అమాయకులు, అబలలే అతడి టార్గెట్
వారి అవసరాలకు డబ్బులిస్తూ.. వడ్డీలపై వడ్డీలు వేసి వేధింపులు
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆయనే షాడో ఎమ్మెల్యే
వైన్‌షాపుల నుంచి వసూళ్ల ‘దుకాణం’ తెరవడంతో రచ్చరచ్చ
రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ‘కప్పం’ పేరుతో పంజా
అడ్డూ అదుపు లేకుండా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆయన గుంటూరు టీడీపీలో ఓ మండలానికి పార్టీ అధ్యక్షుడు. రాష్ట్ర కమిటీలోనూ ఓ పెద్ద పదవి ఉంది. అన్నిటికీ మించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పేరు గడించాడు. ఆ ‘షాడో’ ఎమ్మెల్యే చేసే ఆగడాలు, పేదలపై చేసే దౌర్జన్యాలు, కప్పం పేరుతో వ్యాపారులపై విసిరే పంజా, చేసే సెటిల్‌మెంట్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికార పార్టీ పెద్దల ఆపన్న హస్తం ఉండటం, అతని దందాలు, బలవంతపు వసూళ్లలో కూటమి నాయకులతోపాటు ప్రభుత్వ పెద్దలకు వాటాలు అందుతుండటంతో ఇదేమని అడిగే వారు కరవయ్యారు. ఫలితంగా ఆయన దందా మూడు దౌర్జాన్యాలు.. ఆరు బెదిరింపులుగా సాగిపోతోంది. తాజాగా ఓ మహిళను కాల్‌మనీ పేరుతో వేధించగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడటంతో ఆ కాల్‌నాగు పేరు గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అనుమతి ఉన్నా.. ‘రియల్’ కప్పం కట్టాల్సిందే!
రాజధాని అమరావతికి చేరువలో ఉండటంతో కూటమి ప్రభుత్వం వచ్చాక గుంటూరుకు ఆనుకుని ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గ్రామాల్లో రియల్ వ్యాపారులు వెంచర్లు వేశారు. రూ.లక్షలు ఖర్చుచేసి నానా ఇబ్బందులు పడి వ్యాపారులు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతులు తెచ్చుకున్నా.. వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. షాడో ఎమ్మెల్యేగా చలామణి అయ్యే ఆ నేత ‘భగీరథ’ సినిమా తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫోన్లు చేసి ఎకరాకు రూ.2.50 లక్షల చొప్పున ఎన్ని ఎకరాల్లో వెంచర్ వేస్తే అంత మొత్తం పంపాలని హుకుం జారీ చేస్తాడు. పంపకుంటే వేధింపులు తప్పవు. ఇదే విషయం గతంలోనూ పెద్దఎత్తున నియోజకవర్గంలో చర్చకు దారితీసింది.
వైన్ షాపుంటే రూ.5 లక్షలు కట్టాల్సిందే
ఈ నేత మద్యం వ్యాపారంలోనూ ఆరితేరిపోయాడు. ఆయనకు గుంటూరు పరిసరాల్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నట్టు తెలిసింది. గుంటూరు రూరల్ మండలంలో లిక్కర్ సిండికేట్‌లో కీలక భాగస్వామి కూడా. కొద్దినెలల క్రితం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మద్యం షాపుల లైసెన్స్‌దారులు ఒక్కొక్కరూ ప్రతి షాపు నుంచి రూ.5 లక్షలు ఇచ్చేలా మాట్లాడాలని ఆబ్కారీ అధికారులకు ఆర్డర్ వేశాడు. అంతే అధికారులు ఆచరణ మొదలుపెట్టడం, లైసెన్సుదారులకు కాల్‌చేసి దుకాణానికి రూ.5 లక్షలు చొప్పున ఆయనకు కప్పం కట్టాలని చెప్పడంతో కొందరు అడ్డం తిరిగారు. ఒక్కసారి సదరు నేతతో మాట్లాడాలని ఏకంగా అధికారులే లైసెన్సుదారులకు చెప్పడం, ఆ తరువాత ఆ వివాదం అటు పారీ్టలో, ఇటు మద్యం లైసెన్సుదారుల అసోసియేషన్‌తో పాటు జిల్లాలో దుమారం రేగడంతో మధ్యే మార్గంగా బేరం కుదుర్చుకున్నారు. బెల్టు దుకాణాల వ్యాపారంలోనూ ఆయనదే హవా. ఆయన చెప్పిన వారికే బెల్టు దుకాణం ఇవ్వడం, వారినుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లు చేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సమస్య చెప్పుకుందామని వెళితే సెటిల్‌మెంటే..
ప్రజలు సమస్యల పరిష్కారం కోసం పొరపాటున ఆయన దగ్గరకు వెళ్లారా.. ఇక అంతేసంగతులు. ఆయన సెటిల్‌మెంట్ దెబ్బకు వెళ్లిన వారికి దిమ్మతిరిగిపోవాల్సిందే. ఇటీవల ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన ఆస్తి వివాదం విషయంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడే ఉన్న ఈ నాయకుడు జోక్యం చేసుకుని ‘మీ సమస్య పరిష్కరిస్తాం. మాకేంటీ..’ అంటూ రాయ‘బేరాలు’ మాట్లాడుకున్నారు. అడిగినంత ఇవ్వలేదంటే అధికారులను ఉసిగొల్పి వారి పని ఎక్కడా కాకుండా మోకాలడ్డి బలవంతంగా సెటిల్‌మెంట్లు చేయడంలో ఆయన దిట్ట.
కాల్‌మనీలోనూ..
ఈ నేత కాల్‌మనీ పేరుతో నిత్యం పేదలపై బుసలు కొడుతూనే ఉన్నాడు. పేదల అవసరాన్ని ఆసరాగా తీసుకుని వారికి అప్పులు ఇచ్చి, రుణం తీసుకున్న పాపానికి వారిపై వేధింపులకు పాల్పడుతుంటాడు. అసలుకు వడ్డీ, చక్రవడ్డీ కలిపి నాలుగింతల వసూలు చేస్తుంటాడు. ఇవ్వని వారిపై అధికార ప్రతాపాన్ని చూపటం, బెదిరింపులకు పాల్పడటం, అవసరమైతే నేరుగా దాడులకు తన ముఠాను ప్రోత్సహించడం, మహిళలని కూడా చూడకుండా బూతులు తిట్టడం చేస్తుంటారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
భూకబ్జాలోనూ దిట్ట
ఈ నాయకుడు భూకబ్జాలకు కూడా పాల్పడుతుంటాడన్న విమర్శలు ఉన్నాయి. గతంలో గుంటూరు మండలం పెదపలకలూరులో 8 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు యతి్నంచాడు. ఆ భూమిని ఓ దేవదాయ డైరెక్టర్ పేరిట రిజిస్టర్ చేయించి భూమిని స్వా«దీనం చేసుకునేందుకు ప్రయతి్నంచాడు. తీరా ఆ భూమి జనసేన నాయకులకు చెందినది కావడంతో వారంతా ఎదురుతిరిగారు. స్థలంలోకి రావడానికి వీల్లేదని అవరమైతే కోర్టులో తేల్చుకోవాలని తెగేసి చెప్పారు. దీంతో వారి కబ్జా కుట్రలు పనిచేయలేదు.


