సాక్షి,విజయనగరం: ఏపీలో మోంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మోంథా తీవ్రతతో భారీ వర్షాలు, వరదలు, కుండపోత వర్షం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో విద్యుత్ స్తంభాలు నేలమట్టమవుతున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. సెల్ టవర్స్ దెబ్బతింటున్నాయి.
ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని కస్తూర్బా హాస్టల్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభం పాఠశాల గోడపై పడింది. విద్యార్థులు గోడను పట్టుకోవడంతో విద్యుత్ ప్రసారం కావడంతో 30 మంది విద్యార్థులకు కరెంట్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను అత్యవసర చికిత్స కోసం నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.


