మళ్లీ ఆపరేషన్ లంగ్స్
డాబాగార్డెన్స్: ఆపరేషన్ లంగ్స్–2 మళ్లీ మొదలైంది. ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారోనన్నా ఆందోళనతో చిరువ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు మూడు నెలల కిందట భాగస్వామ్య సదస్సు, నగరాభివృద్ధి పేరిట జీవీఎంసీ పరిధిలో వేలాది దుకాణాలు తొలగించి చిరు వ్యాపారులను రోడ్డున పడేశారు. ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఇప్పటి వరకు దుకాణాలు కోల్పోయిన వారిని పట్టించుకున్న నాథుడే కరువ య్యాడు. మళ్లీ శనివారం జీవీఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణలు తొలగించారు. ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై ఆక్రమణలు తొలగిస్తున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తెలిపారు. ప్రజా సౌకర్యార్థమై ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు.
● జోన్–1 పరిధి ఒకటో వార్డులో అంబేడ్కర్ విగ్రహం నుంచి తగరపువలస వైఎస్సార్ విగ్రహం వరకు 15 ఆక్రమణలు, జోన్–2 పరిధి 5, 7 వార్డుల్లో మారికవలస జంక్షన్ నుంచి బోయపాలెం రోడ్డు వరకు, చంద్రంపాలెం నుంచి హైస్కూల్ వరకు 40 ఆక్రమణలు, జోన్–3 పరిధి 18వ వార్డులో సమతా కాలేజీ సర్కిల్, ఏఎస్ రాజా కాలేజీ సర్కిల్‌లో 23 ఆక్రమణలు, జోన్–4 పరిధి 31వ వార్డు లీలామహాల్ జంక్షన్ నుంచి సౌత్ జైల్ రోడ్డు వరకు 31 ఆక్రమణలు, జోన్–5 పరిధి 54, 55, 56, 57 వార్డుల్లో కంచరపాలెం నుంచి ఎన్‌ఏడీ జంక్షన్ వరకు 80 ఆక్రమణలు, జోన్–6 పరిధి 65, 66, 71, 72, 75, 76 వార్డుల్లో శ్రీనగర్ నుంచి దుర్గానగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుంచి గంగవరం పోర్టు రోడ్డు వరకు 70 ఆక్రమణలు, జోన్–7 పరిధి 82, 83 వార్డుల్లో నెహ్రూచౌక్ నుంచి తహసీల్దార్ కార్యాల యం వరకు 12 ఆక్రమణలు, జోన్–8 పరిధి 97వ వార్డు సుజాతనగర్ 80 ఫీట్ రోడ్డు నుంచి ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు 30 ఆక్రమణలు తొలగించినట్టు సీసీపీ తెలిపారు.
జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణల తొలగింపు


