శాంతించిన మోంథా! | Cyclone Montha effect almost reduced due to wind shear | Sakshi
Sakshi News home page

శాంతించిన మోంథా!

Oct 29 2025 5:03 AM | Updated on Oct 29 2025 5:12 AM

Cyclone Montha effect almost reduced due to wind shear

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పెనికేరులో నీట మునిగిన వరి చేనులో దీనంగా రైతులు

నరసాపురం సమీపంలో అర్ధరాత్రి ఒంటిగంటకు తీరం దాటిన పెను తుపాను

తీరం దాటే సమయంలో మోస్తరు ప్రభావం

సైక్లోన్‌ ఐ లో విండ్‌ షీర్‌ ఏర్పడటమే కారణం.. అందువల్లే చెల్లాచెదురైన వర్షాలు

తీరం దాటిన ప్రాంతంలో గాలులతో కూడిన మోస్తరు వర్షాలు

గంటకు 110 కి.మీ వేగంతో గాలులు, అత్యంత భారీ వర్షాలని అంచనా

కానీ విండ్‌ షీర్‌ కారణంగా దాదాపు తగ్గిపోయిన మోంథా ప్రభావం

బుధవారం సాయంత్రంతో తగ్గుముఖం పట్టే అవకాశం

స్తంభించిన వాయు, రైలు, రోడ్డు రవాణా

సాక్షి, విశాఖపట్నం: మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది.. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో జన జీవనాన్ని స్తంభింపజేసింది.. తుపాను సముద్రంలో ఉంటేనే ఇంత అలజడి సృష్టించిందే.. ఇక తీరం దాటే సమయంలో ఉప్పెనలా విరుచుకు పడుతుందంటూ వాతావరణ నివేదికలు హెచ్చరించాయి... తీరం సమీపిస్తున్న కొద్దీ అందర్లోనూ ఉత్కంఠ.. ఆందోళన.. రాకాసి మోంథా ఎలా ముంచేస్తుందో.. ఎక్కడ విరుచుకుపడుతుందోనని తీర ప్రాంత జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు.. పాములు పట్టేవాడు పాముకాటుకే బలయ్యారనే నానుడిలా... గాలులన్నింటినీ తనలో కలిపేసుకుంటూ బలంగా దూసుకొచ్చిన మోంథా.. చివరికి ఆ గాలుల కోత వల్లే బలహీన పడింది. 

తీరం దాటుతున్నా  ప్రశాంత వాతావరణం.. కొద్దిపాటి బలమైన గాలులు.. మోస్తరు నుంచి భారీ వర్షాలతో సముద్రాన్ని వదిలి నేలమీదకి వచ్చింది. ముంచేస్తుందనుకున్న మోంథా.. మౌనంగా వెళ్లిపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వ హడావుడి నుంచి తేరుకున్నారు. అయితే వాయు, రైలు రవాణా స్తంభించిపోయింది. మొత్తంగా భయాందోళనలు సృష్టించిన తీవ్ర తుపాను  మోంథా.. రాష్ట్రంపై మోస్తరు ప్రభావంతో వీడ్కోలు చెప్పేసింది. 

మోంథా ఎందుకు శాంతించిందంటే.. 
వాస్తవానికి మోంథా తుపాను వేగం, గమనం చూస్తే 2023లో బాపట్లలో తీరం తాకిన మిచాంగ్‌ తుపానును తలపించింది. సముద్రంలో తీవ్ర తుపానుగా బలపడటంతో గాలులన్నింటినీ తనలో చేర్చుకొని మరింత బలంగా మారింది. దీంతో మోంథా తుపాను.. రాష్ట్రంలోని అనేక తీర ప్రాంతాల్ని తుడిచి పెట్టుకుపోతుందని అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే.. తీరానికి 70 నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న సమయంలో విండ్‌ షీర్‌ (గాలుల కోత) మొదలైంది. తుపాన్‌లో కీలకమైన సైక్లోన్‌ ఐ పై విండ్‌ షీర్‌ పంజా విసిరింది. దీంతో తుపాను గాలులు చీల్చుకుపోతూ కకావికలమైపోయాయి. 

దీంతో మోంథా తీరం దాటకముందే బలహీనపడిపోయింది. విండ్‌ షీర్‌ ప్రభావంతో తుపాను∙ప్రధాన కేంద్రం నుంచి చెల్లాచెదురైన గాలులు, మేఘాల ప్రభావం తీరం దాటే ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల జిల్లాలపై చూపించింది. దీంతో.. మోంథా తన శక్తిని కోల్పోయి.. తీరం దాటేందుకు సిద్ధమై.. కడలిని వదిలి భూమిని తాకింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు అంచనా వేసినా.. వాస్తవ స్థితిలో మాత్రం 70 నుంచి 80 కి.మీ. వేగంతో మోస్తరు వర్షాలకే పరిమితమవ్వడంతో తీర ప్రాంతమంతా ఊపిరి పీల్చుకుంది.   

కొన్ని ప్రాంతాల్లోనే ప్రభావం 
మోంథా తీవ్ర తుపాను తీరం తాకనంత వరకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాను వణికించింది. కానీ తీరానికి చేరుకోగానే పూర్తి నిశ్శబ్ధ వాతావరణాన్ని తలపించింది. ఉదయం 10 గంటల నుంచి మొదలైన గాలులు సాయంత్రం ఏడు గంటల వరకు జిల్లా వాసులను భయాందోళనలకు గురి చేశాయి. తీరానికి సమీపిస్తే తుపాను విరుచుకుపడుతుందనే ఆందోళన అందరి కంటి మీద కునుకులేకుండా చేసింది. 

భారీగా వీచిన ఈదురు గాలులకు పెద్ద సంఖ్యలో కొబ్బరి చెట్లు నేల కూలాయి. భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా పడిపోయాయి. విద్యుత్‌ తీగలు తెగి పడడంతోపాటు పదుల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఉదయం 10 గంటల నుంచి జిల్లాలో పలు మండలాలకు విద్యుత్‌ లేకుండా పోయింది. సముద్ర అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడగా, 300 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చాయి. తీరం భారీగా కోతకు గురైంది.  

తీరానికి చేరువయ్యే సమయంలో ప్రశాంతమే  
రాత్రి 8 గంటల తర్వాత మోంథా తుపాను ప్రభావం పూర్తిగా కనిపించలేదు. అసలు నిజంగా తుపాను∙ఇక్కడ తీరం దాటుతోందా.. లేదా దిశ మార్చుకుందా? అనే సందేహమే అందరిలోనూ మొదలైంది. అలజడి సృష్టించిన ఈదురు గాలులు నిలిచిపోయాయి. భారీ వర్షం సైతం తగ్గుముఖం పట్టింది. సముద్రంలో అలజడి కొనసాగుతున్నా భారీ వర్షం.. ఈదురు గాలులు లేకపోవడం జనాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తుపాను అర్ధరాత్రి ఒంటి గంటకు నరసాపురం సమీపంలో తీరం దాటింది. 

ఈ సమయంలో 110 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షం కురుస్తుందని కోనసీమ వాసులు ఆందోళన చెందారు. కళ్ల ముందు 1996 పెను తుపాను విషాదం కదలాడింది. కాని అందుకు విరుద్ధంగా గాలులు నిలిచి పోవడంతో పాటు భారీ వర్షం తగ్గి కేవలం చినుకులు పడుతుండడంతో మోంథా తుపాను గమనం ఎవరికీ అంతుచిక్కలేదు. దీంతో తీర ప్రాంతవాసులు బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.   

తూర్పు గోదావరి జిల్లాలో... 
తొలుత కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసినా.. విండ్‌ షీర్‌ కారణంగా స్వల్పంగా దిశ మార్చుకొని అంతర్వేది పల్లిపాలెం వైపు వెళ్తుందన్న వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన తుపాను వేగం మంగళవారం నాటికి 12 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఫలితంగా దీని దిశ మారిపోయి, జిల్లాకు ముప్పు తప్పింది. అయితే పెనుగాలులు, జోరు వానలతో ఈ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. 

జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కాకినాడ తీరంలో బలమైన ఈదురు గాలులకు వర్షాలు కూడా తోడవ్వడంతో ప్రజలు భయకంపితులయ్యారు. పిఠాపురంలో 22.6 మిల్లీమీటర్లు, కాజులూరు మండలంలో అత్యల్పంగా 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అక్కడక్కడ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.   

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లోని కర్నూలు రోడ్డు, ఊరచెరువు రోడ్డులో నిలిచిపోయిన వర్షపునీరు  

ఉప్పాడ తీరానికి తప్పని ముప్పు  
తీరానికి మాత్రం ముప్పు తప్పలేదు. ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లోని పలు ఇళ్లు సముద్ర కోతకు గురయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు సముద్రంలో కలసిపోయాయి. బీచ్‌ రోడ్డు ధ్వంసమైంది. సముద్రంపై వేటను నిషేధించడంతో మత్స్యకారులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రాకాసి అలలు కాకినాడ – ఉప్పాడ బీచ్‌ రోడ్డును ముంచెత్తాయి. ముందు జాగ్రత్తగా బీచ్‌ రోడ్డుపై రాకపోకలను పోలీసులు నియంత్రించారు. సాధారణ ప్రయాణికులతో పాటు స్థానికులను సైతం ఆ రోడ్డు పైకి వెళ్లకుండా కట్టడి చేశారు. 

కోతకు గురి కాకుండా రక్షణగా వేసిన బండరాళ్లు సముద్ర అలల తాకిడికి రోడ్డు పైకి వచ్చిపడుతూ ప్రమాదకరంగా మారాయి. ముందుస్తు చర్యల్లో బాగంగా ఉప్పాడ, కోనపాపపేట, మూలపేట, ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలైన మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనాబాద్, కొత్తపట్నం, గంగూలిపేట, పాత మార్కెట్‌ ప్రాంతాల్లోని సుమారు 8,200 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. కాకినాడ నగరంతో పాటు రూరల్, తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, తాళ్లరేవు తదితర మండలాల్లో మత్స్యకారులతో పాటు ఇతర నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.  

విశాఖపట్నంలో జలమయమైన వెలంపేటలోని రహదారి   

స్తంభించిన పోర్టు 
తుపాను ప్రభావంతో కాకినాడ డీప్‌ వాటర్, యాంకరేజ్‌ పోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. బియ్యం, పంచదార, పామాయిల్, యూరియా తదితర ఎరువులు ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. కాకినాడ పోర్టులో 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. గడచిన రెండు దశాబ్దాల్లో కాకినాడ పోర్టులో ఈ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలో దాని ప్రభావం ఉందని చెబుతున్నా వాస్తవానికి కాకినాడ తీరంలోని తొండంగి, యు.కొత్తపల్లి.. కాకినాడ రూరల్‌ కాకినాడ సిటీ తాళ్ళరేవు మండలాలపైనే ప్రభావం కనిపించింది. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవు ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లు కూడా సిద్ధం చేశారు కానీ ఇంత వరకు వాటి అవసరం రాలేదు   

పంటలకు నష్టం 
విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పెను గాలులకు అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కరప, కాకినాడ రూరల్, పెద్దాపురం, సామర్లకోట, యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, కాజులూరు తదితర మండలాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, వన్నెపూడి తదితర ప్రాంతాల్లో మిరప, అరటి వంటి వాణిజ్య పంటలు దెబ్బ తిన్నాయి. ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పీబీసీ), సుద్దగెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలేరు జలాశయానికి ఎగువ నుండి వరద నీరు పోటెత్తడంతో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలేరు, పంపా, తాండవ రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. 

పశ్చిమగోదావరి జిల్లాలో.. 
మోంథా తుపాను పెద్దగా ప్రభావం చూపకపోవడం పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఊరటనిచ్చింది. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో అక్కడక్కడ జల్లులు మాత్రమే పడగా గాలుల తీవ్రత లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల సమయానికి జిల్లాలో 154 మి.మీ వర్షం కురవగా, సగటు వర్షపాతం 7.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఆచంటలో 24 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 మండలాలకు గాను 15 మండలాల్లో 10 మి.మీ లోపు వర్షం మాత్రమే కురిసింది. 

జిల్లా వ్యాప్తంగా 3,581 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఆర్‌అండ్‌బీ పరిధిలో 29, ట్రాన్స్‌పోర్ట్‌ పరిధిలో 40, మొత్తంగా 69 జేసీబీలు, 79 పవర్‌ సాలను, 96 డీజిల్‌ జనరేటర్లను అందుబాటులో ఉంచారు. నరసాపురంలో 34 మంది సభ్యులతో ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ను, ఏపీఎస్‌పీ ప్లటూన్‌ ఒకటి భీమవరంలో మరొకటి నరసాపురంలో సిద్దంగా ఉంచారు. 60 మంది గ్రేహౌండ్‌ సిబ్బందిని ఉండిలో మోహరించారు. 150 వరకు వైర్‌లెస్‌ సెట్లను ఒక శాటిలైట్‌ ఫోన్‌ను, ఒక డ్రోన్‌ను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 37 పునరావాస కేంద్రాలకు 4,150 మందిని తరలించారు.  

ఏలూరు జిల్లాలో.. 
ఏలూరు జిల్లాలో ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు 310 మి.మీ. వర్షపాతం నమోదైంది. ద్వారకా తిరుమలలో 29.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో 10 మి.మీ. లోపు వర్షపాతం మాత్రమే నమోదైంది. తుపాను తీరం దాటాకా జిల్లాలోని ఏలూరు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు తదితర నియోజకవర్గాల్లో చెదురు మదురు జల్లులు మినహా భారీ వర్షాలు లేకపోవడం ఊరటనిచ్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లావ్యాప్తంగా 2,239 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. 

వరి పంట కోత దశకు చేరుకోగా, గాలుల తీవ్రత లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి 45 పునరావాస కేంద్రాలకు 1,203 మందిని తరలించారు. 2,000 విద్యుత్‌ స్తంభాలను సిద్ధం చేశారు. 59 జేసీబీలు, 37 పవర్‌సా, 10 బ్లేడ్‌ ట్రాక్టర్లు, 100 పోలీస్‌ వైర్‌లెస్‌ సెట్లను సిద్ధం చేశారు. 105 మంది స్విమ్మర్స్‌ను గుర్తించారు. 295 మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించారు.  

కేకే లైన్‌లో జారిపడిన కొండచరియలు 
అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస–కిరండూల్‌ రైల్వే లైన్‌లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్‌ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. ట్రాక్‌పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్‌ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తవలస–కిరండూల్‌ మార్గంలో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై కూలిన కొండచరియలు  

నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. 
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ సహా విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో పదో నంబర్‌ భారీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.  

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
ప్రజలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు తోడుగా నిలవాలి 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు    

సాక్షి, అమరావతి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమతంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.  తుపాను ముప్పు తగ్గే వరకు ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.  

నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి
తుపాను ప్రభావం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై తీవ్రంగా పడింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా అంతటా కుండపోత వర్షం కురిసింది. కావలిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవల కాలంలో ఈ స్థాయి వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం. దగదర్తి, ఉలవపాడు, కందుకూరు, జలదంకి, కొడవలూరు, కలిగిరి, లింగసముద్రం, అల్లూరు ప్రాంతాల్లో 15 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండ, సంతనూతలపాడు, చీమకుర్తి, ఒంగోలు పట్టణంలో అత్యధిక వర్షపాతం నమోదైంది.  తుపాను తీరం దాటే అవకాశం ఉందనుకున్న కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచిన వేసినా,  అనూహ్యంగా తుపాను తీరం దాటే సమయంలో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం  

బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షం  
బాపట్ల జిల్లా నగరం, చిన గంజాం మండలాల్లో భారీ వర్షం పడింది. తీర ప్రాంతంలో పలుచోట్ల చెట్లు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. బాపట్ల పట్టణంలో ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. తెనాలి రేపల్లె మార్గంలో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు పడిపోయాయి. కార్పొరేషన్‌ సిబ్బంది వాటిని తొలగించే పనుల్లో నిమగ్నం అయ్యారు. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. 

ఒంగోలు నగరంతో పాటు కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, పొన్నలూరు, చీమకుర్తి మండలాల్లో పది సెంటీమీటర్లు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. రాత్రి 10 గంటలకు అందిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒంగోలు నగరంలో 15.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. టంగుటూరులో 15.74, కొత్తపట్నంలో 14.36, నాగులుప్పలపాడులో 14.58, పొన్నలూరులో 14.68, చీమకుర్తిలో 13, పామూరులో 11.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది.  

తుపాన్లు.. ప్రభావాలు 
2014 అక్టోబర్‌లో అత్యంత భారీ తీవ్ర తుపాను ‘హుద్‌ హుద్‌’ విశాఖలో తీరం దాటింది. ఈ సూపర్‌ సైక్లోన్‌ తీరం దాటే సమయంలో 185 నుంచి 260 కి.మీ. వేగంతో రికార్డు స్థాయిలో గాలులు వీచాయి. 
⇒ 2018లో తిత్లీ అత్యంత తీవ్ర తుపానుగా బలడుతూ శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 140 నుంచి 150 కిలో మీటర్ల వరకు గాలులు బీభత్సం సృష్టించాయి. 
⇒ 2021లో జవాద్‌ తుపానుగా మారి తీరం దాటకుండానే సముద్రంలోనే బలహీన పడిపోయింది. ఈ కారణంగా గంటకు 45 కి.మీ.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.

⇒ 2022 మే నెలలో ఏర్పడిన అసని తీవ్ర తుపాను కూడా తీరం వైపు వచ్చినట్లే వచ్చి దిశ మార్చుకొని తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయి బలహీనపడింది. గాలుల తీవ్రత 75 నుంచి 85 కి.మీ.గా నమోదైంది.  
⇒ 2023లో ఏర్పడిన మిచాంగ్‌ తీవ్ర తుపాన్‌ బాపట్ల వద్ద తీరం దాటింది. మిచాంగ్‌ తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచి విధ్వంసం సృష్టించింది. 
⇒ తాజాగా మోంథా తీవ్ర తుపాను కూడా తీరం దాటే సమయంలో 90 నుంచి గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఈ గాలుల వేగం 75 నుంచి 80 కి.మీ.కు పరిమితమైపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement