తుపాను సమాచారం ప్రజలకు చేరవేస్తున్నది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందే
సచివాలయాల పరిధిలో మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు
ప్రభుత్వం నుంచి అందిన సమాచారం గ్రామంలో యాక్టివ్‌గా ఉండే యువతకు వాట్సాప్ రూపంలో చేరవేత
క్షేత్రస్థాయి తుపాను పరిస్థితులపై రెండు రకాల ఫార్మాట్‌లో ప్రభుత్వానికి నివేదికలు అందజేసిన సిబ్బంది
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థే మోంథా తుపాను సహాయక కార్యక్రమాల్లో ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు 24 గంటలూ పనిచేశాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే ప్రభుత్వం అందించే తుపాను తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అక్కడి ప్రజలకు చేరవేశారు. చాలాచోట్ల సచివాలయాల ఉద్యోగులు తమ పరిధిలో వీధి వీధికీ వెళ్లి తుపాను సమాచారాన్ని నేరుగా అక్కడి ప్రజలకు తెలియజేశారు.
తుపాను పరిస్థితులపై ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే సందేశాల్ని గ్రామంలో యాక్టివ్‌గా ఉండే యువతకు వాట్సాప్ ద్వారా చేరవేశారు. ఐదారేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో తీవ్ర విపత్తులు తలెత్తిన సమయంలో క్షేత్రస్థాయిలో చాలా గ్రామ పంచాయతీల్లో రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి కూడా ఉండని పరిస్థితి. అప్పట్లో ప్రభుత్వం చిన్నపాటి వరద సహాయక చర్యలు చేపట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులను తరలించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో 6 నుంచి 10 మంది చొప్పున పనిచేస్తున్నారు.
వారే మూడు షిప్టుల్లో రోజంతా సచివాలయంలోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి తుపాను పరిస్థితుల సమాచారాన్ని ప్రత్యేక యాప్‌ల ద్వారా ప్రభుత్వానికి చేరవేశారు. క్షేత్రస్థాయిలో తుపాను ప్రభావానికి గురైన గ్రామ వివరాలతో పాటు అక్కడ ఈదురు గాలులు, వర్షాల కారణంగా స్థానికంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు వంటి వివరాలపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి తక్షణ నివేదికలు అందజేశారు.
కరెంటు స్తంభాలు కూలినా, ఒరిగినా ఆ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వానికి చేరవేశారు. సముద్ర తీర గ్రామాల్లో గత ఐదేళ్ల కాలంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాల కార్యాలయాలపైనే తాత్కాలికంగా ప్రత్యేక మైక్‌లను ఏర్పాటు చేసి తుపాను తాజా సమాచారం ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేశారు.
సర్కారు స్పందన అంతంత మాత్రమే
క్షేత్రస్థాయిలో తుపాను ఇబ్బందులకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం వేగంగా సేకరించగలిగినప్పటికీ.. సహాయక చర్యల విషయంలో సర్కారు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆన్‌లైన్ విధానంలో సైక్లోన్ మోంథా ప్రొఫార్మా–2 రూపంలో ప్రభుత్వానికి సమాచారాన్ని తెలియజేసింది.

దాని ప్రకారం..మంగళవారం రాత్రి 8 గంటలకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 419 చెట్లు కూలగా..రెండుచోట్ల మాత్రమే వాటిని తొలగించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయని గ్రామాల సంఖ్య 160కి పైగా ఉన్నట్టు సచివాలయాల సిబ్బంది రాష్ట్ర కార్యాలయానికి సమాచారమిచ్చారు. 37 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్లు కూడా ఆ నివేదికల్లో వెల్లడించారు.


