జీవితానికి సిలబస్ ఉండదు.. అనుభవమే పాఠం
ఏయూ వేదికగా సుధామూర్తి స్ఫూర్తిదాయక ప్రసంగం ● ఘనంగా ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మద్దిలపాలెం: వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం(వేవ్స్–2025) ఆదివారం ఘనంగా జరిగింది. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో పూర్వ విద్యార్థుల ఉత్సాహం నడుమ సాగిన ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరై తన అద్భుత ప్రసంగంతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. విశ్వవిద్యాలయాన్ని ‘విద్యను అందించే దేవాలయం’గా అభివర్ణించిన సుధామూర్తి.. సి.ఆర్.రెడ్డి వంటి మహనీయుల త్యాగాలను, సర్వేపల్లి రాధాకృష్ణన్ వేసిన పునాదులను గుర్తుచేసుకున్నారు. నేర్చుకోవడం, ప్రశ్నించడం ఆపేసిన రోజే మనం వృద్ధులం అవుతామని, నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే సంతోషంగా జీవించగలమన్నారు. కళాశాలలో సిలబస్ ఉంటుంది, కానీ జీవితానికి సిలబస్ ఉండదన్నారు. ఇక్కడ ఆచార్యులు మార్గదర్శకం చేస్తారని, కానీ బయట మన అనుభవాలే పాఠాలు నేర్పుతాయని చెప్పారు. చాట్ జీపీటీ సమాచారాన్ని ఇవ్వగలదేమో కానీ, ఒక వ్యక్తి వృత్తి అనుభవానికి అది ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. మీ మారథాన్‌లో మీరే పరుగెత్తాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సంపద పెరిగే కొద్దీ దానం చేసే గుణం పెరగాలని, నచికేతుడు–యమధర్మరాజు సంభాషణ, గంగ కథలను ఉదాహరిస్తూ నైతిక విలువలతో కూడిన జీవనం సాగించాలని ఉద్బోధించారు. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇది ‘గేట్‌వే ఆఫ్ ది ఈస్ట్’గా మారుతోందన్నారు. పూర్వ విద్యార్థులు తమ సమయం, నైపుణ్యం లేదా ధనంలో ఏదో ఒక రూపంలో వర్సిటీకి తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చారు. కనీసం ఒక్క విద్యార్థికై నా మార్గదర్శకత్వం వహించాలని కోరారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల వేళ మహిళా సాధికారత థీమ్‌తో ఈ సమ్మేళనం జరగడం విశేషమన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన అష్టలక్ష్మి నృత్య రూపకం, విదేశీ విద్యార్థుల నృత్యాలు, జానపద కళారూపాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్య అతిథి సుధామూర్తిని ఘనంగా సత్కరించి, రాఘవేంద్రస్వామి జ్ఞాపికను అందజేశారు. అలాగే డాక్టర్ దేవ హెచ్ పురాణం, ఆచార్య ఎ.జానకిరావు, డాక్టర్ జి.నిర్మలలను సత్కరించారు. ఏయూ అలుమ్ని సావనీర్‌ను ఆవిష్కరించారు. ఉదయం ఎంపీ సుధామూర్తి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఏయూలో ఉన్న తాళపత్రాల జ్ఞానాన్ని నిపుణులతో అధ్యయనం చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. బీచ్‌రోడ్డులోని రతన్ టాటా ఆవిష్కరించిన పైలాన్‌ను సందర్శించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏయూ రెక్టార్ పి.కింగ్, రిజిస్ట్రార్ కె.రాంబాబు, పూర్వ వీసీలు, మాజీ మంత్రులు, ఎన్నారైలు పాల్గొన్నారు.
ప్రసంగిస్తున్న రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి
కార్యక్రమానికి హాజరైన పూర్వవిద్యార్థులు
వేదికపై విద్యార్థుల నృత్యాలు
జీవితానికి సిలబస్ ఉండదు.. అనుభవమే పాఠం
జీవితానికి సిలబస్ ఉండదు.. అనుభవమే పాఠం
జీవితానికి సిలబస్ ఉండదు.. అనుభవమే పాఠం


