ఎల్లోమీడియాకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుంది! | Yellow Media in Andhra Pradesh Defending Govt, Not Answering People’s Concerns: Kommineni Srinivasa Rao | Sakshi
Sakshi News home page

ఎల్లోమీడియాకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుంది!

Aug 30 2025 11:50 AM | Updated on Aug 30 2025 12:04 PM

 KSR Comment Comments On Chandrababu And Yellow Media

ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పగలగాలి. ముఖ్యమంత్రి లేదా మంత్రి, తదితరల అధికారులైనా ఈ పని చేయాలి. వివరణైనా ఇవ్వాలి. కానీ ఏపీలో ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ఎల్లోమీడియా నుంచి సమాధానాలు వస్తూండటమే వింత. విమర్శించేవారిని దూషించి అక్కసు తీర్చుకోవడం వీరి ప్రత్యేకత కూడా. ఇక రాసే మురికి వార్తలంటారా? వాటికి అంతేలేదు. నిజాలను వక్రీకరించి ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకుని మరీ ఎదురుదాడి చేస్తూంటుంది ఇది. విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ సమాచారంతో కూడిన ఒక ప్రకటననను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వివిధ మీడియాలలో ప్రముఖంగా వచ్చిన ఆ వ్యాఖ్యలను ప్రభుత్వ పెద్దలెవరూ ఖండన ఇవ్వలేకపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా జగన్‌ను విమర్శించేందుకు రెడీగా ఉండే చంద్రబాబు కూడా ఈ ఆర్థికాంశాలపై పెదవి విప్పితే ఒట్టు. దీంతో ఎల్లో మీడియా ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. 

తెలుగుదేశం పార్టీకి బాండ్ వాయించే ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. జగన్ ప్రకటన సాక్షిలో 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం’’  అన్న హెడింగ్ తో వచ్చింది. కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిందన్న వివరమూ అందులో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో ఇది 56 శాతం అని జగన్ చెప్పారు. అవినీతి వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆరోపించారు. ఐదేళ్ల తన హయాంలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే అందులో 56 శాతం అప్పు చేసిందని  జగన్  వివరిచారు. ఇది నిజమా? కాదా? అన్నదానిపై ప్రభుత్వం సాధికారికంగా జవాబు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కాని, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గాని, ఆర్థిక శాఖ అధికారులు కాని కిమ్మనలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం స్పందించింది. 

టీడీసీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి బాగా డామేజీ అయిందని, చంద్రబాబు పరువు దెబ్బతిందని భావించిన ఆ మీడియా తన పత్రిక, టీవీ ఛానెల్ ద్వారా గుండెలు బాదుకుంటూ ఒక స్టోరీని ప్రచారంలో పెట్టింది. దానికి వారు పెట్టిన హెడింగ్ ‘నాడు అరాచకం-నేడు అభివృద్ధి’ అని. అలాగని అప్పట్లో జరిగిన అరాచకం ఏమిటో చెప్పారా అంటే అదేమీ కనిపించలేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని వివరించిందీ రొటీన్ ఊకదంపుడు వ్యవహారమే. జగన్  ప్రభుత్వం అప్పు చేసింది కాని రోడ్లు వేయలేదట. ఇప్పుడు రోడ్లు వేసేశారట. ఏ ప్రభుత్వంలో అయినా రోడ్లు వేయడం నిరంతరం ప్రక్రియ. అప్పట్లో ఎక్కడ ఏ చిన్న రోడ్డు పాడైనా భూతద్దంలో చూపుతూ ప్రజలను మోసం చేసింది ఎల్లో మీడియా. అలాగని అన్ని రోడ్లు బాగా ఉన్నాయని చెప్పడం లేదు. కాని ఎల్లో మీడియా రాసినంత దారుణంగా పరిస్థితి లేదు. పైగా అప్పట్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త రోడ్ల మన్నిక పెంచేందుకు ప్రయత్నం చేశారు.

 ఆ విషయాలను దాచిపెట్టి ఇప్పుడే  రోడ్లు వేసేసినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం  కూడా అనేక  రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని సచిత్ర సమేతంగా వార్తలు వస్తున్నాయి. పాడైన రోడ్లు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అయినా రోడ్లు అనేకం ఎందుకు అధ్వాన్నంగా ఉన్నాయి? ఏలూరు వద్ద ఒక రోడ్డును చూస్తే అంతా గోతులమయంగానే ఉంది. ఏజెన్సీలో రోడ్ల కోసం జనం గుర్రాలెక్కి ఎందుకు నిరసన చెబుతున్నారు? మిగిలిన రూ.1.84 లక్షల అప్పును ఏమి చేశారో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరో ఈ మీడియా చెప్పి ఉండాల్సింది. 

అమరావతిలో పనులు జరిగిపోతున్నాయట. అవును! వరద నీటిని తోడే మోటార్లు నిత్యం పని చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్, హడ్కో వంటి సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. ఆ నిధులు ఖర్చు చేస్తున్న తీరు, అందులో జరుగుతున్న అవినీతిపై వస్తున్న కథనాలు మాటేమిటి? భూమి ఖర్చు లేకపోయినా, చదరపు అడుగుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలకు ఎన్నడైనా జవాబిచ్చారా? పోలవరం పనులు జరుగుతున్నాయట. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, ఏపీ తెస్తున్న అప్పులు దాని కోసం ఎందుకు ఖర్చు చేస్తారు? పాఠకుల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉందా? 

ఐదేళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసినా, కొన్ని హామీలలో మాట తప్పారని ఈ పత్రిక అంటున్నది. కొన్ని విస్మరించారని చెబుతోంది. ఏ హామీ అమలు చేయలేదో ఎందుకు ఉదహరించలేక పోయింది? అదే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ  ఎల్లో మీడియా బుకయింపు. ఎన్నికల హామీలు దాదాపుగా నెరవేర్చిందట. జగన్ హామీలకు సంబంధించి రూ.2.70 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా వారి ఖాతాలలో వేశారన్నది వాస్తవం.దాని గురించి చెప్పలేదు. సంక్షేమానికి ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లను వెచ్చించిందో కూటమి ప్రభుత్వం వివరించగలదా? ఒకటి, రెండు తప్ప, మిగిలిన అన్ని ఎన్నికల హామీలను ఒక ఏడాది ఎగవేసింది నిజం. ఈ ఏడాది ఇస్తున్నప్పటికీ కోతలు పెడుతుండడం, ప్రజలు ఆందోళలనకు దిగుతుండడం నిత్యం చూస్తేనే ఉన్నాం. 

జగన్ టైమ్‌లో అలాంటివి కనిపించాయా? జగన్ 98 శాతం హామీలను నెరవేర్చారు. ఆయన తన  మానిఫెస్టోని ధైర్యంగా జనం ముందుంచి చేసిన వాటి గురించి చెప్పగలరు. మరి చంద్రబాబు అలా తన మానిఫెస్టోలోని వాగ్దానాలు చదువుతూ ఎంతవరకు అమలు చేసింది వివరించగలుగుతారా? నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, బీసలకు ఏభై ఏళ్లకే ఫించన్‌ తదితర హామీలను ఏమి చేశారో ఆంధ్రజ్యోతి వివరించి ఉండాల్సింది. అలాగే దేవుడి సాక్షిగా పండగ రోజు వలంటీర్లకు ఓట్టేసినట్లు ఇచ్చిన హామీ ఏమిటి? ఆ తర్వాత మాట మార్చిన సంగతేమిటి? రైతు భరోసాపై అప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. 

తల్లికి వందనంలో ఏమి ప్రామిస్ చేశారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ లకు ఎందుకు లింక్ పెడుతున్నారు? ఉద్యోగుల సీపీఎస్ ఏమి చేశారు? వారి పీఆర్సీ హామీ ఏమైంది?అవన్నే కాదు. వారి డీఏ బకాయిలను ఇస్తున్నారా? ఇన్ని పెట్టుకుని ఏదో ఒకటి దబాయించి చంద్రబాబు తరపున ప్రచారం చేస్తే జనం నమ్మేస్తారా? జగన్ అభివృద్ధి చేయలేదట. ఆయన  హయాంలో కుప్పంకు నీరు తెచ్చారా. లేదా? ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్‌ను  చంద్రబాబు ప్రారంభించారా? లేదా? ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, ఇలా వేలాది భవనాలు నిర్మిస్తే అది అభివృద్ది కాదా? నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండ్ సెంటర్ల నిర్మాణం ఆరంభించింది ఆయన కాదా? రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాటేమిటి? జగన్ తెచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని ఎల్లో మీడియా చెబుతోందా? 

జగన్  నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయలేదా? ఆరవై నాలుగు లక్షల మందికి ఫించన్లు, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అలాంటి స్కీములు, ఫించన్లు ఇవ్వడం రాష్ట్ర వికాసం అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇలాంటి మీడియాను జనం నమ్మవచ్చా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గొప్ప విషయం అని ఈ పత్రిక చెబుతోంది. అన్ని బస్ సర్వీస్‌లలో ఈ స్కీమ్ అమలు చేయకపోవడం మోసం కిందకు వస్తుందా? రాదా? ఉచిత ప్రయాణానికి మహిళలు ఎక్కువమంది వస్తుండడంతో బస్ సర్వీసులను తగ్గించేశారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల స్త్రీలు గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక చోట అలాంటి ఘటన పోలీస్ కేసు కూడా అయింది. 

అదే టైమ్‌లో ఫ్రీబస్ కారణంగా నష్టపోతున్న  ఆటోలవారు ఈ బస్సులలో భిక్షాటన చేస్తూ నిరసన చెబుతున్నారు. వారికి ఇచ్చిన ప్రామిస్ ఏమైంది. అసలు ఇదే మీడియా యజమాని పలుమార్లు ఈ స్కీములన్నీ వృథా అన్నట్లుగా మాట్లాడిన సంగతేమిటి? జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే గొప్ప అన్న చందంగా ప్రచారం చేస్తుంటారే. కరెంటు చార్జీలు పెంచను, పైగా తగ్గిస్తాను అని చంద్రబాబు పలుమార్లు అన్నారు కదా? ఆ మాటమీద ఎందుకు నిలబడలేకపోయారు? దానిని వదలిపెట్టి గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రచారం చేయడంలో అర్ధం ఉందా? జగన్ టైమ్ లో రూ.3.32 లక్షల కోట్ల అప్పే చేశారన్న విషయం తేలినా, కేంద్రం కూడా చెప్పినా, టీడీపీతోపాటు ఈ ఎల్లో మీడియా వైసీపీపై విషం చిమ్ముతుంది. 

జగన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వంలో ఆదాయం తగ్గిందా? లేదా? కేంద్ర ప్రభుత్వం సొంత ఆదాయ వృద్ది 12 శాతం ఉండగా, రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుదల కేవలం మూడు శాతమే అని జగన్ చెప్పింది నిజమా? కాదా? ఆదాయాలు తగ్గి, అప్పులు పెరగడం ఆందోళనకరమని జగన్ అన్నారు. దానిని అంగీకరిస్తారా?లేదా? ఎల్లో మీడియాగా పేరొంది టీడీపీకి మద్దతుగా నిలిచే ఈనాడు, ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రిక ఆర్థిక ప్రయోజనాలను పుష్కలంగా నెరవేరుస్తూన్నప్పుడు రాష్ట్రం అతా బ్రహ్మాండంగానే  ఉన్నట్లు కనిపిస్తుంది.

 ఈటీవీ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో రూ.92 లక్షలు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతికి విశాఖలో మళ్లీ కోట్ల రూపాయల విలువైన భూమి ఇస్తున్నారట. వీరిద్దరికి ప్రచార ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి. అందుకే ప్రజల పక్షాన కాకుండా , ప్రభుత్వం తరపున  ఇలాంటి అరాచకపు, అబద్దపు  రాతలు రాస్తుంటారు! జగన్ చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉండవచ్చు కాని, ఎల్లో మీడియా పంట మాత్రం బాగానే పండుతోందన్న సంగతి ప్రజలందరికి తెలుస్తూనే ఉంది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement