ఇంటర్‌ పరీక్షల్లో భారీ మార్పులు | Major changes in intermediate exams | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షల్లో భారీ మార్పులు

Dec 14 2025 4:42 AM | Updated on Dec 14 2025 4:43 AM

Major changes in intermediate exams

సిలబస్‌కు అనుగుణంగా మొదటి ఏడాదిలో మార్కుల విభజన 

అన్ని పేపర్లు 100 మార్కులకు ఉండేలా కూర్పు

సైన్స్‌ సబ్జెక్టులకు 85 మార్కులకు పేపర్, రెండో ఏడాదిలో 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ 

బోటనీ 43, జువాలజీ 42 మార్కులకు వేర్వేరు పేపర్లు 

సిలబస్‌ మారిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్‌ 

తొలిసారి ఒక్క మార్కుల ప్రశ్న విధానం 

ఈసారికి ఇంటర్‌ రెండో ఏడాదికి పాత పరీక్షా విధానమే అమలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్య­లో 2025–26 విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్‌­ను అమలు చేసిన బోర్డు.. అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసింది. ప్రశ్నల సరళి, మార్కుల కూర్పు సైతం మారనుంది. జాతీ­య విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇంటర్మీ­డియట్‌ మొ­ద­టి ఏడాదిలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, పరీక్షలకు సీబీ­­ఎస్‌ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 

ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్‌ సిలబస్‌లో ఈ ఏడాది మార్పులు చేశారు. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. అలాగే ఒక్క మార్కు ప్రశ్నల విధానం ప్రవేశపెట్టారు. సిలబస్‌ మారిన సబ్జెక్టుల పరీక్షలు రాసేందుకు జవా­బుల బుక్‌లెట్‌ను 32 పేజీలకు పెంచారు. 

సిలబస్‌ మారని సబ్జెక్టులకు 24 పేజీల బుక్‌లెట్‌ ఉంచారు. సబ్జెక్టులు మారినందున పరీక్షల నిర్వహణలోనూ మార్పులు తెచ్చారు. ఒక్కో పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్‌ రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం మొదటి ఇంటర్‌ పరీక్షల్లో ఈ మార్పులు ఉంటాయి. రెండో ఏడాది పరీక్షలను మాత్రం ఈ ఏడాది పాత విధానంలోనే నిర్వహిస్తారు.  

అమల్లోకి ఐదు సబ్జెక్టుల విధానం 
ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజెస్, నాలుగు మెయిన్‌సబ్జెక్టులు (మొత్తం ఆరు), ఆర్ట్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజెస్, మూడు మెయిన్‌ సబ్జెక్టులు (మొత్తం ఐదు) ఉన్నాయి. మార్కుల కేటాయింపు కూడా భిన్నంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. అన్ని గ్రూపులకు ఒక లాంగ్వేజ్, 4 మెయిన్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌ తప్పనిసరి. 

రెండో లాంగ్వేజ్‌ని ‘ఎలక్టివ్‌’ (ఆరో సబ్జెక్టు)గా మార్చారు. అంటే విద్యార్థి లాంగ్వేజ్‌ లేదా 23 మెయిన్‌ సబ్జెక్టుల్లో ఒకటి ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి 5 సబ్జెక్టుల్లో ఒకటి ఫెయిలై.. ఆరో సబ్జెక్టు పాసైతే అప్పుడు ఆరో సబ్జెక్టును మెయిన్‌ సబ్జెక్టుగా పరిగణిస్తారు. అయితే, ఆరో సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్‌ తప్పనిసరిగా పాసవ్వాలి.  

» సైన్స్‌ లేదా ఆర్ట్స్‌ గ్రూపుల్లో మూడు (3, 4, 5 సబ్జెక్టులు) ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి.  
» గతంలో ఎంపీసీలో ‘మ్యాథ్స్‌–ఏ, బి’ పేపర్లు (ఒక్కో పేపర్‌ 75 మార్కులు) ఉండగా, ఇప్పుడు ఒక్క పేపర్‌ మాత్రమే ఉంటుంది.  
» బైపీసీలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘బయాలజీ’గా ఒక్క ప్రశ్నపత్రం మాత్రమే ఇస్తారు. ఇందులో బోటనీకి 43, జువాలజీకి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. జవాబులు రాసే బుక్‌లెట్స్‌ రెండింటికీ వేర్వేరుగా ఇస్తారు. వేర్వేరుగా జవాబులు రాయాలి. 
» ఆర్ట్స్‌లో సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రస్తు­తం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యా­ర్థులు నచి్చన కాంబినేషన్‌ను ఎంచుకోవచ్చు. 
» కామర్స్‌లో కామర్స్‌ పార్ట్‌–ఏ 50 మార్కులకు, అకౌంటెన్సీ పార్ట్‌–బి 50 మార్కులకు పేపర్‌ ఉంటుంది.
మార్కుల్లో మార్పులు 
» మొదటి ఏడాది ఇంటర్మీడియట్‌లో ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో సై­న్స్‌ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టు­లకు 85 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది. రెండో ఏడాది పరీక్షల్లో ప్రాక్టికల్స్‌ 30 మా­ర్కులకు ఉంటుంది. అంటే రెండేళ్లకు రాత పరీక్ష 170 (85+85) మార్కులకు, ప్రాక్టికల్స్‌ 30 మా­ర్కులు.. మొత్తం 200 మార్కులకు ఉంటుంది. 
» గతేడాది వరకు మ్యాథమెటిక్స్‌–ఏ, బి పేపర్లుగా 150 మార్కులకు ఉండగా, వాటిని కూడా రద్దు చేసి ఒకటే పేపర్‌ 100 మార్కులకు కుదించారు. 
» ఉత్తీర్ణతకు 100 మార్కుల పేపర్లకు 35 మార్కులు, 85 మార్కుల పేపర్లకు 29 మార్కులకు తప్పనిసరి చేశారు. అంటే సైన్స్‌ సబ్జెక్టుల్లో రెండేళ్లకు కలిపి 59 మార్కులు రావాలి. సైన్స్‌ ప్రాక్టికల్స్‌ రెండేళ్లలో 30 మార్కులకు గాను 11 మార్కులు తప్పనిసరిగా సాధిస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.  
» ఒకటి రెండు సబ్జెక్టుల్లో అధిక మార్కులు, మరో రెండు, మూడు సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు సాధించినా ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. అన్ని సబ్జెక్టుల్లోనూ సరాసరి 35 శాతం మార్కులు తప్పనిసరి. అయితే, ఈ అవకాశం మొదటి ప్రయత్నంలో పరీక్షలు రాసేవారికి మాత్రమే వర్తిస్తుంది. 
» ఈసారి పరీక్షల్లో అర, 1, 2, 4, 5, 8, 16 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అర, ఒక్క మార్కు ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి ‘‘ఛాయిస్‌’’ విధానం అమల్లోకి తెచ్చారు.  
» ప్రస్తుత (2025–26) విద్యా సంవత్సరంలో రెండో ఏడాది ఇంటర్‌ విద్యార్థులకు పాత సిలబస్‌తోనే పరీక్షలు జరుగుతున్నందున ఎలాంటి మార్పులు చేయలేదు.

ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు 
» పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్‌ రూపొందించారు. అయితే, హోలీ (మార్చి 3), రంజాన్‌ (మార్చి 20) తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆ తేదీల్లో జరిగే పరీక్షలను మరుసటి రోజు నిర్వహించేలా టైంటేబుల్‌లో మార్పులు చేసి, ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. ప్రభుత్వ అనుమతి రాగానే మార్పులతో కూడిన టైంటేబుల్‌ను ఇంటర్‌ విద్యా శాఖ వెల్లడించనుంది.

గతంలో ఒక్కో సబ్జెక్టు ఒక్కో తీరుగా మార్కుల విధానం.. 
ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో గతంలో భాషా పేపర్లు 100 మార్కులకు ఉండేవి. సబ్జెక్టులకు మాత్రం వేర్వేరుగా ఉండేవి. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో తీరుగా ప్రశ్నలు, మార్కుల కేటాయింపు ఉండేది. ఆర్ట్స్‌ గ్రూపులకు మొత్తం 5 పేపర్లు 500 మార్కులు ఉండేవి. ఎంపీసీకి 470 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. మ్యాథమెటిక్స్‌లో రెండు పేపర్లు 75 మార్కుల చొప్పున 150 మార్కులకు, సైన్స్‌ గ్రూప్‌లో సబ్జెక్టుకు 60 మార్కుల చొప్పున పేప­ర్లు ఉండేవి. 

రెండో ఏడాదిలో మ్యాథ్స్‌ మినహా మిగిలిన ఫిజి­క్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలకు సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌ మార్కులు కేటాయించేవారు. ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్‌ గ్రూపులు మినహా, సైన్స్‌ సబ్జెక్టులకు ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపులో మార్పులు చేశారు. మొదటి ఏడాది ఎంపీసీలో మొత్తం మార్కులు యథావిధిగా 470 మార్కులే ఉండగా, బైపీసీలో గతంలో 440 మార్కులు ఉండగా, కొత్త విధానంలో 455 మార్కులకు పెరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement