సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరేశ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో నేరాలు పెరుతున్నాయని అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఆమె మీడియాతో మాట్లాడారు.
కర్నూలు బస్సు ప్రమాదం వెనుక కూడా మద్యమే కారణం. వైఎస్ జగన్ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించారు.కానీ చంద్రబాబు అలా కాదు యాభై ఇళ్లకు ఒక మద్యం బెల్టు షాపును పెట్టారు. ఎవరిది సంక్షేమ పాలనో, ఎవరిది సంక్షోభ పాలనలో జనానికి తెలిసింది
చంద్రబాబు పాలనలో పరిశ్రమలు వస్తాయనీ, ఉద్యోగాలు వస్తాయని భావించారు. తీరా చూస్తే మద్యం తయారీ పరిశ్రమలు వచ్చాయి. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన సంస్కరణలను క్లోజ్ చేసి, ఊరూరా మద్యం షాపులు పెట్టారు. ఏ ఊర్లోకి వెళ్లినా బెల్టుషాపుల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది.
మద్యం దందా ఏపీలో వ్యవస్తీకృతం అయింది. నేరగాళ్లకు ప్రభుత్వమే మంచి అవకాశం కల్పిస్తోంది. కర్నూలు బస్సు దగ్ధం వెనుక విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలే కారణం. బస్సు ప్రమాదం వెనుక కారణాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మద్యం వలనే ప్రమాదం జరిగిందన్నది వాస్తవం కాదా?. హైవే పక్కన మద్యం దుకాణాలు ఉన్న సంగతి తెలీదా?.లక్ష్మీపురంలోని మద్యం బెల్టు షాపు సీసీ పుటేజీని ఎందుకు బయట పెట్టటం లేదు?.
ఆ ఊర్లో ఏకంగా మూడు బెల్టు షాపులు ఉన్నమాట వాస్తవం కాదా?.క్యూ ఆర్ కోడ్ ఉందని చెప్పిన ప్రభుత్వం బైకర్ కొనుగోలు చేసిన మద్యానికి స్కాన్ చేశారా?. ఏపీలో లక్షన్నర మద్యం బెల్టుషాపులు ఉన్నాయి.ఈ బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
తప్పు చేసినా తప్పించుకోవటం చంద్రబాబుకు అలవాటే. రాష్ట్రంలో మహిళలు-చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా మద్యమే కారణం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ మద్యం విచ్చలవిడి తనంపై ఎందుకు మాట్లాడరు? అరోగ్యశ్రీ నిలిపివేత, మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ, కల్తీ ఆహారంతో ఆస్పత్రి పాలవుతున్న విద్యార్థుల గురించి ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు?. మద్యం వద్దు, మెడికల్ కాలేజీలే ముద్దు అని జనం అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు.


