ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఒక స్పష్టమైన తేడా ఉంది. చంద్రబాబు దాదాపు రోజు ఎక్కడో చోట ఉపన్యాసం ఇస్తుంటారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన అలవాటు అది. ఆయన ఏ ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేయగలరు. కాని జగన్ అందుకు పూర్తి భిన్నంగానే ఉంటారు.
రోజూ మీడియాలో కనిపించాలన్న తాపత్రయం వైఎస్ జగన్‌కు ఉండదు. పక్షానికో, నెలకో మీడియాతో మాట్లాడినా లేదంటే ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆ సందర్భంగా ఏమి చెప్పదలిచినా అత్యధిక శాతం ఆధారాలతో సహా తన వాదన వినిపిస్తారు. జగన్ చెప్పే విషయాలను ఖండించలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఏవేవో ఇతర పిచ్చి విమర్శలు చేస్తుంటారు. మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇది గత ఏడాదిన్నరగా సాగుతున్న వ్యవహారమే!.
కొద్ది రోజుల క్రితం జగన్ మీడియా సమావేశంపెట్టి కొన్ని అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. ఆ సందర్భంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన గూగుల్ డాటా సెంటర్.. దాని మూలం ఎక్కడ నుంచి వచ్చింది?.. తన హయాంలో వచ్చిన ఆదాని డేటా సెంటర్ కు దీనికి ఉన్న లింక్ ఏమిటి?.. విశాఖకు తన హయాంలో జరిగిన మంచి ఏమిటి?.. తదితర విషయాలపై సాక్ష్యాధారాలు చూపిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గూగుల్ డాటా సెంటర్ ను స్వాగతించిన తీరు ఆసక్తికరంగా ఉంది. దాని వల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందా? రాదా? అనేదానితో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ఆయన స్వాగతించడం విశేషం. అదే సమయంలో..
తాను తీసుకు వచ్చిన అదాని డాటా సెంటర్‌కు కొనసాగింపే ఈ గూగుల్ డాటా సెంటర్ అని సశాస్త్రీయంగా రుజువు చేశారాయన. అక్టోబర్ మొదటివారంలో గూగుల్ సంస్థ ఎపి ప్రభుత్వ ఐటి కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ అదానీ సంస్థలకు భూములు కేటాయించాలని కోరిన విషయాన్ని జగన్ బహిర్గతం చేశారు. అంతవరకు ఇదేదో గూగుల్ సంస్థ నేరుగా వచ్చి పెట్టుబడులు పెడుతున్నదని భ్రమించినవారికి నిజం ఏమిటో తెలిసినట్లైంది. అదానీ డాటా సెంటర్‌కు తన హయాంలో జీవో ఇచ్చి శంకుస్థాపన చేసిన వైనం, అలాగే సీ సబ్ కేబుల్ ను సింగపూర్ నుంచి తీసుకు రావడానికి ఆ దేశప్రభుత్వంతో తన హయాంలో జరిగిన సంప్రదింపుల లేఖలుమొదలైన వాటన్నింటిని ప్రజలకు చూపించారు. ఇప్పుడు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నది ఆ అదానీ గ్రూపేనని.. మొత్తం నిర్మాణం పూర్తి అయిన తర్వాత గూగుల్ దానిని లీజుకు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
..చంద్రబాబు మాత్రం అదానీ పట్ల కనీస కృతజ్ఞత చూపలేదని, అదానీ పేరు చెబితే తనకు(జగన్‌కు) ఎక్కడ పేరు వస్తుందోననే అలా చేశారని వివరించారు. నిజంగానే అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అదానీకి ప్రాదాన్యత ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్తపడడం అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ నేతలు ఈ గూగుల్ డేటా సెంటర్ ను చంద్రబాబు, లోకేష్ లు సాదించారన్న ప్రచారం చేస్తున్న తరుణంలో దానిని జగన్ పటాపంచలు చేసినట్లయింది.
రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమి చేశారన్నదానితో సంబంధం లేకుండా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. విశాఖ డేటా సెంటర్ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఎక్కడా చంద్రబాబు, లోకేష్‌ల పేర్లు ప్రస్తావించకపోవడం గమనించాల్సిన అంశం. ఇది ఆ ఇద్దరికీ నిరాశ కలిగించి ఉండొచ్చు. ఒక వేళ సుందర్ పిచాయ్ వీరికి నేరుగా లేఖ రాసి ఉంటే గనుక.. ఎల్లో మీడియా భూమ్యాకాశాలు దద్దరిల్లేలా హోరెత్తించి ఉండేవేమో!. ఇదే సందర్భంలో..
జగన్ చాలా స్పష్టంగా డాటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని, ఎకో సిస్టమ్ అభివృద్ది అవుతుందని, అందుకే ఆ సమయంలో తాము అదానీని డాటా సెంటర్‌తో పాటు ఐటీ బిజినెస్ పార్క్, రీక్రియేషన్ సెంటర్ తదితర సంస్థలు ఏర్పాటు చేసి 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న షరతు పెట్టామని చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలను కూడా ఆయన చూపించారు. తన హయాంలో 300 మెగావాట్ల డాటా సెంటర్‌కు ప్లాన్ చేస్తే.. దాని కొనసాగింపుగా ఇప్పుడు వెయ్యి మెగావాట్ల సెంటర్ ను ప్లాన్ చేశారని వివరించారు. అలా డాటా సెంటర్ క్రెడిట్‌ను చంద్రబాబు చోరి చేశారని జగన్ ఎత్తిపొడిచారు. అయితే.. ఇప్పటిదాకా దీనికి నేరుగా ప్రభుత్వ పక్షాన ఎవరూ సమాధానం ఇవ్వలేకపోయారు!. జగన్ ఏదో ఈ డాటా సెంటర్‌కు అడ్డుపడుతున్నారన్న ప్రచారం చేయాలని తలపెట్టిన టీడీపీకి.. ఆ పార్టీ అనుకూల మీడియాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ కూడా.
దీనికి తోడు హైదరాబాద్ కు సంబందించి చంద్రబాబు నిత్యం చేసుకునే ప్రచారాన్ని కూడా ఆయన పూర్వపక్షం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం నుంచి హైదరాబాద్ తో చంద్రబాబుకు సంబందం ఎక్కడ ఉందని, ఈ కాలంలో జరిగిన అభివృద్దికి వైఎస్ఆర్, కేసీఆర్ కారణమని స్పష్టం చేశారు. అలాగే తొలుత నేదురుమల్లి జనార్దనరెడ్డి హయాంలో రాజీవవ్ గాంధీ సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేసిన ఫోటోను, తదుపరి ప్రైవేటు సంస్థ ద్వారా ఒక భవనం కట్టించి దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టి,మొత్తం నగరాన్ని తానే కట్టించానని బిల్డప్ ఇస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిలో ఏ ఒక్కదానిని ఖండించలేని నిస్సహాయ స్థితి చంద్రబాబు బృందానిదే అని చెప్పాలి.
దానికి కారణం జగన్ ఏమి చెప్పినా సాక్ష్యాధారాలతో సహా మాట్లాడడమే. మరో వైపు మంత్రి లోకేష్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.86 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. జగన్ మాదిరి ఎక్కడా ఆధారాలు ప్రదర్శించలేదు. అందుకే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక వ్యాఖ్య చేశారు. గూగుల్ కంపెనీతో ఆ మేరకు ప్రకటన ఇప్పిస్తే తాము లోకేష్ కు సన్మానం చేస్తామని ప్రకటించారు.
లోకేష్ సలహాదారులు ఎవరో కాని, బాగా అబద్దాలు చెప్పించారనిపిస్తుంది. దాని వల్ల ఆయన ప్రతిష్టకు నష్టం అని కూడా వారు భావించినట్లు లేదు. తీరా చూస్తే అసలు గూగుల్‌కు ప్రపంచం అంతా కలిపి 1.83 వేల మంది ఉద్యోగులు ఉంటే.. ఒక్క విశాఖ పట్నంలోనే అంతమంది ఎలా వస్తారన్న సింపుల్ కొశ్చెన్ కు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు. జగన్ టైంలో అదానీకి ప్రధానంగా భూమి మాత్రమే సమకూర్చితే.. ఇతర రాయితీలు భారీ ఎత్తున ఇవ్వలేదు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 22వేల కోట్ల మేర రాయితీలు, అది కూడా కేవలం 200 ఉద్యోగాల కల్పించబోతున్న సంస్థకు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సందర్భంలో ఎల్లోమీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేసే యత్నం చేసింది. విశాఖపై సాక్షి పత్రిక విషం చిమ్మిందని నీచమైన అసత్యాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళే యత్నం చేసింది.
నిజానికి గతంలో జగన్ విశాఖకు ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఆ నగరంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎన్ని దారుణమైన కధనాలు రాసింది పాత పత్రికలు, అప్పటి వీడియోలు చూస్తే తెలుస్తుంది. అసలు అదానీకి మొత్తం కొండ అంతా రాసిచ్చేశారని డాటా సెంటర్ ఏర్పాటు నేపధ్యంలో విషం చిమ్మింది ఎల్లో మీడియా. అంతేకాదు.. ఆ రోజుల్లో విశాఖ వద్ద సముద్ర మట్టం పెరుగుతోందని, చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా ఆ సందర్భంలో అబద్దాలను సృష్టించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. సముద్రం తీరాన భోగాపురం, మూల పేట వరకు రోడ్డు వేయాలని సంకల్పిస్తే.. ఇళ్లకు నష్టం జరుగుతుందని ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు.ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారు. గూగుల్ డాటా సెంటర్ అనండి.. మరొకటనండి.. ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించరు. అలాగని, దానివల్ల వచ్చే సమస్యల గురించి ప్రశ్నించడం తప్పని కూటమి ప్రభుత్వం అంటున్నా.. ఎల్లో మీడియా ఏడుపు లంఖించుకున్నా.. అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కచ్చితంగా ఎలాంటి సందేహాలు ఉన్నా, నివృత్తి చేసి ముందుకు వెళితే మంచిదని చెప్పాలి.
నకిలీ మద్యం మాఫియా, ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిన వైనం, పంటలకు గిట్టుబాటు దరలు లేక రైతులు పడుతున్న పాట్ల గురించి కూడా ఇలాగే ఆదారాలతో జగన్ ప్రసంగించారు. జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే పరిస్తితి లేనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏదో విధంగా ఎదురుదాడి చేసి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకుంది. అదానీ డాటా సెంటర్ కు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలకు.. చంద్రబాబు లేదంటే లోకేష్‌లు నేరుగా పాయింట్ వైజ్ జవాబు ఇచ్చి ఉంటే అర్దవంతంగా ఉండేది. ఆ పని చేయలేకపోతున్నారు కాబట్టే పాలన సామర్ధ్యంలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధవంతం అనిపిస్తాయి.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


