల్లోనూ ఆమె తలదూర్చి.. ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీలైనంత త్వరగా విభాగాధిపతులను నియమించి పోర్టును తిరిగి గాడిలో పెట్టాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement