వైఎస్సార్ కడప జిల్లా తొండూరు మండలం యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్ని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళుతున్న సిబ్బంది
10 మంది విద్యార్థులకు అస్వస్థత
వైఎస్సార్ కడప జిల్లా యాదవారిపల్లెలో ఘటన
పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలింపు
పురుగుల మందు కొట్టిన వంకాయలు కడగకుండా కూర వండటమే కారణం
24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్న వైద్యులు
తొండూరు: మధ్యాహ్న భోజన పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక పాఠశాలలో దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం సంతకొవ్వూరు పంచాయతీ పరిధిలోని యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 10మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఇది రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏపాటిదో స్పష్టం చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం పాఠశాలలో మెనూ ప్రకారం అన్నం, పప్పు, రసం అందించాల్సి ఉంది.
అయితే అన్నం, వంకాయ కూర, సాంబారు, స్వీట్ పొంగలిని విద్యార్థులకు వడ్డించారు. వీటిని తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు అయ్యాయి. పాఠశాలలో 10 మందికి ఒకేసారి వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల ఉపాధ్యాయిని భారతి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు.
24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్న వైద్యులు
వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు 108 వాహనంలో పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి 24 గంటలు ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వల్లే విరేచనాలు, వాంతులు అయ్యాయని తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న మండల విద్యాధికారి భారతి ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపడతామని, విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తామని చెప్పారు.
పురుగుమందుల అవశేషాల వల్లే..
కూర కోసం తోటలోని వంకాయలు తెచ్చి కడగకుండా వండారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విషపూరిత వంకాయలతో కూర వండటం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి విద్యార్థుల్ని పాఠశాలలకు పంపిస్తుంటే.. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను కనీసం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
తరచూ ఏదో ఒకమూల మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడం.. కొందరు మరణించడం చూస్తుంటే విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉందో అవగతం అవుతోందని విద్యార్థి సంఘాల నేతలు దుయ్యబడుతున్నారు.
ఉపాధ్యాయిని సస్పెన్షన్
ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయిని భారతిని సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా విద్యా శాఖ కార్యాలయం ప్రకటించింది. ఎంఈవో భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.


