హైకోర్టును ఆశ్రయించిన 90 ఏళ్ల వృద్ధురాలు, కుటుంబ సభ్యులు
విచారణకు స్వీకరించిన హైకోర్టు
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె చెరుకూరి వెంకాయమ్మ, మానసిక వైకల్యం గల మనవరాలు చెరుకూరి శ్యామల కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తమ జీవితానికి చివరి ఆసరాగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం లాక్కుందని.. తాము ఎన్ని ఫిర్యాదులు, వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని హైకోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఆ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం తీసుకుంది. తమ ఏకైక ఆధారాన్ని లాగేసుకోవడం వల్ల తమ జీవనాధారం పోయిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తమ ఫిర్యాదులు, వినతులు పట్టించుకోవడం లేదని.. తద్వారా రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ముఖ్యంగా జీవన హక్కు (ఆర్టికల్ 21), సమానత్వ హక్కు (ఆరి్టకల్ 14), ఆస్తి హక్కు (ఆర్టికల్ 300ఏ) ఉల్లంఘించబడిందని వాపోయారు.
తమ దుస్థితి దృష్ట్యా పిటిషనర్లు ముగ్గురూ హైకోర్టును రెండు ప్రధాన అంశాలపై వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒక కేర్ టేకర్‌ను నియమించి తమ ఆహారం, వైద్యచికిత్స, విద్యుత్ బిల్లులు, జీవనాధార ఖర్చులు భరించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ సహాయం అందించలేని స్థితిలో ఉంటే.. కారుణ్య మరణానికి తమకు న్యాయపరమైన అనుమతి ఇవ్వాలని కోరారు.
‘మానవ గౌరవం లేకుండా జీవించడం కన్నా.. గౌరవంగా మరణించడం మేలు. మమ్మల్ని ఈ స్థితికి ప్రభుత్వం నెట్టేసింది’ అని వృద్ధురాలు శేషగిరమ్మ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లోని మానవ హక్కుల ఉల్లంఘణ కోణాన్ని బయటపెడుతోంది. వికాసం పేరుతో పేదలు, వృద్ధులు, దివ్యాంగులు తమ భూములు, గౌరవం, జీవన హక్కులు కోల్పోతున్న వైనాన్ని పిటిషన్ చాటి చెబుతోంది.


