ఆ ధైర్యం బాబు, పవన్‌తో సహా ఎవరికీ లేదా? | KSR Comment, Nara Lokesh Guruvinda Ginja Neethi, Andhra Pradesh Education Department Faces Several Issues | Sakshi
Sakshi News home page

ఆ ధైర్యం బాబు, పవన్‌తో సహా ఎవరికీ లేదా?

Jun 3 2025 11:14 AM | Updated on Jun 3 2025 12:08 PM

KSR Comment: Nara Lokesh Guruvinda Ginja Neethi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్‌ విద్యాశాఖ మంత్రి కావడంతో ఆ రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. విప్లవాత్మక మార్పులతో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ శెభాష్‌ అనిపించుకున్నట్లే.. లోకేశ్‌ కూడా విద్యాశాఖను ముందు తీసుకెళతారని అనుకున్నారు. కానీ ఏడాది తిరక్కుండానే ప్రశంసల మాటెలా ఉన్నా.. తీవ్ర నిరాశకైతే గురి చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్రవ్యాప్తంగా వెల్లడవుతున్న అభిప్రాయం ఇది. 

ఉపాధ్యాయులు పరీక్ష పత్రాలు దిద్దిన తీరు, ఫెయిల్‌ అయిన వారిలో అరవై శాతం మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తున్న చేసుకోవడం, ఏకంగా 11 వేల పత్రాల వాల్యుయేషన్‌లో తప్పులు దొర్లినట్లు స్పష్టం కావడం చూస్తూంటే.. మంత్రిగా లోకేశ్‌ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యావేత్తలే వ్యాఖ్యానిస్తున్నారు. హడావుడిగా పరీక్ష పత్రాలు దిద్దాల్సి రావడం వల్ల ఉపాధ్యాయులు ఒత్తిడికి గురయ్యారని.. నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ తోడవడంతోనే ఇంత స్థాయిలో తప్పులు దొర్లాయని వీరు విశ్లేషిస్తున్నారు. విద్యా వ్యవస్థలో తానేదో రికార్డు సృష్టించానని చెప్పుకునేందుకు లోకేశ్‌ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించడంతో ఈ గందరగోళం ఏర్పడిందని అంటున్నారు. 

విద్యాశాఖ మంత్రి తన కుమారుడు కాకపోయి ఉంటే ఈపాటికి చంద్రబాబు నాయుడు ఆ మంత్రికి ఎంత స్థాయిలో క్లాస్‌ పీకి ఉండేవారు చెప్పలేం. కొడుకు కావడంతో ఏమీ అనలేని పరిస్థితి. పైగా లోకేశ్‌ ఇప్పుడు సర్వశాఖల మంత్రిగా పెత్తనం కూడా చెలాయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ‘రెడ్‌బుక్‌’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలను, టీడీపీ విధానాలను వ్యతిరేకించేవారిని వేధించి, జైళ్లలో పెట్టేందుకు లోకేశ్‌ చూపుతున్న శ్రద్ధలో ఏ కొంచెం తన మంత్రిత్వ శాఖపై చూపి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడిది కాదేమో!. లోకేశ్‌ బహుశా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖను ఎంచుకుని ఉండవచ్చు కానీ.. వచ్చిన అవకాశాన్ని ఆయన ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారన్నది వాస్తవం. పైగా గత ప్రభుత్వంలో జగన్‌ ఈ రంగంలో చేసిన మంచిని కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తూండటం వల్ల విద్యా రంగం సమస్యలు ఎదుర్కొంటోంది. 

👉విపక్షంలో ఉండగా టీడీపీ ఉపాధ్యాయులను రకరకాలుగా రెచ్చగొట్టింది. ప్రభుత్వ టీచర్లు కూడా జగన్‌ ప్రభుత్వాన్ని అపార్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే తమకు మేలని భావించారు. కానీ.. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంగ్లీషు మీడియంను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ మాధ్యమం ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించాలనుకున్న జగన్‌ సంకల్పానికి గండికొట్టేశారు. కింది తరగతుల నుంచే ప్రవేశపెట్టిన ఐబీ కరిక్యులమ్, టోఫెల్ తదితరాలను తీసేశారు. 

👉విశేషం ఏమిటంటే ఇదే చంద్రబాబు, పవన్ , లోకేశ్‌లు తమ పర్యటనలలో కొన్నిసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి జగన్ టైమ్ లో జరిగిన మార్పులు చూసి ఆశ్చర్యపోవడం!. ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్దుల తల్లులకు రూ.15 వేలు చొప్పున ఇచ్చి అందులో రూ.వెయ్యి టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తే టీడీపీ, జనసేనలు తప్పు పట్టాయి. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న పిల్లలు ఒకొక్కరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని బీరాలు పలికాయి కూడా. అధికారమైతే వచ్చింది కాని ‘అమ్మ ఒడి’ పథకం అసలుకే మోసం వచ్చింది. 

ఇవన్ని ఒక ఎత్తు.. టెన్త్ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడేలా వాల్యుయేషన్ జరగడం మాత్రం ఇంకో ఎత్తు. లోకేశ్‌ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు జరిగిందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అది కరెక్టా? కాదా? అనేదానిపై లోకేశ్‌ వివరణ ఇవ్వాలి. నిజమైతే.. తప్పు చేసిన టీచర్లు ఎంత బాధ్యులో, మంత్రిగా లోకేశ్‌ కూడా అంతే బాద్యుడు అవుతారు!. 

👉గతంలో ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొన్నిచోట్ల పశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దాని కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. లోకేశ్‌ను రాజీనామా చేయాలని అడిగే ధైర్యం చంద్రబాబు, పవన్‌తోసహా కూటమి నేతలలో ఎవరికి ఉండకపోవచ్చు. అంతమాత్రాన తన తప్పు ఏమిటో తెలుసుకుని సరిదిద్దుకోవడం పోయి గత ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తే తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్దులకు ఉపశమనం కలుగుతుందా?. 

👉ఎంతసేపు రెడ్ బుక్ గోలే కాదు.. తన శాఖలో జరుగుతున్న పరిణామాలను నారా లోకేష్‌ అర్థం చేసుకోవాలి. కొద్దికాలం క్రితం తమకు విద్యా శాఖకు సంబందించి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు. తప్పు లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వ్యక్తి కాదు కాబట్టి. పేద విద్యార్దుల బాధలు తెలిసిన వారు కాదు కాబట్టి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన లోకేష్‌ ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుకున్నారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అయినా లోతుగా అధ్యయనం చేసి ఉండాల్సింది. 

👉టెన్త్ లో 66 వేల మంది మార్కుల వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రతి ఏటా ఎంతో కొంతమంది ఇలా దరఖాస్తులు  పెట్టుకుంటారు. కొన్ని తప్పులు జరిగితే సరి చేస్తారు. కాని ఈసారి విద్యార్ధులు విభ్రాంతి చెందేలా పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు.. వైఎస్ఆర్ కడప జిల్లా  ఎర్రగుంట్ల మండలంలోని  జెడ్పీ హైస్కూల్‌కు చెందిన గంగిరెడ్డి మోక్షిత పదో తరగతిలో ఫెయిల్ అయినట్లు ఫలితాలలో తెలిపారు. ఆమె తల్లిదండ్రులు వెరిఫికేషన్ పెడితే ఆమెకు సోషల్‌లో 84 మార్కులు వచ్చినట్లు  తేలింది. అంతకుముందు సోషల్‌ సబ్జెక్టులో 21 మార్కులే వచ్చాయని ప్రకటించారు. ఇంత దారుణంగా వ్యత్యాసం ఉంటే  విద్యార్ధుల భవిష్యత్తు ఏమి కావాలి. మరో  విద్యార్ధికి వెరిఫికేషన్‌లో హిందీలో నాలుగు ప్రశ్నలకు రాసిన జవాబులకు సున్నా మార్కులు వేసేశారట. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మరో విద్యార్ధికి ఇంగ్లీష్‌లో తొలుత 34 మార్కులు వచ్చాయని షీట్ లో తెలిపారు. తీరా వెరిఫికేషన్ కు వెళితే  93 మార్కులు వచ్చాయని వెల్లడైంది. 

👉గతంలో ఏదో ఒకటి, రెండు మార్కులు, లేదంటే ఓ పది మార్కుల వరకు తేడా వస్తే వచ్చేవేమో! కాని ఈసారి ఇలా ఇంత తేడాతో ఉంటే ఆ విద్యార్ధుల భవిష్యత్తు ఏమవ్వాలి? ఎవరైనా తొందరపడి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులవుతారు?. విశేషం ఏమిటంటే గతంలో జగన్ టైమ్ లో ఏ చిన్న  తప్పు జరిగినా జగన్ రాజ్యంలో.. జగన్ ఇలాకాలో ఘోరాలు అంటూ రాసినా.. ఇప్పటికీ అదే పద్దతిలో దౌర్బాగ్యకర రీతిలో వార్తలు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు దినపత్రిక  ఇప్పుడు ఈ వాల్యుయేషన్ అవతకతవకల విషయంలో మాత్రం ఎక్కడా అసలు మంత్రి లోకేశ్‌ ప్రస్తావన కాని,  ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యంలో ఇలా జరుగుతోందని కాని రాయకుండా జాగ్రత్తపడింది. అంతవరకు అయితే  ఒక రకం.  

.. ప్రభుత్వ తప్పులను కూడా వెనకేసుకు వచ్చేలా వార్తలు ఇచ్చే నీచానికి ఈ ఎల్లో మీడియా పాల్పడుతుండడం దురదృష్టకరం. 2022లో జవాబు పత్రాలలో వత్యాసం 20 శాతం ఉండగా, ఇప్పుడు 16.8 శాతం మాత్రమేనని నిస్పిగ్గుగా సమర్దించుకునే యత్నం చేశారు. ఇలాంటి వార్తల విషయంలో వాస్తవాలకు అనుగుణంగా  కథనాలు ఇస్తే  విద్యార్దులకు ఉపయోగం. కాని, ఇలాంటి వాటిలోకూడా దిక్కుమాలిన రాజకీయం చేయడం వల్ల ఏమి ఉపయోగం?. 

చంద్రబాబు పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయందని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి జగనే విద్యా వ్యవస్థను భ్రష్టు  పట్టించారని, దానిని గాడిన పెడుతున్నామని లోకేశ్‌ ఎదురు దాడి చేశారు. ఏ రకంగా జగన్ పాడు చేసింది..తాను ఏ విధంగా బాగు చేసింది చెప్పుకోకుండా,  ఏవో శాతాల అంకెలు చెబితే అందులోని డొల్లతనం బయటపడుతూనే ఉంది. ఎంత సేపు రెడ్ బుక్‌తో గుండెపోటు తెప్పించానని, వారిని జైల్లో వేశా, వీరిని జైల్లో వేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. తన శాఖలో ఏమి జరుగుతోంది?. ఏ రకంగా పిల్లలకు మేలు చేయవచ్చు?. అంశాలపై లోకేశ్‌ దృష్టి పెడితే మంచిది. వెరిఫికేషన్, రీవ్యాల్యుయేషన్‌కు వెళ్లిన వారంతా వైఎస్సార్‌సీపీ వారనో, మరొకటనో చెప్పి, వారిని కూడా రెడ్ బుక్ పేరుతో భయపెట్టకుండా ఉంటే అదే పదివేలు!.

 

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
 
Advertisement
Advertisement