ఇంద్రకీలాద్రిపై ప్రమాణం చేస్తున్న జోగి రమేష్
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ సవాల్
పది రోజుల క్రితమే సత్యప్రమాణానికి రావాలని
చంద్రబాబు, లోకేశ్‌ను కోరాను
భగవద్గీతపై ప్రమాణం చేయాలని అడిగినా వారు స్పందించలేదు
నేను నార్కో ఎనాలిసిస్, లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నా
నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదని దుర్గమ్మ
సాక్షిగా సత్యప్రమాణం చేస్తున్నా
ఏ తప్పూ చేయకపోయినా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని ఆవేదన
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని.. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ సిద్ధమా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ సవాల్ విసిరారు. పది రోజుల కిందటే సత్య ప్రమాణానికి రావాలని చంద్రబాబు, లోకేశ్‌ను కోరినా రాలేదని ఎద్దేవా చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేయాలని కోరినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా వారు సత్యప్రమాణానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నార్కోఎనాలసిస్, లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.
‘బెజవాడ దుర్గమ్మ, కృష్ణమ్మ సాక్షిగా చెబుతున్నా. నిబద్ధత, నిజాయితీ, నిండు మనస్సుతో చెబుతున్నా. నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రికి జోగి రమేష్ సోమవారం కుటుంబ సమేతంగా వచ్చారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ జోగి రమేష్ తన చేతిలో కర్పూరం వెలిగించుకుని నకిలీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని సత్యప్రమాణం చేశారు. ‘నకిలీ మద్యం కేసులో ఆరోపణలు నా హృదయాన్ని గాయపరిచాయి. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నా. నాపై సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కక్షగట్టారు. ఎక్కడో జరిగిన అంశాన్ని నాకు అంటగడుతున్నారు’ అని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరికి సంబంధం ఉందో ఆ మంత్రికే తెలుసు
‘ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టినవాడు చెప్పింది విని నకిలీ మద్యం కేసులో నన్ను దోషి అంటున్నారు. కానీ రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. నకిలీ మద్యం వ్యవహారంతో ఎవరికి సంబంధం ఉందో జనార్దనరావుకు ఎయిర్‌పోర్టులో రెడ్ కార్పెట్ వేసిన మంత్రికి తెలుసు. నేను తప్పు చేశానని సిట్ అధికారులు నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టండి. కానీ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దు. ఎంత బెదిరించినా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో చంద్రబాబుపై పోరాటాన్ని ఆపేది లేదు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు


