రాజకీయ పార్టీలకు మాటకు కట్టుబడే లక్షణం.. నిబద్ధత, ఆయా అంశాలపై స్పష్టమైన వైఖరి చాలా ముఖ్యం. లేకపోతే అది అవకాశవాద రాజకీయం అవుతుంది. ప్రజల తిరస్కారానికి కారణమవుతుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరానికి తగ్గట్టు మాటలు మార్చడంలో సిద్ధహస్తుడన్న పేరు ఇప్పటికే సంపాదించి ఉండటం ఇందుకు కారణం.
ఇప్పుడీ ప్రస్తావన మరోసారి ఎందుకొచ్చిందంటే.. టీడీపీతోపాటు జనసేన కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటన్న చర్చ వచ్చినందుకు! అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పీఆర్సీ వస్తామని మధ్యంతర భృతి ప్రకటిస్తామని, బకాయిలు చిటికెలో తీర్చేస్తామని ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గద్దెనెక్కిన 16 నెలల తరువాత ఇప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగా లేదని కథలు చెబుతున్నారు. ఉద్యోగుల బిల్లులు బకాయిలు సుమారు రూ.34వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ముక్తాయించారు. సహజంగానే దీనిపై ఉద్యోగులు మండి పడుతున్నారు. ఉద్యోగ నేతలు కొందరితో అనుకూల ప్రకటనలు చేయించుకున్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పు మాదిరిగానే ఉంది.
2019లో జగన్ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను, ప్రజల ఇళ్ల వద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నెరవేర్చారు. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ ఇవి వృథా అని ఎన్నడూ చెప్పలేదు. తొలగిస్తామని కూడా అనలేదు. పైగా వలంటీర్లకు జగన్ ఇస్తున్న రూ.5వేలు సరిపోదని, తాము అధికారంలోకి వస్తే రూ.పది వేలు ఇస్తామని ఉగాది నాడు పూజ చేసి మరీ ప్రకటించారు. కానీ ఇప్పుడేమో దానిని ఎత్తివేశారు. అదేమంటే వేస్ట్ అని చెబుతున్నారు. ఇది పక్కా మోసమే కదా?.
వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకం కింద కుటుంబంలో ఒకరికి రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తే, చంద్రబాబు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ప్రతి విద్యార్ధికి డబ్బు ఇస్తామని ఎందుకు ప్రకటించారు? దాని వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నాశనం అవడం లేదా? చంద్రబాబు 2014 టర్మ్‌లో రూ.లక్ష కోట్ల మేర రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెబితే ఆయనకు విజన్ ఉన్నట్లు! అది సాధ్యం కాదని చెబితే జగన్ చేతకాని వాడన్నట్లు చెప్పేవారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చేశారు?. రైతులకు అరకొరగా రుణమాఫీ చేసి చేతులెత్తేశారే. ఇప్పుడు ఎవరికి విజన్ ఉన్నట్లు? జగన్ నిజాయితీగా చెప్పినట్లు అంగీకరించాలి కదా!. జగన్ రైతులకు రూ.13,500 చొప్పున రైతు భరోసాగా ఇస్తామని తెలిపి దానిని అమలు చేశారు. అది తప్పైతే చంద్రబాబు ఎందుకు ఏకంగా రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు?. జగన్ కేంద్రం ఇచ్చిన మొత్తంతో కలిపి ఇస్తే ఆక్షేపించిన చంద్రబాబు దానితో నిమిత్తం లేకుండా ఇస్తానని ప్రకటించి అసలుకే మోసం చేశారే. ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది కేవలం రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చారు కదా!.
2014 టర్మ్‌లో తెలంగాణ కన్నా ఎక్కువ ఇంటెరిమ్ రిలీఫ్ ఇచ్చి తానేదో గొప్ప పని చేశానని చెప్పుకోవడానికి యత్నించారు. అప్పుడేమో ఆర్థిక వ్యవస్థపై భారం పడినట్లు కాదు. జగన్ టైమ్ లో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 27 శాతం ఐఆర్ ఇచ్చి, తదుపరి 23 శాతం పీఆర్సీ ఇస్తే రివర్స్ పీఆర్సీ ఇస్తారా అని తప్పుడు ప్రచారం చేశారే! చంద్రబాబు చెబుతున్నట్లు ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం తగ్గించడానికి జగన్ యత్నిస్తే అది తప్పు చేసినట్లు అవుతుందా?. తాను ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం పెంచితేనేమో ఉద్యోగుల కోసమా? ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే ఎన్నికలలో చెప్పిన విధంగా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి కదా!. డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి కదా! నాలుగు డీఏ బకాయిలకు ఒకటే ఎందుకు ఇచ్చారు?.
పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే, ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే విజయవాడకు వెళ్లిన మాట నిజం కాదా? ఆ తర్వాత సచివాలయ ఉద్యోగులను అదనపు రాయితీలు ఇచ్చి మరీ అక్కడకు తరలించారే. వారానికి ఐదు రోజుల పని చేయండని చెప్పారే. హైదరాబాద్‌లో భవనాలు వదులుకుని వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దె భవనాలను విజయవాడ, గుంటూరులలో తీసుకున్నారే. ఇదేమి ప్రభుత్వంపై భారం పడలేదా? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తామన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ గుర్తుకు రాలేదా!. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని ఆశ పెట్టినప్పుడు రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదని అనుకున్నారా? లేక ఎలాగూ జనాన్ని మాయ చేయడమే కదా అని అనుకున్నారా?. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడం గొప్ప విషయంగా ప్రచారం చేస్తుంటారు. దానివల్ల స్త్రీలకు చాలా ఆదా అయిందని ఊదరగొడుతుంటారే! అది మంచి హామీనా?. ఆర్టీసీని ముంచే హామీనా?. చంద్రబాబు ఏమి చేసినా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఏం కాదా?. అదే జగన్ చేస్తే నాశనం అయినట్లా? ఇదేం అన్యాయం.
ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎలా వ్యవహరించినా చెల్లిపోతుందన్నది కూటమి పెద్దల విశ్వాసం కావచ్చు. గూగుల్ పేరుతో వస్తున్న అదానీ, రైడెన్ డేటా సెంటర్ ఇచ్చేది కేవలం 200 ఉద్యోగాలే అయినా ఏకంగా రూ.22వేల కోట్ల ప్రజా ధనాన్ని తేలికగా ఇచ్చేస్తున్నారే. దానివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన విమర్శకు మీరెచ్చే జవాబు ఏమిటి?. వేల కోట్ల లాభాలలో ఉన్న టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలకు రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టడం, ఉర్సా, లూలూ వంటి కంపెనీలకు ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకు కేటాయించడం ప్రజలకు సంపద సృష్టించినట్లు అవుతుందా?. గూగుల్ తదితర కార్పొరేట్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక ఆ కంపెనీలలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందా అన్న సందేహాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేస్తే పరిస్థితి తెచ్చారే!.
జగన్ టైమ్‌లో అప్పులు తేవడాన్ని ఆక్షేపించిన చంద్రబాబు తాను 16 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమి చేశారో ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు? డీబీటీ విధానం అంటే నేరుగా ప్రజల ఖాతాలలోకి డబ్బులు వేయడం తప్పని చెబుతున్న చంద్రబాబు తాను అదే పని ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వెల్లడించాలి కదా!. అసలు ఎన్నికల సమయంలో డీబీటీ విధానం విదేశాలలో ఉందని, తన కుమారుడు లోకేష్ దీనిపై సలహా ఇచ్చారని, అది గొప్ప సంగతి అని, తాను రూ.రెండు వేల చొప్పున ఇస్తానని ప్రకటించారే. జగన్ ఎక్కడా అవినీతి లేకుండా డీబీటీ అమలు చేస్తే అది తప్పని చెబుతున్నారు.
పోనీ ఆ సంక్షేమ స్కీములు అమలు చేయడం సరికాదని చెబుతారా అంటే అలా చేయరు. పైగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభలు పెడతారు. ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను మార్చేయాలన్న భావనతో చంద్రబాబు సర్కార్ ఉందా? ఎన్నికల ప్రణాళికలో సీపీఎస్, అవుట్ సోర్స్, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడానికి కొత్త గాత్రం అందుకున్నారా?.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


