సాక్షి, తిరుపతి: బీఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోషాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన తప్పే కదా? అని భూమన ప్రశ్నించారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయం బోర్డు దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడే స్వయంగా చెప్పారు. గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణపై, గోవుల మరణాలు జరుగుతున్నాయని చెప్పాను. దానికి నా మీద కేసులు పెట్టారు.
అందుకు బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డిని నాపై ఉసిగొల్పారు. గోశాలపై వ్యాఖ్యలు చేసిన మీకు కూడా ఈ కేసులే వర్తిస్తాయి. నా మీద పెట్టిన కేసులో మీ మీద కూడా పెట్టాలి. దాదాపు 70ఏళ్ల టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాలను బీఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత నిర్వీర్యం చేస్తున్నారు. గోశాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనే తప్పే కదా?. మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరు, గోశాలను సరిగ్గా నిర్వహించలేరు.
తిరుమలలో ఏం జరుగుతుందో యావత్ ప్రపంచానికి నా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. దానికి మీరు పెట్టిన కేసులన్నీ కూడా నన్ను భయపెట్టడానికి పెట్టినవే తప్ప మరొకటి కాదు. ఇలాంటి తప్పులు ఎన్ని మీరు చేసినా ఆ తప్పుల్ని ఎత్తి చూపటమే ఒక పూర్వ అధ్యక్షునిగా నా బాధ్యత. తిరుమలలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను అని వ్యాఖ్యలు చేశారు.


