కళాత్మక విద్యుత్ దీప స్తంభాల ఏర్పాటుకు రూ.5.55 కోట్లు మంజూరు
ఆ పనులకు రూ.4.27 కోట్ల అంచనాతో టెండర్ పిలిచిన సీఆర్‌డీఏ
ఐదు రోజుల్లోనే టెండర్ ప్రక్రియ ముగించాలని నిర్ణయం
2016లోనే కరకట్ట రోడ్డుపై విద్యుత్ దీప స్తంభాలు, అత్యాధునిక లైటింగ్ ఏర్పాటు.. అవి బాగున్నప్పటికీ తొలగించి కొత్తగా ఏర్పాటుకు సర్కార్ సిద్ధం
అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిధులు దుబారా చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు.. ఇప్పటికే కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు రూ.4 కోట్లకు పైగా వ్యయం
చంద్రబాబు ప్రత్యేక హెలీకాప్టర్, విమానాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.40.96 కోట్ల ఖర్చు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు ప్రభుత్వం భారీ హంగులు కల్పిస్తోంది. రూ.5.55 కోట్లతో కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నుంచి చంద్రబాబు నివాసం ఉంటున్న కృష్ణా కరకట్ట ప్యాలెస్, ఈ3 (సీడ్ యాక్సిస్ రోడ్డు)–ఎన్9 జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కళాత్మకంగా తీర్చిదిద్దిన కొత్త స్తంభాలు, ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు పరిపాలన అనుమతిచ్చారు. ఆ పనులు చేపట్టడానికి అక్టోబర్ 10న రూ.4.27 కోట్ల అంచనా వ్యయంతో, నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఆ టెండర్‌ను రద్దు చేసింది. తాజాగా ఈ పనులు చేపట్టేందుకు టెండర్ పిలవడానికి రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో నవంబర్ 29న సీఆర్‌డీఏ సీఈ సాంకేతిక అనుమతి ఇచ్చారు. దాంతో ఆ పనులకు రూ.4.27 కోట్ల అంచనా వ్యయంతో శనివారం రెండోసారి సీఆర్‌డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.
టెండర్లలో బిడ్ల దాఖలుకు తుది గడువును ఈ నెల 17గా నిర్ణయించింది. అంటే.. కేవలం ఐదు రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం. స్వల్పకాలిక టెండర్‌కు కనీస వ్యవధి వారం రోజులు. కానీ.. ఈ టెండర్‌ను కేవలం ఐదు రోజుల్లోనే ముగించాలని నిర్ణయించడాన్ని బట్టి చూస్తే.. పనులను ఏ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలన్నది ముందుగానే నిర్ణయించారన్నది స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. పాత విద్యుత్ స్తంభాలు, లైటింగ్ వ్యవస్థ బాగున్నప్పటికీ వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
18 నెలల్లో కరకట్ట అక్రమ ప్యాలెస్ మరమ్మతులకు రూ.4కోట్లకు పైగా ఖర్చు
ఇక చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ ప్యాలెస్‌లో ప్రస్తుతం ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ స్థానంలో కొత్త లైన్ వేయడానికి రూ.47 లక్షలు, 250 కేవీఏ జనరేటర్ స్థానంలో 320 కేవీఏ జనరేటర్ ఏర్పాటుకు రూ.60 లక్షలు... వెరసి రూ.1.07 కోట్లను మంజూరు చేశారు. కరకట్ట ప్యాలెస్ అత్యవసర మరమ్మతులకు రూ.2.16 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంమీద 18 నెలల్లోనే కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు రూ.4 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నారు.
కృష్ణా నది కరకట్ట లోపల ఉండవల్లికి సమీపంలో లింగమనేని రమేష్ అక్రమంగా ఈ ప్యాలెస్ నిర్మించారు. ఆ ప్యాలెస్‌తోపాటు కరకట్ట లోపల నిర్మించినవన్నీ అక్రమ కట్టడాలేనని, వాటిని కూల్చివేస్తామని 2015లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నదిలో పడవపై తిరుగుతూ హంగామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన అప్పటి సీఎం చంద్రబాబు... ఆ కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి ఉండవల్లిలోని లింగమనేని రమేష్ అక్రమ కట్టడం(కరకట్ట ప్యాలెస్)లోకి మకాం మార్చారు.
2014–19 మధ్య కరకట్ట ప్యాలెస్‌తోపాటు హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని నివాసం, మదీనగూడలోని ఫాంహౌస్‌లో వసతుల కల్పన, భద్రతకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా ఖర్చు చేస్తూనే ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలీకాప్టర్, ప్రత్యేక విమానాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.10.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.40.96 కోట్లు ఖర్చు చేసినట్లయ్యింది. చంద్రబాబు అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకోవాల్సిందిపోయి దుబారా చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


