‘‘ఆంధ్రప్రదేశ్‌లో పేకాట క్లబ్బులు, జూద కేంద్రాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి’’ ఈ మాటన్నది సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్! వాస్తవాన్ని ధైర్యంగా అంగీకరించినందుకు ఆయన్ను అభినందించాల్సిందే. భీమవరం డీఎస్పీ జయసూర్యపై తీవ్ర ఆరోపణలు చేసి ఆయనపై విచారణ జరపాలని ఎస్పీని, తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించడమూ బాగానే ఉంది. కానీ... పవన్ ఇలా ఆదేశించారో లేదో.. ఉప సభాపతి రఘురామ కృష్ణమరాజు భీమవరం డీఎస్పీకి మద్దతుగా నిలబడటం... ‘‘పవన్ ఇతర శాఖల్లో వేలు పెట్టడం సంతోషం’’ అన్న వ్యంగ్య వ్యాఖ్య విసిరేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారమంతా చూస్తే... పవన్ కళ్యాణ్ తనకు లేని అధికారాన్ని వాడారని మంత్రి లోకేశ్ మాదిరి తాను చక్రం తిప్పుతున్నానని అనిపించుకునే ప్రయత్నం చేశారని అనిపిస్తుంది.
టీడీపీ కూడా పవన్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఉత్తరం రాసిన ఇన్నాళ్లకు కూడా ఆ డీఎస్పీపై చర్య తీసుకోలేదు. కూటమి 15 ఏళ్లదంటూ తెలుగుదేశం పార్టీతో అంటకాగడానికే ప్రాధాన్యమిస్తున్న పవన్ ప్రజా సమస్యలు, జనసేన కార్యకర్తలనూ పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జూద కేంద్రాల గురించి మాట్లాడడం కొంతలో కొంత బెటర్. అయితే ఇదంతా చిత్తశుద్దితో చేశారా? లేక జనసేన ఎమ్మెల్యే ఎవరికైనా పోలీసులు సహకరించడం లేదన్న అసంతృప్తితో రియాక్ట్ అయ్యారా అన్నదానిపై పలు వార్తలు వచ్చాయి.
ఏపీలో అనేక సమస్యలుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లను పొగిడే పనిలో బిజిగా ఉంటున్నారన్న విమర్శ నుంచి తప్పించుకోవడానికి పవన్ ఈ ట్రిక్కు ప్లే చేశారా అని కొందరు సందేహిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు ఆడించే ఆటలో ఒక భాగమేనని, ప్రభుత్వం బాగా ఇబ్బంది పడుతోందన్న భావన కలిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఇలా వ్యవహరిస్తుంటారని వైసీపీ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో ఉప సభాపతి రఘురామ కృష్ణమరాజు జోక్యంతో ఈ కధ కొత్త మలుపు తీసుకున్నట్లయింది. తానూ పవన్ అభిమానినే అని చెబుతూనే రాజు భీమవరం డీఎస్పీ మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడం, విచారణలో అన్ని తేలుతాయని వ్యాఖ్యానించడం విశేషం.. పైగా పేకాట అన్నది అక్కడి సంస్కృతిలో భాగం అన్నట్లు మాట్లాడడం మరీ విడ్డూరం.
ఇక్కడ మరో కోణం ఏమిటంటే తన పరిధిలో లేని హోం, లా అండ్ ఆర్డర్ శాఖలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం కూడా వివాదాస్పదమే. కాకపోతే ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో, పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు నేరుగా ప్రశ్నించరు. మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు కాకుండా మరో మంత్రి ఎవరైనా ఇలా వేరే శాఖలో జోక్యం చేసుకుంటే పెద్ద రభస అయి ఉండేది. మంత్రుల తగాదాగా మారేది. ముఖ్యమంత్రి రాజీ చేయాల్సి వచ్చేది. పవన్ కళ్యాణ్ పేకాట క్లబ్బుల గురించి చేసిన వ్యాఖ్య హోం మంత్రి అనితను అవమానించినట్లని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయినా, సర్దుకుపోక తప్పని స్థితిలో ఉన్నారు. అందువల్లే తమకు ఈగోలు లేవని అసహనంగా మీడియాతో వ్యాఖ్యానించారు.
గతంలో కూడా ఒకసారి పవన్ పిఠాపురంలో మాట్లాడుతూ తన వద్ద హోం శాఖ ఉండి ఉంటే శాంతి భద్రతల విషయంలో గట్టి చర్యలు తీసుకునేవాడిరి అన్నట్లుగా మాట్లాడి అనితను ఇరుకున పెట్టారు. తదుపరి వారు ఈ అంశంపై రాజీ కబుర్లు మాట్లాడుకున్నారని అంటూ లీక్ ఇచ్చి వదలివేశారు. ఇప్పుడు ఏకంగా డీజీపీ నుంచే నివేదిక కోరడం సంచలనంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి అన్నది ఒక హోదా తప్ప, ప్రత్యేకంగా మంత్రిని మించి అధికారాలేమీ ఉండవు. అయినా పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాయడంలోని ఆంతర్యం ఏమిటా అన్నది చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ రాష్ట్రంలో చట్ట విరుద్దంగా జూద కేంద్రాలు నడుస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ అధికారులకు నెలవారీ మామూళ్లు అందచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారని తెలిపారు.
పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియ చేయాలని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీకి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత పవర్ ఫుల్ మంత్రి లోకేశ్ హోం మంత్రి అనితలు ఉండగా ఫిర్యాదులు పవన్ కళ్యాణ్‌కు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు సరిగా స్పందించడం లేదా? ఈ మొత్తం ట్వీట్ చూస్తే ఏపీలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నది తెలియచేస్తుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బులకు ద్వారాలు తెరచుకున్నాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు వీటిని నడుపుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఎల్లో మీడియా సైతం వీటిని రిపోర్టు చేసింది. అయినా ప్రభుత్వంలో, పోలీసులలో పెద్దగా ఉలుకు, పలుకు లేదన్న విమర్శలు ఉన్నాయి. పవన్ దీనిపై స్పందించడానికి భీమవరం డీఎస్పీ జయసూర్యపై తనకు జనసేన నేతల నుంచి అందిన ఫిర్యాదులు ఒక కారణంగా చెబుతున్నారు. ఆయన స్థానిక జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు మాటను పట్టించుకోవడం లేదట. జయసూర్య గతంలో కూడా ఇక్కడ పనిచేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి.
ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సివిల్ తగాదాలలో తలదూర్చుతున్నారని జనసేన నేతలు కొందరి ఆరోపణ. దీనిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన జిల్లా ఎస్పీతో మాట్లాడారట. డీఎస్పీపై విచారణ చేయాలని ఆయన కోరారట. దీనికి సంబంధించి మరో వాదన కూడా ఉంది. భీమవరం ప్రాంతంలో ఉండే పేకాట క్లబ్బులు సజావుగా సాగినంతకాలం ఎలాంటి ఫిర్యాదులు వెళ్లలేదట. గత కొద్దికాలంగా పేకాట క్లబ్లులు నడవడం లేదట. దాంతో కొంతమంది ఆదాయానికి భారీగా గండి పడుతోందట.ఈ అంశాన్ని జనసేనలోని మరో వర్గం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్గనైజ్డ్ జూద కేంద్రాల బదులు అపార్టుమెంట్లు, శివారు ప్రాంతాలలో జూద క్రీడలు జరుగుతున్నాయట. తమ ఆదాయం పోయిందన్న అసంతృప్తితో కొందరు జనసేన నేతలు పవన్‌కు ఫిర్యాదు చేశారా? అన్న ప్రచారం సాగుతోంది.
అయితే ఒక్క భీమవరం గురించే మాట్లాడితే అది మరో రకంగా సమస్య అవుతుంది కనుక, రాష్ట్రం అంతటి పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారన్న విశ్లేషణ వస్తోంది. అయితే కేవలం పేకాట క్లబ్ గొడవపైనే పవన్ ఎందుకు స్పందించారు. ఈ ఏడాదిన్నర కాలంలో జరిగిన అనేక ఘటనలపై ఎందుకు మాట్లాడలేదో అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు ఈ మధ్య జరిగిన కందుకూరులో జనసేన అభిమాని ఒకరు దారుణ హత్యకు గురి కావడం, శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించడానికి టీడీపీ ఎమ్మెల్యే పురమాయించడం, తదుపరి డ్రైవర్ హత్యకు దారి తీయడం వంటి ఘటనలపై ఎందుకు పవన్ నోరు విప్పలేదని జనసేనే నేతలే, ముఖ్యంగా కాపు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
అలాగే రాష్ట్రం అంతటిని కుదిపేసిన నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారం, విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపులు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఇతరత్రా ఎమ్మెల్యేల అవినీతి కార్యకలాపాలు మొదలైనవాటిపై పవన్ ఎందుకు గళం విప్పడం లేదన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. జనసేన ఒక ఇండిపెండెంట్ పార్టీగా కాకుండా, కేవలం టీడీపీ అనుబంధ పార్టీ అన్నట్లుగా రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్‌గా పేకాట క్లబ్ ల గురించి లేఖ రాయడం సహజంగానే కలకలం రేపుతుంది. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై ,ప్రభుత్వం పై వస్తున్న ఆరోపణల గురించి పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబుకు లేఖలు రాస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు పేకాట క్లబ్ ల గురించి ఆయన మాట్లాడినా విమర్శలు వచ్చేవి కావు.
అందువల్లే చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ ఈ సమస్యను లేవనెత్తారా? ఇతర అంశాలను డైవర్ట్ చేయడమే లక్ష్యమా అన్న అనుమానాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా కనీసం పేకాట క్లబ్ లు ,జూద కేంద్రాల వల్ల ఎపిలో ప్రజలకు నష్టం జరుగుతోందన్న సంగతిని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషించాలి.కాకపోతే పవన్ ఇచ్చిన ఆదేశాలకు పెద్దగా విలువ లేదని తెలుగుదేశం పెద్దలు తేల్చేసినట్లే అనుకోవాలా?ఈ రకంగా పవన్ పరువు భీమవరం కాల్వలో కలిసినట్లేనా?

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


