నీట మునిగిన ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్
ఏపీలోని నరసాపురం సమీపంలో అంతర్వేదిపాలెం వద్ద తీరం దాటిన పెను తుపాను
కోస్తా జిల్లాల్లో పెనుగాలులు, ఎడతెగని వర్షాలు.. పలుచోట్ల అంధకారం
తెలంగాణలోనూ మోంథా ప్రభావం..
3 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టి..
ప్రకాశం, బాపట్ల, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోనూ జోరు వర్షాలు
విశాఖలో కుండపోత.. యారాడలో విరిగిపడిన కొండచరియలు.. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెనుగాలులు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చెట్టు కూలి మహిళ మృతి.. పలు ప్రాంతాల్లో నేడూ అతి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం, నెట్‌వర్క్: ఏపీని వణికించిన పెను తుపాను మోంథా మంగళవారం రాత్రి కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో పెను గాలులు వీయగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కాకినాడ, అమలాపురం, రాజోలు ప్రాంతాల్లో గాలుల తీవ్రత భారీగా పెరిగింది. సముద్రం పోటెత్తి విరుచుకుపడుతోంది. అలల తీవ్రతకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ పలు చోట్ల తీరం కోతకు గురైంది. పెను గాలుల ధాటికి విశాఖలో ఎనిమిది ప్రాంతాల్లో గోడలు కూలిపోయాయి. తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత ఐదు జిల్లాలపై భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఉగ్రరూపంతో దూసుకొచ్చిన మోంథా ఆగుతూ.. దిశ మార్చుకుంటూ తీరం వైపు ప్రయాణించింది. మధ్యాహ్నం సమయంలో సముద్రంలో గాలుల తీవ్రత కాస్త తగ్గినా.. సాయంత్రం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ రావడంతో తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టిందని భావించారు. అంతలోనే మళ్లీ భారీ వర్షాలతో విరుచుకుపడింది. మోంథా ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
చెట్టు కూలి మహిళ మృతి..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో జనజీవనం స్తంభించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాలోనూ పలుచోట్ల జోరు వానలు పడడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. ఎడతెగని వర్షం, ఈదురు గాలులకు విశాఖ నగరంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ స్తంభించాయి. పలు అండర్‌పాస్‌ల గుండా నీళ్లు ప్రవహించడం, జాతీయ రహదారిపైకి నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 
ఈదురు గాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విశాఖలోని గాజువాక నుంచి యారాడ వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆనందపురం మండలంలోని గంభీరం రిజర్వాయర్ ఉధృతి పెరిగింది. అరకులోయ, విశాఖపట్నం ఘాట్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలకు శారద, వరాహ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెంలో చెట్టు కూలి వీరవేణి అనే మహిళ మృతి చెందింది.
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గొట్లపాళానికి చెందిన కృష్ణమనేని జయమ్మ (65) గేదెలను మేపేందుకు వెళ్లి పొట్టేళ్ల కాలువలో గల్లంతయింది. ఈత గాళ్లను రంగంలోకి దించి గాలిస్తున్నారు. రాత్రి వరకు ఆమె జాడ తెలియరాలేదు. గుండ్లకమ్మ నది పోటెత్తడంతో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్ట గంగవద్ద చప్టా కోతకు గురైంది. దీంతో పదుల సంఖ్యలో గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయాయి.
తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షం, పొగమంచుతో ఇబ్బందిపడ్డారు. ఆకస్మిక వరదలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జాతీయ రహదారులు, పలు ప్రధాన రహదారులపై మంగళవారం రాత్రి నుంచి రాకపోకలను నిలిపివేశారు. 
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లోని కర్నూలు రోడ్డు, ఊరచెరువు రోడు జలమయం
విరుచుకుపడి.. తీరం దాటి..
మోంథా తుపాను మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది. ఆ తర్వాత నాలుగైదు గంటలపాటు పెను గాలులు వీయగా భారీ వర్షాలు కురిశాయి. మచిలీపట్నం తీరానికి అత్యంత చేరువగా వచ్చిన తుపాను 17 కిలోమీటర్ల వేగంతో కాకినాడ వైపు కదులుతూ అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటింది. రాత్రి సమయానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 100, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
కదులుతున్న దిశ, వేగం ప్రకారం బుధవారం తెల్లవారు జామున తీరం దాటే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కొద్ది గంటల్లో క్రమేపీ తుపానుగా ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గంటకు 77 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 
నేడు పలు జిల్లాల్లో వర్షాలు..
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ సహా విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో పదో నంబర్ భారీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలతో పత్తి, వరికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బాపట్ల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేమూరు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో వరి నేలకొరిగింది. రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లోనూ వరి దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. బాపట్ల, చీరాల, రేపల్లెతోపాటు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కేకేలైన్‌లో జారిపడిన కొండచరియలు
అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్‌లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. ట్రాక్‌పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.


