అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఈఓలు సతమతం
బాధ్యతలు స్వీకరించి.. ఆ వెంటనే దీర్ఘకాలిక సెలవులోకి
అధికార పార్టీ నేతల కబంధహస్తాల్లో మాన్యం భూములు
కౌలు చెల్లించకపోగా.. అనధికారికంగా భూముల విక్రయం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కార్యనిర్వహణాధికారి (ఈఓ) దీర్ఘకాలిక సెలవుల కారణంగా ఆలయ నిర్వహణ – మాన్యం భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మాన్యం భూములు దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు లీజు ఎగ్గొట్టడమే కాకుండా అనధికారికంగా భూములు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉరవకొండ/అనంతపురం కల్చరల్: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అనంతపురం జిల్లా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సాగాల్సిన పాలనా వ్యవహారాలపై చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది.
దీంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) గా ఎవ్వరు వచ్చినా కొద్దిరోజులకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల లీజుల కేటాయింపు–నిధుల ఖర్చు చేయాలంటూ వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే ఆలయంలో ఏమి జరిగినా దిక్కు లేకుండా పోతోంది.
లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2,114 ఎకరాల మాన్యం ఉంది. ఇందులో 146 ఎకరాల ఈనామ్ భూమి, 412 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. మిగతా 1,554 ఎకరాలు ఆమిద్యాల, మోపిడి, కోనాపురం, పెద్దముస్టూరు, మూలగిరిపల్లి, రాచెర్ల, చిన్నముసూ్టరు పరిధిలో ఉన్నాయి. ఆలయ మాన్యాలు కొంతమంది అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయి. సొంత భూములు ఉన్నా సరే నామమాత్రపు కౌలు చెల్లిస్తూ కొన్నేళ్లుగా ఆలయ భూమిని అనుభవిస్తున్నారు.
సాధారణంగా వర్షాధారం అయితే ఎకరాకు రూ.6 వేలు, సాగునీటి సౌకర్యం ఉంటే ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలు చెల్లించాల్సి ఉన్నా.. ఇక్కడ నారసింహుడికే నామాలు పెట్టి ఎకరాకు నామమాత్రంగా రూ.500 నుంచి రూ.2,500 ఏడాదికి చెల్లిస్తున్నారు. కౌలుదారుల్లో చాలామంది అనధికారికంగా సబ్‌లీజుకు ఇచ్చుకున్నారు.
కొందరు అధికార పార్టీ నేతలైతే కౌలు భూమి తమ సొంత ఆస్తి అయినట్టు ఇతరులకు విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి సుమారు 1,400 ఎకరాలకు సంబంధించి కౌలు లీజు ముగిసినా నేటికీ ఆలయ భూములకు బహిరంగ వేలం పాటను అధికారులు నిర్వహించలేదు. 20 శాతం మంది మాత్రమే అసలైన కౌలుదారులు సక్రమంగా ఆలయానికి సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయ భూముల టెండర్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అన్నీ తామై సిండికేట్‌గా మారి టెండర్లు దక్కించుకోవాలని చూడటంతో గతేడాది ఆగస్టు నుంచి వరుసగా మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఏడాదికి సగటున 20 వేల మంది స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటారు.
2024–25 ఏడాదికి ఉరవకొండకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు రూ.27 లక్షలకు తలనీలాల సేకరణ హక్కులను దక్కించుకున్నాడు. అయితే ఇందులో రూ.9.5 లక్షలు మాత్రమే సదురు టీడీపీ నాయకుడు ఆలయానికి చెల్లించి, మిగతా సొమ్ము నేటికీ జమ చేయలేదు. ఈ సొమ్ములో కూడా గతంలో ఈఓగా విధులు నిర్వహించిన ఓ అధికారి తన సొంతానికి రూ.3 లక్షలు వాడుకున్నట్లు ఆలయ సిబ్బందే గుసగులాడుకోవడం గమనార్హం.
భక్తులు పరమపవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం పెన్నహోబిలంలో కొంతకాలంగా కనుమరుగైంది. లడ్డూ ప్రసాదం టెండరు ప్రక్రియ ఆగిపోయి చాలా కాలమైంది. అధికార పార్టీ నేతలు – దేవదాయ శాఖ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో భక్తులకు లడ్డూ ప్రసాదమే లేకుండా చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా రమేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. అయితే టీడీపీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో భరించలేకపోయిన ఆయన దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. దీంతో అప్పటి జిల్లా సహాయ కమిషనర్ (ఏసీ) తిరుమలరెడ్డికి ఆలయ ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
అయితే ఆయనకూ అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పలేదు. దీంతో ఆయన కూడా సెలవులోకి వెళ్లిపోయారు. తదుపరి ఈఓ బాధ్యతలు గుంతకల్లుకు చెందిన మల్లికార్జున తీసుకుంటారని ఎండోమెంటు అధికారులు చెప్తున్నా.. ఆయన మాత్రం ముందుకు రాలేదు. ఈ క్రమంలో అనంతపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం ఈఓగా ఉన్న సుధారాణికి తాత్కాలికంగా పెన్నహోబిలం ఆలయ బాధ్యతలు అప్పగించారు.
పెన్నహోబిలం ఆలయ నూతన పాలక మండలి ఇంకా కొలువుదీరలేదు. అయినా సభ్యులుగా తామే ఉంటామని, మేము చెప్పినట్లుగా మీరు పనిచేయాల్సి ఉంటుందని కొందరు అధికార పార్టీనేతలు ఈఓలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి అయ్యే రూ.5 లక్షల ఖర్చును ఆలయ నిధుల నుంచే వెచ్చించాలని షరుతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఈ అంశం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. చేసేది లేక సెలవుపై వెళ్తున్నారని తెలుస్తోంది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
పెన్నహోబిలంలో మేం గుర్తించిన సమస్యలను పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కొన్నాళ్లుగా ఈఓ లేనిమాట నిజమే. సెలవులో ఉన్న తిరుమలరెడ్డి ఈ నెల 19న వస్తారు. అప్పటి వరకు నేను ఇన్‌చార్జ్‌గా మాత్రమే కొనసాగుతాను. కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా మేము కూడా ఎండోమెంటు ఇన్‌స్పెక్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. – సుధారాణి, పెన్నహోబిలం ఆలయఇన్‌చార్జ్, దేవదాయ శాఖ ఇన్‌చార్జ్ ఏసీ


